How did the earth break up?…………………….
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి అంతా కేవలం రెండు (భూమి, సముద్రం) భాగాలుగానే విభజింపబడి ఉందని భూగోళ శాస్త్రవేత్తలు ధృవీకరించారు.
సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 4
బ్రహ్మాండ పురాణంలో లోకకల్పనం గురించి ఇచ్చిన వివరణలో… సూతమహర్షి చుట్టూ చేరిన మునిపుంగవులు ఆయనను భూమి యొక్క స్థితిగతులు, అందులోని ఖండములు ఎన్ని? వాటి పొడవు, వెడల్పులు ఎంత? అని అడిగినప్పుడు, ఆయన వారడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూనే “అవి అచింత్యములు” అని అంటారు.
అంటే, ఆలోచించాల్సిన అవసరం లేనివి అని అర్థం. ఎందుకంటే, అవి అస్థిరమైనవి. నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంటాయి. అవి అస్థిరమైనవని ఆయన అనడానికి కారణం ఉంది. అది ఏంటంటే…..ఈ సౌరమండలం మొత్తంలో tectonic plateల (అంతర్భాగ పొరలు లేదా పలకలు) కదలికలు ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే.
ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఒకానొకప్పుడు భూమి మీద ఒకేఒక land mass (భూ ఖండం) , అపారమైన జలరాశి మాత్రమే ఉండేవి. ఈ land massని “Pangaea” ( పాంజియా… ఈ పదం గ్రీకు భాష నుండి స్వీకరించబడినది, అర్థం all land, అంటే అంతా భూభాగం) అని అపారమైన జలరాశిని “Panthalassa” ( పాంథలస్సా… ఇదీ గ్రీకు భాష నుండి స్వీకరింపబడినదే, అర్థం all water, అంటే అంతా నీరు) అని పిలిచేవారు.
సుమారుగా 18 నుండి 20 కోట్ల సంవత్సరాల క్రితం పాంజియా అడ్డంగా అంటే భూమధ్యరేఖకు సమాంతరంగా రెండు ముక్కలుగా బద్దలైంది. వాటిని “Laurasia” ( లారేసియా… ప్రస్తుత ఉత్తర అమెరికా, యూరప్, ఆర్కిటిక్, ఆసియా ఖండాలు) అనీ, “Gondwana land” (గోండ్వానా… ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, [ఇండియా], ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాలు) అని పిలిచారు. తరువాత ఈ రెండు భూఖండాలు నిట్టనిలువుగా విభజింపబడి, వాటి మధ్యలో అట్లాంటిక్ మహా సముద్రం ఏర్పడింది.
కాలక్రమేణా మరింతగా విభజింపబడి, గోండ్వానా నుండి విడిపడిన ఇండియా ఆసియా వైపు ప్రయాణించడం ద్వారా ఆ ఖండాన్ని గుద్దుకొని భూమి పై అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు ఆవిర్భవించడానికి కారణమైంది. ఆస్ట్రేలియా ప్లేట్ గోండ్వానా నుండి విడిపడి తూర్పు-దక్షిణ మూలకు జరిగిపోయింది.
అయితే, ఈ టెక్టానిక్ ప్లేట్ల కదలికలు నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అని శాస్త్రవేత్తలు నిర్థారించారు. అత్యంత త్వరలో ( అంటే, సుమారుగా రాబోయే కొన్ని వేల లేదా లక్షల సంవత్సరాల లోపు ) ఆఫ్రికా ప్లేట్ నుండి సోమాలీ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ నుండి కాలిఫోర్నియా ప్లేట్ విడిపోవడం… ముఖ్యమైనవిగా గుర్తించారు.
ఈ టెక్టానిక్ ప్లేట్ల పరస్పర ఘర్షణ, ఒత్తిడి ,వాటి కదలికల ఆధారంగా వచ్చిన భూకంపాల వలనే సునామీ లాంటి ఉపద్రవాలు వచ్చాయని మీకందరికీ తెలిసిన విషయమే.
చెణుకులు :
* టెక్టానిక్ ప్లేట్ల కదలికలు అధికంగా సంభవించే “పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్” గుర్రపు నాడా ఆకారంలో 40,000 కి.మీ విస్తరించి ఉంది.
* ఇండియన్ ప్లేట్ నిరంతరాయంగా రమారమి 26 నుండి 36 మిల్లీమీటర్లు ప్రతీ సంవత్సరం ఆసియా ప్లేట్ వైపు కదులుతూనే ఉంది. తదనుగుణంగా హిమాలయాలు కూడా తమ ఎత్తును పెంచుకుంటూనే ఉన్నాయి.
* అర్థ చంద్రుడి కన్నా పూర్ణ చంద్రుడు రెట్టింపు ప్రకాశవంతంగా ఉంటాడనేది ఒక అపోహ. నిజానికి, పూర్ణ చంద్రుడు… అర్థ చంద్రుని కన్నా తొమ్మిది రెట్లు ప్రకాశవంతంగా ఉంటాడు.
* ఆకాశం నీలంగా ఎందుకుంటుందంటే… సూర్యరశ్మి భూ వాతావరణంలోనికి చొచ్చుకు వచ్చినప్పుడు తక్కువ తరంగ దైర్ఘ్యం గల వైలెట్, బ్లూ రంగులు విచ్ఛేదింపబడటం వలన.
* భూ కేంద్రం ఇనుము – నికెల్ లోహాలతో సమ్మిళితమై 7000 డిగ్రీల సెంటీగ్రేడ్ తో మండుతూ ఉంటుంది. ఇది చంద్రుడిలో దాదాపు 80%కి సమానం.
___ పులి ఓబుల్ రెడ్డి