ఎవరీ ఈ లాటరీ కింగ్ మార్టిన్ ?

Sharing is Caring...

Lottery king who bought bonds worth thousands of crores…………………

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు బహిర్గతం అయ్యాయి .. బయటకొచ్చిన పేర్లలో  ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ పేరు అందరినీ ఆకట్టుకుంది. 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను ఈ సంస్థ కొనుగోలు చేసింది.  

దీంతో ఇప్పుడు ఆ సంస్థ యజమాని ఎవరా అని గూగుల్ సెర్చ్ లో జనాలు వెతుకుతున్నారు. ఇంతకూ అతగాడు ఎవరో కాదు లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌ .. ఈ మార్టిన్ ఫ్లాష్ బ్యాక్ ఆసక్తికరం.  శాంటియాగో మార్టిన్‌ ఒక కూలీగా తన జీవితాన్ని ప్రారంభించాడు.

ఆ తర్వాత మార్టిన్ కేవలం 13 సంవత్సరాల వయస్సులో లాటరీ పరిశ్రమలో తన మొదటి అడుగులు వేసాడు.ఇపుడు భారత్‌లో రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు సమకూర్చే స్థాయికి ఎదిగాడంటే మార్టిన్ ఏస్థాయిలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.

ఆయన జీవితంలో చాలా వివాదాలు ఉన్నాయి.  ఆయన కంపెనీకి చెందిన వెబ్‌సైట్‌లో మార్టిన్‌ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వివరాలు పొందుపరిచారు. మార్టిన్‌తొలినాళ్లలో మయన్మార్‌లో కూలీగా పనిచేశారు. 1988లో భారత్‌కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు.  

ఆవ్యాపారాన్ని పక్కరాష్ట్రాలైన  కర్ణాటక, కేరళకు విస్తరించారు. కొన్నాళ్ల తర్వాత  ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. పాత వ్యాపారాన్నే అక్కడ పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు.మెల్లగా భూటాన్‌, నేపాల్‌లో కూడా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు.  శాంటియాగో మార్టిన్  వ్యాపార సామ్రాజ్యం   భారతదేశ సరిహద్దులు దాటి విస్తరించింది.  

మార్టిన్ గ్రూప్ కంపెనీలలో  మార్టిన్ మయన్మార్,  మార్టిన్ యాంగోన్ కంపెనీలు రియల్ ఎస్టేట్, నిర్మాణం,  విజువల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ ఎడ్యుకేషన్‌ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.   వ్యాపారం విస్తరించేకొద్దీ  మార్టిన్ శాంటియాగో వివాదాల్లో చిక్కుకున్నాడు.

సిక్కిం ప్రభుత్వాన్ని రూ. 4,500 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. లాటరీలు  ఎక్కువగా ఉన్న కేరళలో రాజకీయ నిధుల కేసులో కూడా మార్టిన్ ఇరుక్కున్నాడు. 2008లో మార్టిన్  సీపీఎం కేరళ యూనిట్ కు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చాడని అంటారు. పార్టీ నేత విజయన్‌ ఈ సొమ్మును వెనక్కి ఇచ్చారట.

దేశం అంతటా లాటరీల కొనుగోలుదారులు…  అమ్మకందారులతో పెద్ద మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను మార్టిన్  ఏర్పాటు చేసాడు.  ప్రస్తుతం ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ లాటరీ ట్రేడ్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్‌ వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది.

ఆయన సారధ్యంలోని ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వరల్డ్‌ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది. ఇది ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో కార్యకలాపాలు  నిర్వహిస్తుంది.
ఫ్యూచర్‌ గేమింగ్ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై  పలు మార్లు ఈడీ దాడులు చేసింది.

దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను కూడా అటాచ్‌ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీ టిక్కెట్లను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. మార్టిన్‌ కంపెనీలు బహుమతి పొందిన టికెట్ల విలువను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఇక 2011లో కోయంబత్తూర్‌లో మార్టిన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణలు, మోసం చేయడం వంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!