బిర్తి జలపాతపు హోరులో …..

Sharing is Caring...

Thopudu bandi  Sadiq  ………………………………………..

ఉత్తుంగ హిమశిఖరాల పైన ఘనీభవించిన మంచు క్రమంగా కరిగి వందల అడుగుల లోతుల్లోని లోయల్లోకి జారుతుంటే అదో అద్భుత జలపాతం అవుతుంది.అలాంటి మహోధృత జలపాతం ఎదురుగా నిల్చొని రెండు చేతులూ చాచి ఆవాహన చేసుకుంటే పంచభూతాలు నీ ఆత్మను తట్టి లేపుతాయి.అలాంటి అనుభవం,అనుభూతి నాకు బిర్తి జలపాతం ఎదుట నిల్చున్నప్పుడు కలిగాయి.

ఉత్తరాఖండ్ లోని కుమావున్ పర్వత శ్రేణుల్లో ఉన్న పితోర్ఘడ్ జిల్లా మున్సియారీ పట్టణానికి చేరువలోని తేజరమ్ గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ బిర్తీ జలపాతం ఉంది.ఉత్తరాఖండ్,హిమాలయాలు అంటేనే అడుగడుగునా వందలాది జలపాతాలుంటాయి.అలాంటి వందలాది జలపాతాల రారాజు,దాదాపు నాలుగొందల అడుగుల ఎత్తునుంచి జాలువారే ఈ జలపాతాన్ని చూస్తుంటే ఆత్మ లొలొపలి పొరల్లో అలౌకిక సంగీతపు అలజడి చెలరేగుతుంది.అక్కడికి ఎలా చేరుకున్నామో అని గుర్తు చేసుకుంటే …..

యాత్రానుభవం
నైనితాల్ నుంచి బయలుదేరి ఒకరోజు కాస్వానీలో గడిపి మరుసటి రోజు సాయంత్రం కారులో మున్సియారీ బయలుదేరాం.ఇక్కడ మనమెంత గొప్ప డ్రైవర్లం అయినా అక్కడ మనం డ్రైవింగ్ చేయకూడదు.అందుకే హిమాలయాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లు మాత్రమే డ్రైవ్ చేస్తారు.అలాంటి ఒక డ్రైవర్ ఉన్న క్యాబ్ లో మా ప్రయాణం మొదలైంది.

బయలుదేరిన గంటకే కుంభవృష్టి మొదలై దాదాపు గంటన్నరసేపు నిరాఘాటంగా కొనసాగింది.ఎటు చూసినా నీళ్లే.వర్షం వెలిసే వరకు ఆగి మళ్లీ ప్రయాణం మొదలెట్టాం.కొంతదూరం వెళ్ళాక మళ్లీ వర్షం.అయితే ఈసారి అంత ఉధృతంగా లేదు.ఆగితే ఆలస్యమవుతుంది.చెక్ పోస్ట్ మూసేస్తారు.ఇబ్బంది అవుతుంది అంటూ డ్రైవర్ ప్రయాణం కొనసాగించాడు.

సరిగ్గా చెక్ పోస్ట్ చేరే సరికి రాత్రి 8.30 అయ్యింది.వర్షం కురుస్తూనే ఉంది.గేట్ దాటిన ఆఖరి వాహనం మాదే.మా వెనుక ఇంకో వాహనం ఏదీ లేదు.మాకన్నా అర్ధగంట ముందు మరో వాహనం మాత్రం వెళ్లిందనీ, రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉందనీ జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరించారు అక్కడున్న సిబ్బంది.ఇక అక్కడ నుంచి మొదలైంది.

కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని కటికచీకటి.కారు హెడ్ లైట్ల వెలుగులో ముందు కురుస్తున్న వర్షం.గుంతలు పడి మొనదేలిన రాళ్లు పరుచుకున్న రోడ్డు.ఐదడుగులకు మించి ముందేమీ కనిపించటం లేదు.ఫర్లాంగుకు ఒక జలపాతం.కొండలమీద కురిసిన వర్షం రోడ్డుకు అడ్డంగా దూకుతుంటే ఆ నీళ్ల కిందనుంచి ప్రయాణం.నీళ్లు పడ్డ చోటల్లా మోకాళ్ళోతు గుంతలు,రాళ్లు.అందరం ఊపిరి బిగపట్టి కూర్చున్నాం.

నలుగురం ఉన్నా చీమచిటుక్కుమన్న శబ్దం కూడా లేదు.అలా ఏకధాటిగా మూడుగంటలు మా ప్రయాణం సాగింది.అరివీర భయంకరుడైన మా డ్రైవర్ తన ఇన్నేళ్ల సర్వీసులో ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి అని చెప్పాడు.ఒకవైపు ఆకలి దంచేస్తుంది.తెచ్చుకున్న బిస్కెట్లు,నీళ్లు అయిపోయాయి.ఎట్టకేలకు అర్ధరాత్రికి మున్సియారీ సురక్షితంగా చేరాం.డ్రైవర్ తన పరిచయాలను ఉపయోగించి ఒక హోటల్ గదిని సంపాదించి పెట్టాడు.

రెండురోజులు అక్కడ గడిపి మూడోరోజు ఉదయాన్నే జాగేశ్వర్ కు బయలుదేరాం.ఆకాశం నిర్మలంగా ఉంది.ఎండ చుర్రుమని కాల్చేస్తుంది.అప్పుడే వెతుక్కుంటూ బిర్తీ జలపాతం చేరుకున్నాం.ఆ మహాజలపాతం ఎదురుగా నిల్చునేసరికి తనువు,మనసు దూదిపింజల్లా తేలిక అయ్యాయి. 

ఉత్తరాఖండ్ లోని జలపాతాల్లో ఇది అతి పెద్దది.నీటి ప్రవాహం కూడా పెద్దగా ఉంటుంది. ఈ జలపాతం సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉంది. తప్పక చూడాల్సిన ఈ జలపాతం వద్దకు జులై నుంచి అక్టోబర్ మధ్య వెళ్లడం మంచిది. జలపాతానికి దగ్గరలో వసతి కోసం  ప్రయివేట్, ప్రభుత్వ రిసార్ట్స్ ఉన్నాయి.  
   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!