సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. రజనీ తన ఆరోగ్య సమస్యల కారణంగా వెనుకడుగు వేస్తున్నారా ? లేక బీజేపీ నుంచి వస్తోన్న ఒత్తిడి తప్పించుకోవడానికి పార్టీ వాయిదా వేస్తున్నారో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అదిగో ఇదిగో వచ్చేస్తుంది పార్టీ అంటూ ప్రచారం జరిగిన క్రమంలో కొద్దీ రోజులక్రితం రజని రాసినట్టుగా ఒక లేఖ ప్రచారంలోకొచ్చింది. అందులో తాను పొలిటికల్ పార్టీ ప్రారంభించే అవకాశాలు కనబడటం లేదని, ఆరోగ్య సమస్యలు కారణమని రజనీ వివరించినట్టుగా ఉంది. అయితే రజనీ అది తాను రాసిన లేఖ కాదని ఖండించారు. కానీ అందులో ఆరోగ్యసమస్య ల మాట వాస్తవమని ఆయన స్వయంగా వివరించారు.
తాను తన గురించి భయపడేవాడిని కాదని … వైద్యులు మాత్రం ఈ సమయంలో పార్టీ పెట్టడం .. ప్రచారం చేపట్టడం రిస్క్ తో కూడిన వ్యవహారం కాబట్టి .. రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారని రజని వివరించారు. రజనీ ప్రకటనతో పార్టీ ఏర్పాటుపై సందేహ మేఘాలు ముసురుకున్నాయి. పలు ఉహాగానాలకు ఆయన ప్రకటన దారి తీసింది. ఇక అభిమానులు మాత్రం రజనీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ట్విట్టర్ ద్వారా రజనీని అభ్యర్థిస్తున్నారు. రాజకీయాల్లో మీరు లేకపోతే తమ ఓట్లు అన్ని నోటా కే వేస్తామని కూడా అంటున్నారు. రజనీ ప్రకటనతో అభిమానులు నీరుగారి పోతున్నారు.
ఇక రజనీ సన్నిహితుల కథనాలు మరోలా ఉన్నాయి. మొన్నటివరకు రజనీ డిసెంబర్ లో పార్టీ గురించి ప్రకటించి … ఆ వెంటనే రంగంలోకి దిగాలనుకున్నారట. మరోవైపు రజనీని పార్టీలో చేరమని బీజేపీ అధిష్టానం ఒత్తిడి చేస్తోంది. రజనీ బీజేపీ లో చేరడానికి అంత సుముఖంగా లేరని ..పొత్తుకు కూడా ఆసక్తి చూపడంలేదని చెబుతున్నారు. కొన్నాళ్ళు పార్టీని వాయిదా వేస్తె బీజేపీ కొత్త భాగస్వామిని చూసుకుంటుందని … అలా తప్పించుకోవడం కోసమే పార్టీ ఏర్పాటు వాయిదా వేస్తున్నారని అంటున్నారు. ఇదంతా రజనీ ఎత్తుగడ అని … బీజేపీ ని పక్కన పెట్టడమే అసలు వ్యూహమని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతానికి బీజేపీ నుంచి తప్పించుకున్నా … రేపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి.
ఈ ఊహాగానాల నేపధ్యంలోనే ఆరెస్సెస్ సిద్ధాంత కర్త గురుమూర్తి రజనీ ని కలవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ విషయంలో పునరాలోచన చేయాలనీ.. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన రజనీని కోరినట్టుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పెట్టకపోయినా బీజేపీ కి మద్దతు ఇస్తే చాలు అనే అంశంపై కూడా చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. రజినీ ప్రకటనతో బీజేపీ కూడా నిరాశకు గురైంది. ఎన్నికల్లో రజనీ పార్టీ తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. తాజా పరిణామాలతో బీజేపీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు.
మొత్తం మీద చూస్తుంటే రజనీ ఏ నిర్ణయం తీసుకోలేక తర్జన భర్జన పడుతున్నట్టే అనిపిస్తోంది. ఇటు అభిమానులు .. అటు బీజేపీ నేతల ఒత్తిడితో మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు రంగంలోకి దిగితే తీవ్ర పోటీ ని ఎదుర్కోవాలన్న వాస్తవాలు రజనీ ని కలవరపెడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
——— KNMURTHY