ఈ “తాతాచారి” సామాన్యుడు కాదండోయ్.!!

Sharing is Caring...

Abdul Rajahussain ………………………………

ఈ “తాతా చారి” సామాన్యుడు కాదండోయ్.! సి.పి.బ్రౌన్ దొర కొలువులో పనిచేసిన “తాతాచారిని “ కలుద్దాం రండి. తెలుగు భాషాసాహిత్యాలున్నంత కాలం మనం మరవకూడని పేరు సి.పి.బ్రౌన్ దొర.అలాంటి బ్రౌన్ దొరకు కథలు చెప్పి మెప్పించిన వాడు..‌ “తాతాచారి”.

ఈయన అసలుపేరు ” నేలటూరు వేంకటాచలం” . నెల్లూరువాసి.అయితే నెల్లూరులో పూట గడవడం కష్టం కావడంతో,తిరుపతికి పోయి వీధి బడు ల్లో పిల్లలకు చదువు చెబుతూ జీవనం కొనసాగించాడు. ఈయన మనుమని పేరు కూడా…”తాతా చారి’వురఫ్ ….”వేంకటాచలం “.

ఏమిటో ? ఈయన గొప్పదనం?

తాతాచారి అంటే ఆషామాషీవాడు కాదండోయ్. గొప్ప పండితుడు.ఉభయభాషా ప్రియుడు.కవి. తర్క,జ్యోతిష,వైద్య శాస్త్రాలు బాగా తెలిసిన వాడు.అయితే ఇతర పండితుల్లా.. కాకుండా తాను పండితుడన్న సోత్కర్ష లేనివాడు.దాని వల్లనే ఎప్పుడూ పాండితీ ప్రకర్షకు పూనుకునే వాడు కాడు.చాలా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేసేవాడు.అందుకే చరిత్ర గర్భంలో… కూరుకుపోయాడు.

బ్రౌన్ దొరవారి కొలువు 

తాతాచారి 1848 వ సంవత్సరంలో బ్రౌన్ దొర వారి కొలువులో చేరాడు.సుమారు ఏడేళ్ళు పనిచేశాడు. వృత్తిరీత్యా…,..ప్రవృత్తి రీత్యా తాతాచారి దొరవారి మనసు గెలుచుకున్నాడు.బ్రౌన్ కు బాగా సన్నిహితుడయ్యాడు. ప్రాచీన గ్రంథాల పరిష్కారంలో బ్రౌన్ దొర వారి కి చేదోడు వాదోడుగావుండేవాడు. “పల్నాటి వీరచరితం “ , “వసుచరిత్ర “ తదితర గ్రంథాల పరిష్కారంలో బ్రౌన్ దొరకు సాయపడ్డాడు.
తాతాచార్ల కథలు. 

తాతాచారి గొప్ప కథకుడు కూడా. బ్రౌన్ దొరకు చిత్ర విచిత్రాలైన కథలు చెప్పేవాడు.ఆ కథలకు మురిసి పోయిన బ్రౌన్ దొరవారు 1855 లో “ PapularTelugu tales, ” పేరుతో ఆంగ్లానువాదంతో ప్రచురించాడు.ఈ కథా సంపుటి లో మొత్తం 26కథలున్నాయి.24కథలు తాతాచారివే…మిగిలిన రెండు కథలు కృష్ణమాచారివి.

99 పేజీల కథల పుస్తకం ఇది.దీనికి ‘ బ్రౌన్’ దొరవారే స్వయంగా పీఠిక రాశారు.అందులో తాతాచారి కథల గురించి ఆయనేం రాశాడో చూడండి. “ I read some of the telugu poetry with him and in the course of amusing conversations,related to me the tales here preserved “..18.1.1855 ..!!
బ్రౌను దొరవారే రాసిన మరొక పీఠికలో ఏముందో చూద్దాం. 

“ The following tales were recited to me by Tatachari a learned Brahmin (a native of nellore ) who died in my employ in the year1848.Tata chari uses a style free from pedantry his tales were written down from his dictation and furnish good examples of the colloquial Telugu.”..17.4.1855.

అందులోనే ఈ కింది వాక్యాలు కూడా కనబడతాయి.అవేంటో మీరూ చూడండి.! “నెల్లూరు దేశస్థుడైన తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణములు యందు నిండా ప్రవీణత గలవాడు. ఇతను ప్లవనామ సంవత్సరము నకు సరియైన1841 సంవత్సరంలో చెన్నపట్నం లో వుండేవాడు.

బ్రౌన్ దొరగారి వద్దకు వచ్చి.. తాను బ్రతికివుండిన పరియంతరము ఆయన వద్ద కొలువులో వుండినాడు.యీ తాతాచార్యు లు నిండా పెద్ద మనిషి.సరసుడు.గనుక సంభాషణలో సమయోచిత మైన చిత్రచిత్ర కథలు చెప్పుతూ వచ్చినాడు.ఆ కథలు క్రమముగా నొక గ్రంథముగా వ్రాయించి వాటితో కూడా వేరే కొన్నికథ లు చేర్చి వొక గ్రంథముగా అచ్చువేయడమైనది”

(సి.పి.బ్రౌన్.కొ.వీ.భ.రావు.పుట. 375.1988)
నిజానికి తాతాచారి కథల పుస్తకం చిన్నదే కావచ్చు కానీ,తెలుగు కథా వికాస పరిణామపరిశీలనకు బాగా తోడ్పడుతుంది. కథలంటే “ బ్రౌన్ “ దొర వారికి ఎంత ప్రేమ,మక్కువో దీనివల్ల తెలుసు కోవచ్చు.ముఖ్యంగా వాడుక భాషపట్ల బ్రౌన్ గారి అభిమానానికి ఈ కథల పుస్తకం ఓ ఉదాహరణ(ఆనా
టివాడుక భాషలో రాసిన కథలివి ) తాతాచార్యులు,వారి ప్రతిభ పట్ల బ్రౌన్ దొరవారికున్న అభిమానానికి ఈ కథల పుస్తకం ఓ సజీవ సాక్ష్యంగా….. చెప్పొచ్చు.

పైగా తాతాచారి కథల శైలిని బ్రౌన్ దొర ఎంతగానో మెచ్చుకున్న దాఖలాలున్నాయి. తాతాచారి కథలు నీతిబోధకాలే కాకుండా, ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దంపట్టేవి గా వున్నాయి.ఈ కథల్లో భాష,శైలి (నాటి ) శుద్ధ వ్యావహారికం కావడం వల్ల అప్పటి పండితులకు నచ్చలేదు. కానీ….దొరగారు మాత్రం వాడుక భాషాశైలికి ముచ్చటపడి,తాతాచారిని తెగ మెచ్చుకున్నాడు.

ముద్రణలు

తొలి ముద్రణ 1855. బ్రౌన్…..  రెండో ముద్రణ.1916.గిడుగు వేంకటఅప్పారావు…. మూడో ముద్రణ 1951.వావిళ్ళ వారు. నాలుగో ముద్రణ.1974.బండి గోపాల రెడ్డి (బంగోరె ), కథల పేర్లు..!!(వావిళ్ళ వారి ముద్రణ నుండి )ముసలిదాన్ని చంపిన కథ,నిప్పు తగిలి పిల్లకాయలు చచ్చిన కథ,పామంజి కాళమనాయుడు ఓడిపోయిన కథ

మనిషియొక్క సద్గతి,దుర్గతి తెలిపే కథ, చీవర గ్రామణి వుండి చెరిపి చచ్చిచెరిపిన కథ, బండివాడు ఆడమనిషిని చంపదలచిన కథ. అధికాశ మొదలు చెరుచును అనడమును గురించిన కథ,. దెయ్యానికి వెరచిన బ్రాహ్మణుని కథ. దుగ్గిశెట్టి కొడుకు కథ. 

దున్నపోతు కథ, గ్రామ శక్తికి పొంగలిపెట్టిన కథ, వాలాజీపేట రాయజీ మసీదు కథ, సత్య పూర్ణ చార్యుల యేనుగును నవాబు కొడుకు చంపిన కథ, దేవరమాకుల కథ, హాలింఖాన్ మోసపోయిన కథ
స్త్రీ చమత్కార కథ… గిరిన్మయూరే అను శ్లోకమును గురించిన కథ.. ఏకాదశి తాంబూలం కథ, పొగచుట్ట కథ. 
సంభాషణ సరసము,నవాబు రూపాయల కథ .. సమయ స్పూర్తి గా చెప్పిన వాక్యము గురించినకథ., వెట్టివాండ్ల పట్టీ కథ .. ధర్మానికి క్షౌరము చేసుకున్న సన్యాసి కథ. (తాతాచారి కథల పుస్తకంలో.!1 నుండి 87పేజీలు ) బహువ్రీహీ అనే కథలో భాషాచమత్కారమున్నా, సామాన్యులకు అర్థం కాదని ఇందులో చేర్చలేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!