Blue Shades …………………………………………….
ఈ ఫోటోలో కనిపించే సిటీ ని బ్లూ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. కానీ నగరమంతా బ్లూ కలర్ లో ఉండదు. మెజారిటీ ప్రాంతాలు మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఇది జోధ్ పూర్ స్పెషాలిటీ. జోధ్‌పూర్ నగరాన్ని 1459లో రావు జోధా నిర్మించారు. ఆయన పేరిటనే నగరం ఏర్పడింది.
రాజస్థాన్ రాష్ట్రంలో అతి పెద్ద రెండవ నగరం ఇది. నగరాన్ని పాత నగరం .. కొత్త నగరంగా విభజించారు. ఈ నగరం అద్భుతమైన కోటలు, రాజభవనాలకు ప్రసిద్ధి గాంచింది..ఇవన్నీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి.
జోధ్‌పూర్‌లోని మెజారిటీ మెట్రోపాలిటన్ ప్రాంతాలు నీలం రంగులో లేవు. ఇతర రాజస్థానీ నగరాల మాదిరిగానే వాష్-వైట్ కాంక్రీట్ రంగులోనే కనిపిస్తాయి.జోధ్‌పూర్‌లోని చాలా నీలి వీధులు కోట నైరుతి అంచున ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్నాయి.
ఇక్కడ కొన్ని గోడలు నీలిరంగు షేడ్స్‌తో ఉంటాయి. ఇక జోధ్‌పూర్ విశాలమైనది. కానీ వీధులు అస్తవ్యస్తంగా ఉంటాయి. జైపూర్ వంటి ఇతర రాజస్థానీ నగరాల్లో మాదిరిగా ఆధునికీకరించిన మౌలిక సదుపాయాలు ఇక్కడ కనిపించవు.
నవ్ చౌకియా ప్రాంతంలో అందమైన నీలి ఇళ్ళు.. భవనాలున్నాయి. జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని ఎందుకు పిలుస్తారు?అనే ప్రశ్నకు అక్కడి స్థానికులు పలు కారణాలను చెబుతారు.జోధ్‌పూర్‌లో ఎక్కువ జనాభా ఉంది. వీరిలో బ్రాహ్మణులు శివుని భక్తులు. శివుని రంగు, బ్రాహ్మణుల రంగు నీలమే. అందువల్ల పాత నగరంలో చాలా వరకు ఇళ్లకు నీలం రంగు వేసి ఉంటుంది.
అలాగే నీలిరంగు గోడలు దోమలను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయని నమ్ముతారు. వేసవిలో ఇంటి లోపలి భాగాన్ని చల్లగా ఉంచడంలో నీలం రంగు సహాయపడుతుందని భావిస్తారు. గతంలో జోధ్‌పూర్‌లోని అనేక చారిత్రక కట్టడాలు చెదపురుగుల వల్ల దెబ్బతిన్నాయి. ఆ చెద పురుగుల నుంచి ఇళ్లను రక్షించుకోవడానికి నీలిరంగు ఇళ్లకు వేసుకుంటారని స్థానికులు చెబుతుంటారు.
జోధ్ పూర్ లో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మెహ్రాన్‌ఘర్ కోట చూడదగినది. ఈ కోట నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. జోధ్‌పూర్ రాజు రావు జోధా నగరంలోని కొండపై కోటను నిర్మించాలనుకున్నాడు. అతను కొండపై నివసిస్తున్న ఒక సాధువును బలవంతంగా అక్కడినుంచి పంపడానికి ప్రయత్నించాడు.
అందుకు సాధువు ఆగ్రహించి కరువు కాటకాలు వచ్చి.. రాజ్యం నాశనమైపోవాలని శపిస్తాడు. ఊహించని శాపానికి రాజు భయపడి తన తప్పు తెలుసుకుని శాపం తొలగే మార్గం చూపమని ప్రాధేయపడతాడు. ఎవరైనా వ్యక్తి ముందుకొచ్చి తనను తాను సజీవ సమాధి చేసుకుంటే శాపం తొలగిపోతుందని చెబుతాడు.
రాజుగారు ఈ విషయాన్ని చాటింపు వేయగా ఒక వ్యక్తి ముందు కొచ్చి ఆత్మ త్యాగం చేస్తాడు. రాజ్య క్షేమం కోసం ప్రాణాలను అర్పించిన అతని స్మారక చిహ్నాన్ని రాజు కోటలో నిర్మించాడు.జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన హెరిటేజ్ హోటల్‌లలో ఒకటి.
ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా కూడా ఎంపికైంది. రాజ్యంలో కరువు పీడిత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాజా ఉమైద్ సింగ్ దీనిని నిర్మించారు. దీని నిర్మాణం 1929 సంవత్సరంలో ప్రారంభమై. 1943లో పూర్తయింది. ఒకప్పుడు ఇది జోధ్‌పూర్ మాజీ రాజకుటుంబం ప్రధాన నివాసం.
ఇందులో 343 గదులు ఉన్నాయి.చూడదగిన ప్రదేశాల్లో ఇదొకటి. అలాగే జస్వంత్ థాడా ప్యాలస్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడి పాలరాతి నిర్మాణం మంత్రముగ్ధులను చేస్తుంది. ఇందులో చెక్కడాలు క్లిష్టమైనవి. జస్వంత్ థాడా లోపల రాథోడ్ పాలకుల చిత్రాలను చూడవచ్చు.
ఇక మాండోర్ గార్డెన్స్‌లో ప్రభుత్వ మ్యూజియం, ‘హాల్ ఆఫ్ హీరోస్’ 33 కోట్ల మంది దేవుళ్ల ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ ప్రాంతంలో లభించిన వివిధ కళాఖండాలు, విగ్రహాలను మ్యూజియంలో భద్రపరిచారు.. పూర్వ కాలపు నిర్మాణ వైభవం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
పర్యాటకులు కైలానా సరస్సు,… రావు జోధా ఎడారి రాక్ పార్క్, చాముండా మాత ఆలయం…. బాల్సమండ్ సరస్సు, మసూరియా హిల్స్ గార్డెన్ ను సందర్శించవచ్చు. జోధ్ పూర్ సమీపం లో మరిన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి.