కార్టూనిస్టుగా అందరికీ తెలిసిన మోహన్.. కథలకి ఇలస్త్రేషన్లు, కవిత్వాలకి బొమ్మలూ, నవలలకి కవర్ పేజీలు, వామపక్ష, విప్లవ పోస్టర్లు, సభలకి Backdrop లూ, మహిళ, దళిత, బడుగు బలహీన, అస్తిత్వ ఉద్యమ పోస్టర్లూ, ప్రముఖుల పోర్ట్రేయిట్లు, కేరికేచర్లు, పార్టీల ఎలక్షన్ కాంపెయిన్ బొమ్మలు, ఇంకా కేలండర్లూ, బ్రోషర్లూ, ఫోల్డర్లు, లోగోలు, కరపత్రాలూ వేలల్లో వేశాడు. ఇన్ని పనులు చేస్తూనే 45 ఏళ్లపాటు సీరియస్ రాజకీయ వ్యాసాలు, ఇంటర్వ్యూలు, పొట్టచెక్కలయ్యే పూర్తి వెటకారపు పుల్లవిరుపు విమర్శలూ, ప్రపంచ ప్రసిద్ధ కార్టూనిస్టుల పరిచయాలూ, పెయింటర్లు, ఆర్టిస్టుల జీవితాలపై ఆర్టికల్స్ లెక్కలేనన్ని రాశాడు. బాపూ, చిత్తప్రసాద్ ల నుంచి ఎన్టీ రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాకా, ఇల్యా రేపిన్, కేతే కోల్విజ్ నుంచి మణిశంకర్ అయ్యర్, దాసరి నారాయణరావు దాకా, పరిగెత్తించే పరిమళభరితమైన వచనంతో మంచిగంధం లాంటి వ్యాసాలు కొన్ని వందలు రాశాడు. వాటిలో ఒక 46 వ్యాసాలతో ‘కార్టూన్ కబుర్లు’ అనే పుస్తకం 1996 సెప్టెంబర్ లో వచ్చింది. అంటే మోహన్ ఏకైక పుస్తకం వచ్చి 25 ఏళ్ళు అవుతోంది.
తీవ్ర విప్లవ, దళిత, ఆదివాసీ, బాలగోపాల్ పుస్తకాలతో ప్రసిద్ధి చెందిన పెర్స్పెక్టివ్స్ R.K (రామకృష్ణారావు గారు) ఈ పుస్తకం పబ్లిష్ చేశారు. కార్టూన్ కబుర్లు విస్తృతంగా సర్క్యులేట్ కాలేదు. చదివిన కొద్దిమందినే అయినా బాగా ప్రభావితం చేసింది. కేవలం కార్టూన్ కబుర్లు చదివి, వచ్చి, మోహన్ని చూసి, మాట్లాడిన వాళ్లు నాకు చాలామంది తెలుసు. ఇందులోని మోహన్ వ్యాసాలన్నీ FACE BOOK లో వారానికి రెండయినా పోస్ట్ చేస్తాను. అప్పుడెపుడో చదువుకుని మరిచిపోయిన వాళ్లు చదవొచ్చు, పంటకాల్వలోకి తేటనీరులా తోసుకోచ్చిన కొత్తతరమూ చదువుకోవచ్చు. ముఖ్యంగా కొత్తగా కార్టూన్లు వేస్తూ ప్రపంచాన్ని షాక్ చేద్దామని ఆరాటపడే వ్యంగ్య చిత్రకారులకూ, అప్ కమింగ్ ఆర్టిస్టులకూ ఈ వ్యాసాలు ఒకదారి చూపుతాయి. కొంత జ్ఞానబోధ చేస్తాయి. నవ్విస్తాయి కూడా!
1996 నవంబర్ లోనో, డిసెంబర్ లోనో కార్టూన్ కబుర్లు ఆవిష్కరణ సభ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో చాలా హంగామాగా జరిగింది. మణిశంకర్ అయ్యర్, సురవరం సుధాకర్ రెడ్డి, దాసరి నారాయణరావు, వరవరరావు, హాస్యనటులు బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, గాయకుడు గద్దర్, మరికొందరు ప్రముఖులు వచ్చారు. పెర్స్పెక్టివ్స్ ఆర్కే సభకోసం బాగా వర్క్ చేశారు. హాలు జనంతో కిటకిటలాడింది. గొంగడి, గజ్జెలతో స్టార్ ఎట్రాక్షన్ గా నిలిచిన గద్దర్ పాటలకి హాలు హోరెత్తిపోయింది. గద్దర్ పాట వినడానికి బ్రహ్మానందం వేదిక దిగొచ్చి ముందువరసలో నా కుర్చీలోనే కూర్చుని, గద్దర్ పెర్ఫార్మెన్స్ చూడడం నా అదృష్టం అన్నంతగా మురిసిపోయారు.
“అరేయ్, మణిశంకర్ అయ్యర్ కి పదివేలు ఇవ్వరా, flight ticket కి” అన్నాడు మోహన్. పదివేలు యిచ్చినపుడు కొద్దిపాటి ఆశ్చర్యంతో నవ్వుతూ మణిశంకర్ అయ్యర్ నాకు షేక్ హాండిచ్చి, thank you అన్నారు. “మోహన్ జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయి కార్టూనిస్ట్ కావాలని నా ఆకాంక్ష” అన్నారు దాసరి నారాయణ రావు. భరణి నవ్వించారని, బ్రహ్మానందం ఉర్రుతలూగించారని ప్రత్యేకంగా చెప్పాలా!*మొదట ఈ పుస్తకం కవర్ పేజీ గురించి మోహన్ వివరణ చదవండి. కార్టూన్ కబుర్ల గురించి back cover మీద మోహన్ ఇలా రాశాడు .“సక్సెస్, హోదా, పేరూ, డబ్బూ, సుఖం కోసం మీరు చేస్తున్న గొప్ప కృషికి ఏమాత్రం పనికిరాని సొల్లు కబుర్లివి! పైగా ఆ ప్రస్థానంలో మీ కాళ్లకు అడ్డం పడే పరమ గాసిప్ గ్రంథమిది. మరి మీ ఇష్టం.
మల్టీ మీడియాలో మొట్టమొదట తయారు చేసిన తెలుగు ముఖచిత్రమిది. ఈ డ్రాయింగ్లూ, పెయింటింగ్లను కంప్యూటర్ కి ఫీడ్ చేసి, పుస్తకం పేరును త్రీడైమన్షన్ లో తయారు చేసిన ఆర్టిస్టు డాక్టర్ నీరజ్ రాజ్. గ్రేట్ బ్రిటన్ రాజుగారి మొహం చూడరా బాబూ ఎలా వుందో అంటూ ఫ్రెంచి కార్టూనిస్ట్ జీన్ వెయిర్ వేసిన అసభ్యాశ్లీల చిత్రం అట్టకు అడ్డంగా ఉందిగా. కింద రేఖాచిత్రం జపనీస్ మాస్టర్ హొకుసాయ్ ది. ఆ ఈస్ట్ బొమ్మ ఈ వెస్ట్ బొమ్మను గీస్తున్నట్టు అతికించి ప్రాక్పశ్చిమముల సంగమము చూపిన మహోజ్వలమైన ఐడియా గదా అని గొప్పయిపోవడం జరిగింది. అట్ట వెనక మోదిగ్లియానీ నగ్నసుందరి, ఫిరంగి వద్ద నించున్న గోయా హీరోయిన్ కనిపిస్తారు. ఒక జపాన్ సాంప్రదాయక చిత్రం, దాని నీడలాటి నలుపు, తెలుపు గీతల బొమ్మ గుస్తావ్ క్లిమ్ట్ చేసినది. దిగువనున్నవి కళనీ, యుద్ధ బీభత్సాన్నీ చూపే తూర్పు యూరప్ పోస్టర్లు. ప్రపంచంలో ముచ్చటైన బొమ్మలెన్నో ఉండగా ఇవి మాత్రమే ఎంపిక చేయడమేంటంటే, మన టేస్ట్ అలాగుంది మరి. అట్టమీద గానీ, లోపల గానీ రచయిత గీసిన బొమ్మలు అక్కడక్కడా తప్ప ఎక్కడా లేవంటే, తెలుగు ప్రజల సాంస్కృతిక ఆరోగ్యం పట్ల అతనికున్న ఆందోళన, సామాజిక స్పృహలే కారణం.
కృతఙ్ఞతలు :—- ఉదయం వీక్లీ లో ఈ వ్యాసాలు రాయమని మొదలు పెట్టించిన పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారికి – ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో మళ్ళీ రాయమని పీడించి రాయించిన త్రిపురనేని శ్రీనివాస్ కి, పుస్తకం లేఔట్ ని హాయిహాయిగా చేసిన ఆర్టిస్టులు శంకర్, శ్రీరామ్, శ్రీనివాస్ లకి – కంపోజింగ్ రాక్షసాలను బాగా తగ్గించిన దత్తా కి, వ్యాసాల వరసని అవకతవక చేసిన శశికి – కంపోజింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చిన ఫాంట్ లైన్ గ్రాఫిక్స్ నిర్మల గారికి, ఆమె బృందానికి – ప్రింటింగ్ వండర్స్ అండ్ బ్లండర్స్ కి కారణమైన నవ్య ప్రెస్ రామకృష్ణారెడ్డి గారికి – సంపూర్ణ పనికిమాలిన సాహసంతో పబ్లిషింగ్ కి వొడిగట్టిన పర్స్పెక్టివ్స్ కి …