పదేళ్ల క్రితం పై ఫొటోలో కనిపించిన పుష్పాలు వెబ్ మీడియాలో హల్ చల్ చేశాయి. నగ్న స్త్రీ లాగా కనిపించే ఈ పుష్పాలకు నారీ లతా పుష్పాలు అని పేరు కూడా పెట్టారు. వీటినే లియతాంబర అని కూడా అంటారని ప్రచారం జరిగింది. ఇవి హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయని, 20 సంవత్సరాల విరామంలో పూస్తాయని ఊదర గొట్టారు. అలాగే ఇలాంటివి థాయిలాండ్ లో కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది. యజ్ఞయాగాదుల్లో వాడేవారని పలు కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి.
విశ్వసనీయత లేని ఈ సమాచారం పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంది. ఈ సమాచారం ఆకర్షణీయంగా ఉండటంతో నెటిజన్లు అదే పనిగా షేర్ చేశారు. దాంతో ఎక్కడ చూసినా ఈ నారీలత పుష్పాల గురించే చర్చ. అవి ఫేక్ అని కొందరు … నిజమని కొందరు వాదనలతో సోషల్ మీడియా లో దుమ్మురేపారు. అయితే ఈ పూల జాడను ఇంతవరకు ఎవరూ కనుక్కోలేదు. వృక్ష శాస్త్రవేత్తలు కూడా వీటి గురించి చెప్పలేకపోయారు.
నిజంగా ఉన్నట్లయితే ఈ పాటికి వాటి సమాచారం వెలుగు చూసేది. చూసి రావడం కష్టం కాబట్టి హిమాలయాల్లో పూస్తాయని కబుర్లు చెప్పారు అనే విమర్శలు కూడా వచ్చాయి. వీటి గురించి చాలామంది సమాచారం సేకరించడానికి ప్రయత్నించారు. కానీ ఎవరూ సక్సెస్ కాలేదు.దీంతో ఎవరో ఆకతాయిలు కావాలనే వీటిని సృష్టించి ప్రచారం లో పెట్టారని అనుకున్నారు.
కేవలం రెండు మూడు రకాల బొమ్మలను తయారు చేసి .. వైరు సహాయంతో వాటిని చెట్లకు వ్రేలాడేలా చేసి ఫోటోలు తీశారు. ఆపై ఫొటోషాప్ సహాయం తో జిమ్మిక్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. పుష్పం లా కనబడే బొమ్మలు ఒకే సైజు లో ఉండటం కూడా చిత్రం. ఇది మనిషి సృష్టి కానీ ప్రకృతి సృష్టి కాదనిపిస్తుంది.
ఈ ఫోటోలు వైరల్ కావడానికి కారణం అవి నగ్నస్త్రీ బొమ్మలు కావడమే అయి ఉండొచ్చు. వెబ్‌సైట్ యజమానులలో కొందరు తమ వెబ్‌సైట్ ట్రాఫిక్ .. పాపులారిటీ పొందడానికి ఉపయోగించిన మార్కెట్ స్ట్రాటజీ అనే అభిప్రాయం కూడా అప్పట్లో వ్యక్తమైంది. ఇలాంటి జిమ్ముక్కులే మరి కొన్ని కూడా జరిగాయి.వాటి గురించి మరోసారి చెప్పుకుందాం.
post updated on 12-08-24