Who is in favor of India? …………………
మరో రెండు రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలి పోతుంది. గెలిచేది ఎవరు ? ట్రంపా ? కమలా హారీసా ? అని ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుంది? అనే అంశంపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలిస్తే … . భారత్‌కు అనుకూలంగా వ్యవహరించ వచ్చని అనుకుంటున్నారు ప్రధాని మోదీతో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్ కూడా ట్రంప్ విజయాన్నే కోరుకుంటున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మోదీ-ట్రంప్ ద్వయం పలు విషయాలపై కలిసి పని చేశారు.
2020 ఎన్నికల్లో ‘ఈసారి ట్రంప్ ప్రభుత్వమే ‘ అంటూ మోదీ నినదించడం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్ వ్యాఖ్యలు భారత్ ను సపోర్ట్ చేస్తున్నరీతిలో ఉన్నాయి. తాను అధ్యక్ష పీఠం ఎక్కగానే ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తానని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే … భారత దిగుమతులు, ఎగుమతులపై సుంకాలు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
కమల హారిస్.. భారత మూలాలు ఉన్న నేత అన్న విషయం తెలిసిందే. కమల హారిస్ తల్లి తమిళనాడుకు చెందినవారు కాగా, తండ్రి జమైకా దేశానికి చెందిన వ్యక్తి.. ఆ ఇద్దరు అమెరికాలో వివాహం చేసుకున్నారు. కమల పలుమార్లు చెన్నైకు వచ్చారు. దక్షిణాది వంటకాలు ఇష్టమని కూడా చెప్పారు. భారతీయ సంప్రదాయాల,రాజకీయాల పట్ల ఆమెకు అవగాహన కూడా ఉంది.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో కమల హారిస్ స్పందించిన తీరు భిన్నంగా ఉంది. ‘‘ఈ ప్రపంచంలో కశ్మీరీలు ఒంటరిగా లేరనే అంశాన్ని గుర్తుంచుకోవాలి.. అక్కడి పరిస్థితులను మేం నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితులు డిమాండ్ చేసిన సమయంలో మేం జోక్యం చేసుకుంటాం’’ అన్నారు.
భారత్ వ్యవహారంలో దిగిపోతున్న అధ్యక్షుడు జో బైడెన్ విధానాలను కమలా హారీస్ కొనసాగిస్తే ఆందోళన తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. భారత్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, అంతర్గత విషయాల్లో అభ్యంతరకర విధానాలను బైడెన్ అనుసరించారన్న విమర్శలున్నాయి. ముస్లింలు ఇతర మైనారిటీల విషయంలో మోదీ సర్కార్ వివక్ష ప్రదర్శిస్తోందని బైడెన్ అభిప్రాయం.
ఇటీవల.. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల హారిస్ మాట్లాడుతూ.. తన పాలన బైడెన్ పాలనకు భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కమల తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా టిమ్ వాల్జ్‌ను ప్రకటించారు. ఈయనకు చైనాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. తరచుగా టిమ్ వాల్జ్ బీజింగ్‌లో పర్యటించడం వంటి అంశాలు భారత్‌కు భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్రంప్ తన ఎన్నికల మీటింగ్స్ లో ఈ అంశంపై ఘాటైన విమర్శలు చేశారు. అందుకు ధీటైన జవాబులు కమలా హారీస్ ఇవ్వలేకపోయారు. ఇమ్మిగ్రేషన్, ఎనర్జీ అంశాలలో కమల హారిస్ వల్ల భారత్‌కు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమలా హారీస్ అధికార పగ్గాలు చేపడితే హెచ్ -1బీ వీసాలను పెంచే అవకాశం ఉందని.. తద్వారా భారత ఐటీ సేవల రంగం ఊపందుకుంటుంది అని భావిస్తున్నారు.
బైడెన్ తన హయాంలో అనుసరించిన విధానాలపై అమెరికన్లు కూడా సంతృప్తిగా లేరు. ముఖ్యంగా పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమానికి అండగా ఉన్న బైడెన్ ప్రభుత్వ వైఖరిపై అమెరికన్లు మండి పడుతున్నారు.
అలాగే ఉక్రెయిన్ కి ఆయుధ సహకారం. యుద్ధం ఆపేందుకు చొరవ చూపకపోవడం వంటి అంశాలపై అమెరికన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్య క్షీణిస్తున్న జిడిపి వంటి అంశాలు డెమొక్రటిక్ అభ్యర్థికి మైనస్ అవుతాయని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇండియా కు పెద్దగా ఒరిగేదేమి లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అమెరికా తన అవసరాల మేరకే వ్యవహరిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో?