Family feud in Baramati……………………
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘బారామతి’ నియోజకవర్గం ఈ సారి కీలకంగా మారింది.శరద్ పవార్ కుటుంబమే ఇప్పటివరకు అటు బారామతి పార్లమెంటరీ స్థానానికి .. ఇటు అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
2023 లో అజిత్ పవార్ NCP నుంచి కొంతమంది సభ్యులతో బయటికి వెళ్లారు.. తర్వాత ఆయన ఏక్ నాధ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి పవార్ కుటుంబంలో చీలిక వచ్చింది.
బారామతి లోకసభ నియోజకవర్గం 1996 నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పవార్ కుటుంబానికి బలమైన కోటగా మారింది. NCP వ్యవస్థాపకుడు శరద్ పవార్ 1996 నుండి 2004 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. వరుసగా శరద్ నాలుగు సార్లు గెలిచారు.
తర్వాత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే 2009, 2014, 2019 , 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.2024 ఎన్నికల్లో సుప్రియా సూలే పై అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పోటీ చేశారు.1.58 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు.తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు.
పార్టీ చీలకముందు అజిత్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు ఆరు సార్లు కూడా గెలిచారు. ఇపుడు ఎనిమిదో సారి కూడా బారామతి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక కీలకంగా మారింది.అజిత్ పవార్ కి ముందు శరద్ పవార్ కూడా ఈ బారామతి నుంచి 6 మార్లు గెలిచారు.
1967 నుంచి 1990 వరకు నియోజకవర్గ ప్రజలు శరద్ పవార్ ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా మారారు. తర్వాత కాలంలో జాతీయ స్థాయి నేత గా ఎదిగారు.
దేశంలోనే సుదీర్ఘ రాజకీయానుభవం గల నేతల్లో ఒకరైన శరద్ పవార్ బారామతిపై కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. పవార్ పార్టీ లో చీలిక రావడంతో … నియోజకవర్గంపై ఆధిపత్య పోరుకు తెరలేచింది.
1991లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన సమయంలో శరద్ పవార్ తన కుటుంబానికే చెందిన సోదరుడి కుమారుడు అజిత్ పవార్‌ను బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. అదే అదనుగా శరద్ పవార్ ఆశీస్సులతో అజిత్ పవార్ రాష్ట్రంలో బలమైన నేతగా ఎదిగారు. శరద్ పవార్ రికార్డును అధిగమిస్తూ ఆయన 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అజిత్ పవార్ పార్టీని చీల్చిన క్రమంలో మొన్నటి లోకసభ ఎన్నికల్లో ఆ కంచుకోటలో అంతర్యుద్ధం మొదలైంది. వరసకు సోదరి అయ్యే సుప్రియాపై తన సతీమణి సునేత్రా ని బరిలోకి దింపడంపై రాజకీయంగా అజిత్ పవార్ విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పరాజయ భారమే మిగిలింది.
ఇపుడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ బారామతి నుంచే పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే స్థానం నుంచి శరద్ పవార్ తన మరో తమ్ముడు కుమారుడు యుగేంద్ర పవార్ ను బరిలోకి దించుతున్నారు. యుగేంద్ర రాజకీయాలకు కొత్త వాడు. ఈ ఇద్దరు బరిలోకి దిగితే … కుటుంబ పోరు లో ఎవరిది పై చేయిగా మారుతుందో చూడాలి. ఇక్కడ పోరు రసవత్తరంగా సాగనుంది. నవంబర్ 20 ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 23 న ఫలితాలు వెలువడతాయి.