శ్రీవారికి పూలంటే అంత ఇష్టమా ?

Sharing is Caring...

srivaru is very fond of flowers…………………..

తిరుమల వేంకటేశ్వరునికి పూలు అంటే మహా ఇష్టం. అందుకే ఆయనను పూలతో ఎక్కువగా కొలుస్తారు. పలురకాలుగా అలంకరిస్తుంటారు. స్వామి వారి అలంకరణలు, సేవల కోసం ప్రతిరోజూ టన్ను పూలను వినియోగిస్తుంటారు. శ్రీవారికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది గా చెబుతారు.

స్వామివారి ని ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో అర్చకులు అలంకరిస్తారు. ఎన్నో పుష్పహారాలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సమర్పిస్తారు.కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరించే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది ఎనిమిది మూరల వరకు ఉంటుంది.

అలాగే  శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ కనిపించే మాలలను సాల గ్రామాలు అంటారు. వీటిని ఆనుకుని  పొడవైన పూలమాలలను అలంకరిస్తారు.ఇవి రెండుమాలలు కాగా ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటాయి.ఇక శ్రీవారి మెడలో రెండు పొరలుగా రెండు భుజాలపై అలంకరించే దండను కంఠసరి అంటారు. ఇది ఒకటి మూడున్నర మూరల వరకు ఉంటుంది.

శ్రీనివాసుని  వక్షఃస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవీ లకు అలంకరించే రెండు పూలదండల్లో ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది. వీటిని వక్షస్థల లక్ష్మి మాలలు అంటారు. శంఖు చక్రాలకు  రెండు దండలు అలంకరిస్తారు. ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.వీటిని శంఖ చక్ర మాలలు అంటారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బొడ్డున ఉండే నందక ఖడ్గానికి అలంకరించే దండను కఠారిసరం అంటారు. ఈ పూదండ రెండు మూరల మేరకు  ఉంటుంది. రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు వేలాడే మూడు దండలను తావళములు అంటారు. ఇందులో ఒకటి మూడు మూరలు, మరొకటి మూడున్నర మూరలు, ఇంకొకటి నాలుగు మూరల వరకు ఉంటాయి.

శ్రీవారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలను  తిరువడి దండలు అంటారు. ఒక్కొక్కటి ఒక్క మూర ఉండగా ప్రతి గురువారం జరిగే పూలంగి సేవ లో మాత్రమే స్వామివారి మూలమూర్తి కి ఆభరణాలన్నీ తీసివేసి ఈ మాలలతో పాటు నిలువెల్లా స్వామి వారిని పూలమాలలతో అలంకరిస్తారు. ఇదొక ప్రత్యేక అలంకరణ.

ఇవన్నీ ప్రధాన మూర్తికి చేసే అలంకరణలు కాగా ఆనంద నిలయంలో ఉన్న వివిధ ఉత్సవమూర్తులను కూడా ఎన్నో పూలమాలలతో అలంకరిస్తారు. ఉత్సవమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండల్లో భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ, కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయ్పప్పస్వామికి మూడు దండలు అర్చకులు వినియోగిస్తారు.

అలాగే బంగారు వాకిలి ద్వారపాలకులకు రెండు దండలు, గరుడాళ్వార్ కు ఒక దండ. వరదరాజస్వామి కి  మరొక దండ, వకుళమాతకు  ఒక దండ, రామానుజులుమూలమూర్తి, ఉత్సవమూర్తికి రెండు దండలు. యోగ నరసింహస్వామి కి  ఒక దండ. విష్వక్సేనులవారికి ఒక దండ. పోటు తాయారుకు ఒక దండ, బేడి ఆంజనేయస్వామికి మరో పూల దండ, శ్రీ వరాహస్వామి ఆలయానికి మూడు దండలను సమర్పిస్తారు.

కోనేటిగట్టు ఆంజనేయస్వామిని  ప్రతి ఆదివారం పూల దండ తో అలంకరిస్తారు.  శ్రీవారి నిత్యకల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు ఉపయోగిస్తారు. ఇన్నిరకాల పూలసేవలతో శ్రీనివాసుడు అలంకార ప్రియుడిగా భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఆ దర్శన భాగ్యం అందరికి లభించదు.

శ్రీవారి పుష్ప కైంకర్యంలో  వినియోగించే  మాలల తయారీలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్న జాజులు, మల్లెలు,మొగిలి, కమలం, కలువ, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపు మొక్కలు, కనకాంబరం, మరువం, మాచీ పత్రం, దవనం వంటి వివిధ రంగు రంగులు, సుగంధ పరిమళాలు వెదజల్లే ఎన్నో పుష్పాలు, పత్రాలను వాడతారు.

ఇక తిరుమల కొండపైన ఎవ్వరూ పూలు ధరించరాదు అనే నియమం ఉంది. కొండపై భక్తుల పుష్పాలంకరణ నిషిద్ధం…  కార్తీక మాసంలోని శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పార్చన,  పుష్పయాగం నిర్వహిస్తారు.14 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో స్వామివారికి సేవలు చేస్తారు. 

ఈ అలంకరణల  కోసం తెప్పించిన పూలలో మిగిలినవి .. వాడేసిన వాటిని ఉపయోగించి ఘుమ ఘుమలు వెదజల్లే అగరుబత్తీలు తయారు చేస్తారు. వీటి తయారీ కోసం ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను టీటీడీ నడుపుతోంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!