Bharadwaja Rangavajhala …………………………..
పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకుడుగా పాపులర్. రాజేశ్వరరావు తరహా ప్రయోగాలు కాక జనరంజక ప్రయోగాలు చేసి ఆంధ్రా ఎస్ డి బర్మన్ అని కొందరితో పిలిపించేసుకున్నారు ఆయన ..తెలుగు సినిమా హిట్టు పాటల జాబితాలో ఆయనది తక్కువ స్థానమేం కాదు.ఆయన కంపోజ్ చేసిన పాటల్లో కొన్ని ప్రత్యేకమైన గీతాల గురించి నాకు తెలిసింది చెప్పేందుకు ప్రయత్నిస్తాను.
పెండ్యాలది కృష్ణాజిల్లా కాటూరు గ్రామం. దుక్కిపాటి మధుసూధనరావుగారి నాటక సమాజంలో సంగీత దర్శకుడుగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అదే రూటులో సినిమాల్లోకీ ప్రయాణం కట్టారు. కె.ఎస్.ప్రకాశరావు గారి ద్రోహి చిత్రం ద్వారా 1948లో సినిమా ప్రవేశం చేశారు.ఆత్రేయ తొలిగీతం ‘పోరా బాబూ పో’ పెండ్యాలే కంపోజ్ చేశారు.ఆ తర్వాత తెలుగు సినిమా హిట్టు పాటల చిరునామాగా మారారు.
సుశీల, జానకి అనే ఇద్దరు అద్భుతమైన గాయనీమణులను తెలుగు సినిమాకు అందించారు. అంతే కాదు చక్రవాక కానడ రాగాలను మిళితం చేసి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నాయకత్వం లో విజయానంద చంద్రిక అనే కొత్తరాగాన్ని సృజించారు. జయభేరి చిత్రం కోసం చేసిన ఈ ప్రయోగం ‘రసిక రాజ తగువారము కామా’… గా వినిపిస్తుంది.
విజయానంద చంద్రిక అనే పేరు పెట్టింది మాత్రం మల్లాది వారు. పెండ్యాల, ఘంటసాల అనగానే ఠక్కున గుర్తొచ్చే మరో అజరామర గీతం జగదేకవీరుని కథలో వినిపించే ‘శివశంకరీ’. పింగళి నాగేంద్రరావు సాహిత్యానికి పెండ్యాల అందించిన స్వరం తెలుగు సినిమా సంగీతాభిమానులను ఒక్కసారి ఆనందపరవశులను చేసింది.
శివశంకరీ శివానందలహరి అంటూ సాగే ఈ గీతాన్ని బయట వేదికలపై పాడేందుకు ఘంటసాల వారు కూడా సాహసించేవారు కాదట. తెలుగు సినిమా సంగీతాన్ని సుసంపన్నం చేసిన సంగీత దర్శకుల్లో పెండ్యాల నాగేశ్వరరావు ఒకరు. శాస్త్రీయ రాగాలను సందర్భానుసారం సినిమాలకు వాడడంలో ఆయన నిష్ణాతుడు.
బృందావన సారంగతో శుద్ధ సారంగను కలిపి వెంకటేశ్వర మహత్యం సినిమా కోసం ఓ గీతం కంపోజ్ చేశారు పెండ్యాల. ఆత్రేయ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సుశీల తో కలసి ఘంటసాల ఆలపించారు. ఎవరో అతడెవరో అంటూ సాగుతుంది సాహిత్యం.
రంగస్థలం మీద తనకు అవకాశం ఇచ్చిన దుక్కిపాటి వారి అన్నపూర్ణ సంస్ధలోనూ సంగీత దర్శకుడుగా పెండ్యాల విజయవంతమైన గీతాలు చేశారు. అసావేరి ఠాట్ పద్దతికి దగ్గరగా అనిపించేలా ఉండే స్వరం అన్నపూర్ణా వారి దొంగరాముడు కోసం కూర్చారు పెండ్యాల నాగేశ్వరరావు.
‘అనురాగము విరిసేనా’ అంటూ సాగే సముద్రాల వారి సాహిత్యం నటభైరవికి దగ్గరగానే సాగుతుంది.దాన వీర శూర కర్ణ కు ముందు అనుకున్న సంగీత దర్శకుడు రాజేశ్వరరావు. ఏ తల్లి నిను కన్నదో పాటతో పాటు మరో గీతాన్ని కంపోజ్ చేసిన అనంతరం ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావుతో పడక మానేశారు. అలా రామకృష్ణా స్టూడియోస్ చిత్రాలకు పెండ్యాల నాగేశ్వరరావు పర్మనెంట్ సంగీత దర్శకులయ్యారు.
కర్ణ తర్వాత ఎన్టీఆర్ తీసిన చాణక్య చంద్రగుప్తలో బృందావన సారంగ రాగంలో స్వరపరచిన ఓ యుగళగీతం ఉంటుంది. ఈ పాట కూడా హిందీ నుంచీ తీసుకున్నదే. 1975లో వచ్చిన ధర్మాత్మ సినిమాలో క్యాఖూబ్ లగ్తీహో పాట లా అనిపిస్తుంది. అనిపించడం హేవిటి అదే. ముఖేష్ పాడిన ఈ గీతాన్ని కంపోజ్ చేసింది కళ్యాణ్ జీ ఆనంద్ జీ.
‘చిరునవ్వుల తొలకరిలో’ పాటలో చాలా స్వతంత్రం తీసుకున్నారు పెండ్యాల. రెండు పాటలూ విన్నవారికి అర్ధమౌతుంది. పెండ్యాల కేవలం పరాయి పాటలు విని ప్రేరణ పొందేవారు తప్ప ఉన్నది ఉన్నట్టుగా లిఫ్ట్ చేసేవారు కాదు …నారాయణరెడ్డి రాసిన చిరునవ్వుల తొలకరిలో చక్కటి మెలోడీగా విజయం సాధించింది.
పెండ్యాల నాగేశ్వరరావుగారే స్వరపరచిన అనిసెట్టి సుబ్బారావుగారి గీతం ఒకటి ‘భట్టి విక్రమార్క’లో వినిపిస్తుంది. అది కూడా నటభైరవికి దగ్గరగానే స్వరపరిచారు పెండ్యాల. ‘నటించనా…జగాలనే జయించనా’ అంటూ సాగే ఈ గీతాన్ని లీల, సుశీలలు కలసి ఆలపించడం విశేషం.మోహనరాగంలో ఎక్కువగా హిట్ సాంగ్స్ కంపోజ్ చేసిన సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల. సినిమా పాటకు భావం ప్రధానం.
కర్ణాటక సంగీతంలో పట్టు ఉన్నా సన్నివేశంలోని భావాన్ని పలికించడానికి కొన్ని సందర్భాల్లో రాగ నియమాల్ని పక్కన పెట్టేస్తారు సినిమా సంగీత దర్శకులు. సిద్దాంతం ప్రకారం మోహనలో మధ్యమ స్వరం ఎక్కడా రాకూడదు అంటారు. అయితే మహామంత్రి తిమ్మరుసు చిత్రం కోసం పెండ్యాల వారు మోహనలో ఓ పాట ట్యూను చేశారు. భావ ప్రకటన కోసం మధ్యమాన్ని విరివిగా వాడారు. పాట మాత్రం శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ‘మోహన రాగ మహా’ అనిపించేలానే ఉంటుంది.
పింగళి నాగేంద్రరావు సాహిత్యం అందించారీ గీతానికి. జగదేకవీరుని కథ చిత్రం కోసం పెండ్యాల స్వరపరిచిన ‘అయినదేమో అయినదీ’ పాట కూడా మోహనలో స్వరపరిచిన హిట్ డ్యూయట్టే. మనసుకు హాయిగా తాకే రాగం మోహనం. అందుకే ఆహ్లాదకరమైన సందర్భం వస్తే వెంటనే మోహనలో ట్యూను కట్టేస్తూంటారు.
పెద్దగా డీవియేట్ కాకుండా పద్దతిగా స్వరపరిచిన పాట ఇది. పింగళి వారి రచన ఘంటసాల సుశీల యుగళంలో అద్భుతంగా పలుకుతుంది. భారతీయ రాగాల లక్షణాలు ఒకరు చెప్పాల్సిన పనిలేదు. ఫలానా రాగంలో చేసిన పాటలివి అని ఓ పది పాటలు వినిపిస్తే…రాగలక్షణాలు అర్ధమైపోతాయి అంటారు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్.
కళ్యాణి రాగం అనగానే…అందమైన ఆహ్లాకరమైన గీతాలు చేయడానికి ఉపయోగపడే రాగం అని ఎవరైనా చెప్పేస్తారు.ఒక్కో సందర్భంలో విషాద గీతాలు కూడా చేసి మెప్పించారనుకోండి. కళ్యాణి రాగంలో పెండ్యాల వారు స్వరపరచిన ఈ ఆహ్లాదకరమైన యుగళగీతం వెలుగు నీడలు లో వినిపిస్తుంది. ‘హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి’ … అంటూ సాగుతుంది శ్రీశ్రీ సాహిత్యం.
అనుపమ తిలక్ గారికి ఎందుచేతో పెండ్యాలతో ట్యూనయ్యింది. దాదాపు అనుపమ బ్యానర్ లో వచ్చిన చిత్రాలన్నిటికీ పెండ్యాలే స్వరక్తర.సాదా సీదా కథే అయినా తిలక్ మార్క్ కథనం తో పాటు…పెండ్యాల వారి సంగీతం జతకలసి సినిమాలను జనరంజకం చేశాయి.
శాస్త్రీయ సంగీత గాయకుడుగా అప్పటికే చాలా పాపులర్ అయిన బాలమురళితో ఉయ్యాల జంపాల కోసం ఓ కెమేరా సాంగ్ పాడించారు పెండ్యాల. ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవూ’ … ఆరుద్ర రాశారీ గీతాన్ని. ఇష్టం లేని వివాహం రద్దు చేసుకుని మనసిచ్చిన వాడి చెంతకి చేరుకునే ఓ యువతి కథతో తీసిన చిత్రం ‘ఈడూ జోడూ’…మళ్లీ జమున, జగ్గయ్యలే జోడీ.
‘ఇదేమి లాహిరీ…ఇదేమి గారడీ…ఎడారిలోన పువ్వులు పూచి ఇంత సందడి’…అంటూ సాగే ఆరుద్ర కవిత్వానికి పెండ్యాల అందమైన బాణీ కట్టారు. ఘంటసాల సుశీల పాడిన టాప్ హిట్ డ్యూయట్స్ లో ఇదీ ఒకటి. ఖమాస్ రాగంలో ఓ గమ్మత్తేమిటంటే…లాలింపుకు…బతిమలాడడానికీ అనువైన రాగంగా చెప్తారు. ఖమాస్ రాగంలోనే ఓపీనయ్యర్ స్వరపరచిన ఓ హిందీ పాటను అనుకరిస్తూ శ్రీ కృష్ణ తులాభారం కోసం ఓ పాట కంపోజ్ చేశారు పెండ్యాల.
ముఝే దేఖ్ కర్ ఆప్ కా ముస్కురానా పాట వరసల్లోనే ‘ఓ చెలీ కోపమా …అంతలో తాపమా’ అంటూ ఘంటసాలతో పాడించేశారు. అద్భుతమైన లాలిత్యం ధ్వనిస్తుందీ పాటలో … ఘంటసాల గంభీర గాత్రం లో గోము తనం అద్భుతంగా పలుకుతుంది… దీన్ని తెరమీద అంతే అద్భుతంగా పలికించారు ఎన్టీఆర్.
హిందీలో రఫీ ఎంత హాయిగా పాడారో …తెలుగులో ఘంటసాల కూడా అంతే హాయిని కలిగిస్తారు. శ్రీ కృష్ణుడు సత్యభామాదేవి ని ప్రసన్నురాలిని చేసుకోడం ఈ పాట లక్ష్యం. ‘ఓ చెలీ కోపమా? అంతలో తాపమా ‘అంటూ సాగుతుందీ గీతం. దాశరథి కృష్ణమాచార్యుల వారు రాశారీ గీతాన్ని. హిందూస్తానీ సంప్రదాయానికి చెందిన కళావతి రాగం చక్రవాకం నుంచి వచ్చిన వలజి రాగాన్ని పోలిఉంటుంది.
ఆ రాగంలోనూ కొన్ని సినిమా పాటలు రూపుదిద్దుకోవడం విశేషం.’శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ’ సినిమా కోసం పెండ్యాల వారు కూర్చిన గీతం కళావతిలోనే సాగుతుంది. బాలమురళి జానకి కలసి పాడిన యుగళం ‘వసంత గాలికి వలపులు రేగ’ అంటూ సాగే పింగళివారి సాహిత్యం … ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది.
తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో పెండ్యాల కాస్త ప్రత్యేకం. క్లబ్బు పాట చేసినా హిందీ నుంచీ ట్యూను దిగుమతి చేసుకున్నా అందులో తెలుగుతనం నింపడంలో ఆయన స్పెషలిస్టు. ఎన్టీఆర్ దీక్ష సినిమాలో వినిపించే ‘మెరిసే మేఘమాలికా’ పాటే అందుకు ఉదాహరణ.వేటూరి సుందరరామ్మూర్తి సిరికాకొలను సుందరికీ … పెండ్యాలే సంగీత దర్శకత్వం వహించారు.
ఇంకా అనేక పాటలు… కన్నతల్లి లో ‘ఎందుకో పిలిచావ్ ఎందుకో’ అంటూ వచ్చే సుశీల తొలిపాట నుంచీ.. అనేకం…. వాటిని మీ జ్ఞాపకాల్లో రేపడమే నా లక్ష్యం.నేను ఆయన్ని బెజవాడ సత్యనారాయణ పురం లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో చూశాను… ఆయన మేళాల వాళ్ళ దగ్గరే ఎక్కువ సమయం గడిపారు ఆరోజు…
.