ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జైల్లోనే మగ్గిపోతున్నారా ?

Sharing is Caring...

 In prison for more than ten years……………………

ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ మొహమ్మది (Narges Mohammadi) గత ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి కి  (Nobel Peace Prize) ఎంపికైన విషయం  తెలిసిందే. అవార్డు ప్రకటించే నాటికి ఆమె జైలులో ఉన్నారు. ఆ తర్వాత కూడా విడుదల కాలేదు. ఈ క్రమంలో నర్గీస్ పిల్లలు ఆమె తరపున నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు. 

కొద్ది నెలల క్రితం  ఆమెకు మరో ఏడాది జైలు శిక్ష విధించారు. వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారనే అభియోగంపై ఆమెను దోషిగా నిర్ధారించి శిక్షవేశారు. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ఆ మధ్య నర్గిస్ పిలుపు ఇచ్చారు. ఇదే విషయమై ఐరోపాలోని చట్టసభ సభ్యులకు లేఖలు పంపారు. అలాగే  ఇరాన్ జర్నలిస్ట్, ఒక రాజకీయ కార్యకర్త  ఎదుర్కొన్నహింస ,లైంగిక వేధింపులపై  తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై ఈ శిక్ష విధించారు. 

ప్రస్తుతం నర్గీస్ ఇరాన్ లోని ఎవిన్ జైలులో ఉన్నారు. ఆమె ఇప్పటికే 30 నెలల శిక్షను అనుభవిస్తోంది, నర్గిస్ మహమ్మది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 19వ మహిళ..  2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఇబాది తర్వాత రెండవ ఇరాన్ మహిళ. 

సంప్రదాయం పేరుతో మహిళలకు అనేక ఆంక్షలు విధించే ఇరాన్‌ లాంటి దేశంలో పుట్టిన నర్గిస్‌.. చదువుకునే రోజుల నుంచే మహిళా హక్కుల కోసం పోరాటం మొదలెట్టారు.ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత  ఆమె కొంతకాలం పలు వార్తాపత్రికలకు  కాలమిస్ట్‌గా పనిచేశారు. 2003లో షిరిన్‌ ఇబాది స్థాపించిన డిఫెండర్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ సెంటర్‌లో చేరి ఆ తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో కఠిన సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను అనుభవించారు..1998లో ఇరాన్‌ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గానూ తొలిసారి అరెస్టయి ఏడాదిపాటు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత డీహెచ్‌ఆర్‌సీలో చేరినందుకు గానూ మరోసారి అరెస్టయ్యారు.

2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మరోసారి ఆమెను అరెస్టు చేసి 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయినప్పటికీ ఆమె బెదరలేదు. రెండేళ్ల తర్వాత బెయిల్‌పై బయటికొచ్చిన ఆమె.. ఇరాన్‌లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తారు.

ప్రపంచంలోనే ఏటా అత్యంత ఎక్కువగా మరణశిక్షలను అమలు చేస్తున్న దేశాల్లో ఇరాన్‌ ఒకటి. దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేపట్టారు. దీంతో 2015లో మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇరాన్‌లో రాజకీయ ఖైదీలు, ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా నర్గిస్‌ జైల్లోనే ఉద్యమం ప్రారంభించారు. అక్కడ కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో జైలు అధికారులు ఆమెకు కఠిన ఆంక్షలు విధించారు. ఆమె ఎవరితోనూ ఫోన్లో మాట్లాడకుండా, కలవకుండా నిషేధం విధించారు. 

2022 సెప్టెంబరులో హిజాబ్‌ ధరించనందుకు మాసా అనే యువతిని ఇరాన్‌ పోలీసులు అరెస్టు చేయగా కస్టడీలో ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలోనూ నర్గిస్‌ తన గళాన్ని వినిపించారు.

అంతేకాదు.. జైల్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. అక్కడి నుంచే సంచలన నివేదికలు రాసి పలు అంతర్జాతీయ పత్రికలకు పంపించారు. అలా ఆమె రాసిన కథనాలు న్యూయార్క్‌ టైమ్స్‌, బీబీసీ  తదితర  పత్రికల్లో వచ్చాయి. అంతకు ముందు కూడా 51 ఏళ్ళ నర్గిస్ కు ఎన్నో అవార్డులు వచ్చాయి. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!