యోగశక్తి ని ప్రజాక్షేమం కోసమే వాడిన వేటూరి !!

Sharing is Caring...

A great person ……………………

వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే సాహిత్య మేరు పర్వతం.ఆయన తరచి చూడని సాహిత్యమూ లేదు తిరగేయని శాసనం,సేకరించని తాళ పత్రంలేదు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవితం లో రెండు కోణాలున్నాయి. ఆ రెండింటి గురించి చెప్పుకోవాలి.  

మొదటిది వారి సాహిత్య సేవ. మరొకటి ఈశ్వర తత్వావిష్కారానికి అంకితమై ఆర్త జన సేవలో కర్పూరంగా కరిగి పోయిన యోగి గా ఆయన నిరాడంబరమైన జీవనం.

వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పదహారేళ్ళకే తెలుగు, సంస్కృతం పుక్కిట పట్టారు. కవిత్వమూ చక్కగా అలవడింది. శతావధాన , అష్టావధానాలెన్నో చేశారు. వేపా రామేశం గారి వద్ద ఖగోళం, చరిత్ర అధ్యయనం చేశారు. మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండా గారం లో పండితుని గా చేరి ఇంగ్షీషు,కన్నడ,తమిళాలు నేర్చారు.

చరిత్ర సంస్కృతి, వాజ్మయం,శాసనాలు, తాళ పత్రాలు, కైఫీయతులు (Local Records prepared by Col. Colen Mackenzie) పెక్కింటిని పరిష్కరించారు. అనేక తాళ పత్ర గ్రంధాలు సేకరించి, పరిశీలించి పరిష్కరించి, ముద్రించారు. రాగి రేకులపై ఉన్న అన్నమాచార్యుల సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చి , వాటి ప్రాచుర్యానికి ముఖ్య కారకులైనారు.

ఆయన రచించిన గ్రంధాలు, గ్రంధాలకు ఆయన వ్రాసిన పీఠికలు, కవుల గురించిన చరిత్రలు, అనువాద గ్రంధాలు, పరిశోధన గ్రంధాలు అనేకం ఉన్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పుస్తకాలు, పరిశోధన గ్రంధాలు ప్రచురించడానికి ‘శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి వాఙ్మయ పీఠం’ ను స్థాపించింది.

వారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తిరుపతి శ్వేత కాంప్లెక్స్ వద్ద స్థాపించారు. శాస్త్రి గారి రచనలను పీఠం వారు పదిహేడు సంపుటాలుగా తీసుకొచ్చారు.ఇంకా కృషి జరుగుతున్నది.

మరొక ముఖ్య మైన ఘట్టం మాస్టర్ సి వి వి గారితో సమాగమం. 1912-16 మధ్య కాలం లో శాస్త్రి గారు తీవ్రమైన అస్వస్థత కు గురయ్యారు.జీవితం పై నిస్పృహ కలిగింది. ఆ సమయంలో స్నేహితుల సలహా మేరకు తమిళనాడు కుంభకోణం లో ఉన్న మాస్టర్ సి వి వి గారిని దర్శించుకున్నారు.  

మాస్టర్ సి వి వి గారు గొప్ప యోగ సంపన్నులు. వారు స్థాపించి ప్రచారం చేసిన యోగ మార్గాన్ని “భ్రుక్త రహిత తారక రాజయోగం” అంటారు. గురువు గారి కటాక్షం వల్ల శాస్త్రి గారిని చాలా కాలంగా బాధిస్తున్న రుగ్మతలు శీఘ్రం గా మాయమై పోయాయి. నాటి నుండి వారు మాస్టర్ సి వి వి గారి యోగ మార్గం లో పయనిస్తూ మరి పెక్కు మందికి మార్గదర్శకులైనారు.

శాస్త్రి గారికి అద్భుతమైన యోగ శక్తులు లభించాయి. అయితే వారు తమకు లభించిన యోగ శక్తులు ప్రజల క్షేమం కొరకే ఉపయోగించారు.ఒక సారి వారు తాళ పత్రాల కోసం ఊళ్లు తిరుగుతూ ఒక వూరిలో ఉండగా నిద్ర పట్టక బయట తిరుగుతూ, దీపం వెలుగుతున్న ఇంటికి వెళ్లి మంచి నీళ్ళు అడిగారు.

గృహిణి మంచినీళ్ళ చెంబు అందించి, తన భర్త ప్రాణాపాయ స్థితి లో ఉన్నాడని దీనం గా విలపించింది.అంతే కరుణార్ద్ర హృదయులు శాస్త్రి గారు మంచి నీళ్ళు తాగకుండా తన బసకు చేరి కాళ్ళు కడుక్కొని నిద్ర పోకుండా ప్రార్ధన చేశారు. తెల్లారి వెళ్లి ఆమెను పలకరించారు ‘’మీరు పలకరించి వెళ్ళిన తర్వాత మా వారికి ఆరోగ్యం కుదుట బడింది‘’ అని కృతజ్ఞత చెప్పింది ఆ ఇల్లాలు . ప్రార్ధనకు,ఈశ్వర అనుగ్రహానికి ఉన్న మహత్తర శక్తి ఇక్కడ మనకు కన్పిస్తుంది.

ఆయనలో కరుణ, దయ, ప్రేమ, శాంతము,గంభీరత స్పష్టం గా కన్పిస్తాయి. ఆయన ముఖం చూస్తెనే చాలు మానసిక ప్రశాంతి లభిస్తుందని చాలా మంది చెప్పే వారు. “నా చుట్టూ ఆనందాన్ని, అమృతాన్ని పంచి పెట్టాలనే సంకల్పం ఉన్న వాణ్ని నేను. అందర్ని ఆపదల నుంచి రక్షించటం, అందర్లో ఆనందాన్ని నెలకొల్పడం అనే రెండు భావాలే నాకు ఉచ్చ్వాస నిశ్వాసలు.

అవి రెండు ఆడటం లోనే నా ఊపిరి‘ ’అన్న మహానుభావులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఆయన అనేకమంది కి శారీరక మానసిక రుగ్మతలు బాగు చేసిన సంఘటనలు వారి చరిత్ర లో కోకొల్లలు గా అగుపిస్తాయి. తెలుగు నాట వారి శిష్య ప్రశిష్యులు ఎందరో ఉన్నారు.

శాస్త్రి గారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద కళ్ళేపల్లి లో జన్మించారు. ప్రసిద్ధ సినీ కవి వేటూరి సుందర రామమూర్తి శాస్త్రి గారి తమ్ముని కుమారుడు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!