బంగారం కొనాలనుకుంటున్నారా ?

Sharing is Caring...

లాభాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో బంగారం కొనడం తక్కువే. కానీ గత కొన్ని ఏళ్లుగా బంగారం  ఇన్వెస్ట్ మెంట్ సాధనంగా  మారింది.  పెట్టుబడులన్నీ ఒకే తరహా సాధనాలలో  కాకుండా వివిధ రకాలుగా పెట్టాలనుకునే వారికి బంగారం మంచి ఆప్షన్‌. షేర్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, రుణ పత్రాలు, బ్యాంకు లేదా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు ఒడిదొడుకులకు లోనైనపుడు పెద్దగా నష్టపోయే అవకాశం లేని పెట్టుబడి బంగారం ఒక్కటే. ఆర్థిక మాంద్యాలు, సంక్షోభాలు తలెత్తినపుడల్లా ఈ విషయం రుజువవుతూనే ఉంది.

ఇన్వెస్టర్లు  తమ పెట్టుబడి లో కనీసం 10 నుంచి 20 శాతం వరకు బంగారంలో మదుపు చేయడం మంచిదని ఇన్వెస్ట్మెంట్ ‌ నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుత దశలో బంగారం కొనుగోలు చేయవచ్చా? అంటే కొంత కాలం ఆగడం మంచిది. తప్పనిసరి అయితే కొనుక్కోండి. మాములుగా అయితే బంగారం ధరలు తగ్గుతున్నపుడు కొనుగోలు చేయాలి. కనీసం ఒక రెండు మూడు వేలు అయినా తగ్గినప్పుడు కొనండి. ప్రస్తుతం 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 48,960 రూపాయలు పలుకుతుంది.

గత ఏడాది కరోనా దెబ్బతో బంగారం అమ్మకాలు కూడా తగ్గాయి. 2020లో భారత్ లో 446.4 టన్నుల బంగారం అమ్ముడైంది. 2019 తో పోలిస్తే (690.4 టన్నుల)తో పోల్చితే ఇది 35.34శాతం తక్కువ.ఇక విలువ పరంగా చూస్తే… 2019లో బంగారం డిమాండ్ రూ.2,17,770 కోట్లుగా ఉంది. 2020లో ఇది 14శాతం తగ్గి రూ.1,88,280 కోట్లకు చేరింది.ఆభరణాల విషయానికొస్తే… 2019తో పోల్చితే డిమాండ్ 42శాతం తగ్గి 315.9 టన్నులకు పరిమితం అయింది.బంగారం దిగుమతులు 2019 తో పోల్చితే 47శాతం తగ్గి 344.2 టన్నుల వద్ద ఆగాయి.  ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిందని డబ్ల్యూజీసీ నివేదిక చెబుతోంది.2019లో 4,386.4 టన్నుల బంగారం అమ్ముడవ్వగా.. 2020లో ఇది 3,759.6 టన్నులు మాత్రమేనని తెలిపింది. 2009లో 3,385.8 టన్నుల దిగువకు బంగారం డిమాండ్ పడిపోయిందని డబ్ల్యూజీసీ గుర్తుచేసింది. అయితే బంగారం ధరల విషయం లో మాత్రం పెద్ద మార్పు లేదు.

డిమాండ్ తగ్గినా ధర తగ్గుముఖం పట్టలేదు. 2010 లో 10 గ్రాముల ధర 18,500 కాగా 2011 నాటికి  26,400 కి పెరిగింది. 2018 నాటికి 31,050 కి చేరుకుంది. 2020 నాటికి 48,651 కి చేరుకుంది ( మద్యలో  హెచ్చుతగ్గులు ఉండొచ్చు )2018 నుంచి 2020 లోపల పుత్తడి ధర బాగా పెరిగింది. పదేళ్లు లేదా ఐదేళ్లు క్రితం కొనుగోలు చేసినవారు ప్రస్తుతం లాభాలు స్వీకరించవచ్చు. కావాలంటే ధరలు తగ్గినపుడు కొనుగోలు చేయవచ్చు. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ధరల పెరుగుదలకు సమయం పట్టవచ్చు. 

————–K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!