ఆ ఇద్దరు మళ్ళీ కలుస్తారా ?

Sharing is Caring...

ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా తెర వెనుక విభజన వ్యూహాలను అమలు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంగళవారం చర్చలు కూడా జరగనున్నాయి. రష్యాతో ఒక వైపు యుద్ధం జరుగుతుండగానే ..  ఉక్రెయిన్ లోని  కొన్నిప్రాంతాల ప్రజలు రష్యాలో కలుస్తామంటున్నారు. 

చాలాచోట్ల పౌరులు రష్యా సేనతో పోరాడుతుంటే .. కొన్ని చోట్ల ప్రజలు రష్యాలో విలీనం పట్ల ఆసక్తి చూపుతున్నారు.   ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు రష్యాకు సరిహద్దుల్లో ఉన్నాయి.అక్కడ వేర్పాటు వాదం ఎప్పటి నుంచో ఉంది. వారు రష్యాకు అనుకూలంగా ఉంటుంటారు. దేశ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు రష్యా సేనలతో ఉక్రెయిన్‌ పోరాడుతుంటే..  ఈ ప్రాంతాల్లోని వేర్పాటు వాదులు మాత్రం తమ ప్రాంతాన్ని రష్యాలో కలపాలని డిమాండ్‌ చేస్తుండటం కలకలం రేపుతోంది.

ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలైన లుహాన్స్క్‌ లో  ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. తమ ప్రాంతాన్ని రష్యాలో విలీనం చేసేందుకు అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 

దీంతో పాటు ఉక్రెయిన్‌ను రెండుగా విభజించాలని రష్యా ప్రయత్నిస్తోందని  మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైరిలో బుడనోవ్ అంటున్నారు. ఉత్తర దక్షిణ కొరియాల మాదిరి  చేయాలని చూస్తోందని ఆయన చెబుతున్నారు. రష్యా ఇప్పుడు తూర్పు డోన్‌బాస్ ప్రాంతాన్ని నియంత్రించడంపైనే ప్రధాన దృష్టి పెట్టింది.దాని ప్రధాన లక్ష్యానికి చేరుకున్న తర్వాత బలగాలు ఉపహరించి విభజన దిశగా అడుగులు వేస్తోందేమోనని ఉక్రెయిన్‌ ఆందోళనలో ఉంది.

అయితే ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి మాత్రం ఉక్రేనియన్ల గెరిల్లా యుద్ధం అటువంటి ప్రణాళికలను నిర్వీర్యం చేస్తుందని ధీమాగా చెబుతున్నారు. 2014 నుంచి రష్యా-మద్దతుగల వేర్పాటువాదులచే పాక్షిక నియంత్రణలో ఉన్న తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే వ్యూహంలో భాగంగా సైనిక  దళాలను తూర్పు వైపుకు మళ్లిస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు ఉక్రెయిన్‌తో చర్చల్లో, మాస్కో డోనెట్స్క్, లుహాన్స్క్  ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. ఇంకో వైపు యుద్ధం కొనసాగుతుండడంతో.. ఉక్రెయిన్‌ పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ఆహార పదార్థాల సరఫరా, మానవతా సాయానికి నాటో, ఐరోపా దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు రష్యా నిరంతరాయ కాల్పులు అడ్డంకిగా మారాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ముఖాముఖి భేటీ జరిగితేనే యుద్ధం ముగుస్తుందని జెలెన్ స్కీ అంటున్నారు. మరి పుతిన్ చర్చలకు వస్తారా అనేది సందేహమే. కాగా రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయని ప్రచారం జరుగుతోంది.

ఈనెల ప్రారంభంలో వారం రోజుల్లోనే మూడుసార్లు హత్యాయత్నం జరగ్గా జెలెన్ స్కీ తప్పించుకున్నట్లు ‘ది టైమ్స్‌’ వార్తాసంస్థ చెబుతోంది.  ఉక్రెయిన్‌ అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవడంతో రష్యా ప్రయత్నం విఫలమైనట్లు ఆ వార్తాసంస్థ కథనం.   
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!