కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్ళీ మొదలైనాయి. భవిష్యత్ లో సచిన్ తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు , రాజస్థాన్ చీఫ్ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలు ఇచ్చారు. సచిన్ పైలట్ మంచి నాయకుడు అని .. ఆయన బీజేపీలో చేరతారని తాను అనుకుంటున్నట్టు అబ్దుల్ కుట్టి మీడియా తో అన్నారు. దీంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
గత ఏడాది సచిన్,18 మంది ఎమ్మెల్యేలతో కలసి సీఎం అశోక్ గెహ్లట్ పై తిరుగుబాటు ప్రకటించారు. అప్పట్లో పైలట్ బీజేపీ లో చేరతారనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించడంతో సచిన్ వెనక్కి తగ్గారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సచిన్ కు గెహ్లట్ కు సరైన సంబంధాలు లేవు. ఇదిలా ఉంటే ఈ నెలలో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ ఉహాగానాలు మొదలైనాయి. ప్రస్తుతం గెహ్లాట్ క్యాబినెట్ లో గెహ్లట్ తో కలిపి 21 మంది మంత్రులు ఉండగా, మరో తొమ్మిది మందికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే సచిన్ పైలట్ రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గా కూడా చేస్తున్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రి గా చేసిన దివంగత నేత రాజేష్ పైలట్ కుమారుడు ఈ సచిన్. 2004 లో 26 ఏళ్ల వయసులో దౌసా నుంచి లోక్‌సభకు ఎన్నికైనప్పుడు సచిన్ అతి పిన్న వయస్కుడైన పార్లమెంట్ సభ్యుడిగా గుర్తింపు పొందారు. 2009 లో అజ్మీర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. యుపిఎ 2 హయాంలో మన్మోహన్ ప్రభుత్వంలో కార్పొరేట్ వ్యవహారాల పోర్ట్‌ఫోలియోను నిర్వహించాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి చెందిన సన్వర్‌లాల్ జాట్ చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన తర్వాత, సచిన్‌ను రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌గా నియమించారు. పార్టీ పునరుద్ధరణ కోసం సచిన్ బాగానే కృషి చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో సచిన్ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని భావించారు. అయితే అధిష్టానం అశోక్ గెహ్లట్ కి పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటున్నది. ఇఫుడు ఏమి జరుగుతుందో చూడాలి.