ఆయన ఎమ్మెల్యే గా గెలవకుండానే ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గెలిస్తే ఏడవసారి కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇదెలా సాధ్యం ? వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక నితీష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. శాసన మండలి నుంచి ఎన్నికవుతూ సీఎం కుర్చీని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చారు.
నలభై ఏళ్ళక్రితం నలందా జిల్లాలోని హర్నాట్ అసెంబ్లీ స్థానం నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1985 అక్కడి నుంచే లోక్ దళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. 1989 లో లోక సభకు ఎన్నికయ్యారు. వరుసగా అయిదు సార్లు ఎంపీగా గెలిచారు. మంత్రి పదవులు కూడా చేపట్టారు. ఆ తర్వాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందుకే కాబోలు మహాకూటమి సీఎం అభ్యర్థి పదే పదే ఎద్దేవా చేస్తున్నారు. ధైర్యముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తేజస్వి సవాళ్లు విసురుతున్నారు . అయితే నితీష్ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. 2004 తర్వాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ నితీష్ పోటీ చేయలేదు. ఎమ్మెల్సీ అయిపోయి దర్జాగా సీఎం కుర్చీలో కూర్చుంటున్నాడు.
ఇలా అసెంబ్లీ కి పోటీ చేయకుండానే ఇన్ని సార్లు సీఎం అయిన ఖ్యాతి నితీష్ కే దక్కుతుంది. కాగా నితీష్ మొదటి సారి సీఎం అయింది 2000 సంవత్సరంలో. అప్పటికి నితీష్ బీహార్ లోని ఏ సభలోను సభ్యుడు కాదు. అయితే అసెంబ్లీ లో తగు బలం లేక కేవలం 7 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశారు. 2005 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలసి బీహార్ సీఎం అయ్యారు. అప్పటినుంచి వరుసగా 2010,15,17 సంవత్సరాలలో వరుసగా సీఎం అయ్యారు. వరుసగా సీఎం అయినప్పటికీ ఎక్కడా పోటీ చేయలేదు. ఇది కూడా ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఇక శాసనమండలికి వరుసగా ఎంపిక అవుతూ నెట్టుకొస్తున్నారు.
తనపై తేజస్వి విసిరిన సవాళ్లకు జవాబు చెబుతూ తాను ఏదో ఒక నియోజక వర్గానికి పరిమితం కాదల్చుకోలేదని… అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యే అయిఉండాలి అనే నిబంధన ఉన్నట్టయితే నితీష్ పప్పులు ఉడికేవి కావు. అదలా ఉంటే బీజేపీ కూడా నితీష్ నాయకత్వం పట్ల ప్రస్తుతం అంత సుముఖంగా లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలు నితీష్ పనితీరుకు రెఫరెండం అని కూడా అంటున్నారు. మరోవైపు కేవలం అధికారం కోసమే మోడీ,నితీష్ లు జట్టుకట్టారని తేజస్వి ఆరోపణలు గుప్పిస్తున్నారు.
జేడీయు పాలనలో అవినీతి పెరిగిపోయిందంటూ .. నితీష్ పెద్ద ఎత్తున దోచుకున్నారని … ఆయన స్కాముల విలువ 30 వేల కోట్లని ప్రధాని మోడీ గత ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలను తేజస్వి వెలుగులోకి తెచ్చారు. మోడీ ప్రసంగం తాలూకు వీడియోలను ప్రచారం లోకి తెచ్చారు. ఈ ఆరోపణలకు జవాబు చెప్పుకోలేక బీజేపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో దుమారం రేపుతోంది. మొత్తం మీద నితీష్ కి కష్టకాలమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ 10 న ఎన్నికల ఫలితాలు వస్తే కానీ నితీష్ భవితవ్యం తేలదు.
——— KNMURTHY
ఇది కూడా చదవండి >>>>>>>> బీహార్ బాహుబలి ఏం చేస్తున్నాడో ?