Goverdhan Gande………………………………………
Why didn’t people believe that vaccine…………….. జనానికి విశ్వాసం ఎందుకు కలగడం లేదు? అపోహలు ఎందుకు తలెత్తాయి? పత్రికలు,మీడియాలో అనేక రకాల ప్రతికూల కథనాలు ప్రచారంలోకి ఎందుకొచ్చాయి? ఒక ప్రముఖ తెలుగు టీవీ దీని(కొవీషీల్డ్)పై మంగళవారం ఓ చర్చా కార్యక్రమాన్నే నిర్వహించింది.ఇప్పటికే ఉన్న అనుమానాలను ఈ చర్చ ఇంకొంత బలపడేలా చేసింది. ప్రస్తుతానికి కోవాగ్జిన్,కొవీషీల్డ్,స్పుత్నిక్ పేరిట మూడు రకాల టీకా /వాక్సిన్ లు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి.
స్పుత్నిక్ సంగతి పక్కన పెడితే, జనవరి నుంచి మిగతా రెండు వాక్సిన్ లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో కోవాగ్జిన్ పై పెద్దగా వ్యతిరేకత లేదు కాని కొవీషీల్డ్ పై అనేక అనుమానాలున్నాయి. అపనమ్మకంతో ఈ టీకా తీసుకునేందుకు జనం వెనకాడుతున్నారు. శాస్త్ర ప్రపంచం కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేసింది కూడా. కీలమైన కొన్ని శాస్త్ర వ్యవస్థలు,కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి ఈ సంగతిని అధికారికంగానే నివేదికల రూపంలో వివరించారు కూడా. ఈ సంగతిని ప్రభుత్వం పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్లుగా కనిపించదు. మొక్కుబడి ప్రకటనలు మినహా
ఈ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు.
పైగా పెద్ద నాయకులెవరూ కొవీషీల్డ్ టీకా తీసుకోలేదు. ప్రధాన మంత్రి కూడా కోవాగ్జిన్ టీకానే తీసుకున్నారు. ఒకరో ఇద్దరో జాతీయ నాయకులు కోవీషీల్డ్ టీకా తీసుకొని ఉండి ఉంటే జనంలో ఉన్న అప నమ్మకం కొంతైనా తొలగిపోయి ఉండేది. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇంకా ఎలాంటి టీకాను తీసుకోలేదు.వీరంతా టీకా తీసుకొని జనానికి భరోసా కల్పించి ఓ సానుకూల సందేశం జనంలోకి పంపించగలిగి ఉంటే టీకా తీసుకునేందుకు మరికొంత మంది ముందుకు వచ్చేవారు.
ఇంకొంత మంది కోవీషీల్డ్ టీకా తీసుకొని కరోనా విస్తృతిని కొంతలో కొంతైనా తగ్గించగలిగేవారు. ఇలాంటి విపత్కర సమయాల్లో జనానికి విశ్వాసం కలిగించడం ప్రజా ప్రభుత్వాల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించని ఫలితమే దేశంలో 20 శాతం కోవిడ్ పాజిటివిటీ. ఇన్ని మరణాలు సంభవించేవి కావు.లక్షల కుటుంబాలు వీధుల పాలయ్యేవి కావు. కర్ఫ్యూ లు,లాక్ డౌన్ లు ఈ స్థాయి లో ఉండేవి కావు.