ఇలాంటి నవలపై నిర్మాతల కన్నుపడదే ?(2)

Sharing is Caring...

Taadi Prakash …………………………………………………….

Peoples ‘war and peace’ of srikakulam……………………………………….

కాలం చేసిన ఈ లాంగ్ మార్చ్ లో గ్రామీణ భూస్వామ్య వ్యవసాయ వ్యవస్థ కళ్ళ ముందే కూలిపోవడం… చల్లారిన సంసారాలు, తెల్లారిన బతుకులు… వీటన్నిటి గురించి అప్పలనాయుడు మరో 400 పేజీలు తేలిగ్గా రాయగలడు. అలా కాకుండా విషయాన్ని సూటిగా, క్లుప్తంగా, శక్తిమంతంగా చెప్పడమే రచయిత సాధించిన విజయం. చాలాచోట్ల నాకు, అరే.. ఇక్కడ యింకో నాలుగైదు వాక్యాలు రాస్తే బావుండేది కదా అన్పించింది.

అలాంటి temptation ని resist చేసుకోగలిగాడు రచయిత. సంయమనం అవసరం. అయితే ఇలాంటి అలవిమాలిన సంయమనం పాటించగలగడం అరుదుగా జరుగుతుంది. ఏది ఎంత చెప్పాలో అంతే చెప్పి వూరుకోగల నిర్దయుడైన రచయితని అప్పల్నాయుడులో చూడగలం. ఎందుకంటే, అట్టాడ అప్పలనాయుడు విప్లవ కార్యకర్త. ఉద్యమంతో మమేకం అయినవాడు. నీరుగారిన ఉద్యమాన్ని చూసి మనందరిలాగే నిరాశోపహతునిగా మిగిలిపోయినవాడు. ఐనా ఆశ చావని మానవుడు. ఈ నేపథ్యం వున్నా, నవలలో ఎక్కడా ఎర్రజెండాలు ఎగరేయలేదు. ఉపన్యాసాలు దంచలేదు. నినాదాలతో హోరెత్తించలేదు.

శ్రీకాకుళం లోంచి ఉద్యమాన్ని తీసిపారేయలేం గనక, చరిత్రని చెరిపేయడం కుదరదు గనక, ఈ నవల్లో సుబ్బారావు పాణిగ్రాహి పాట ఎక్కడో కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. చరిత్రాత్మకమైన వెంపటాపు సత్యం త్యాగాన్నీ, ఆదిభట్ల కైలాసం ఆదర్శాన్నీ… అరుపులూ, కేకలూ, ఊరేగింపులూ లేకుండా సున్నితంగా, సందర్భోచితంగా ప్రస్తావించిన తీరు గుండెని గాయపరుస్తుంది. ఒక ఉద్యమకాలానికి, కొన్ని ఉద్రిక్త సంఘటనలకీ సాహిత్య గౌరవం ఇచ్చిన తీరులోని ఔచిత్యం నాకెంతో నచ్చింది.

స్పెయిన్ అంతర్యుద్ధ కాలంలో, నియంత జనరల్ ఫ్రాంకో, ఉత్తర స్పెయిన్ లోని Basque నగరంపై బాంబుదాడి చేశాడు. ఆ విధ్వంసాన్నీ, మానవ మహా విషాదాన్నీ 1937లో ఒక పెద్ద పెయింటింగ్ వేశాడు పాబ్లో పికాసో. దాని పేరు guerica (గెర్నికా). 20వ శతాబ్దపు మహత్తరమైన పెయింటింగ్ పేరుగాంచిన గెర్నికా International symbol of genocide గా నిలిచిపోయింది. అచ్చూ అలాగే… శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని పంట భూముల విధ్వంసాన్నీ, తరతరాల గ్రామీణ రైతుల, వ్యవసాయ కుటుంబాల, రోజుకూలీల నిత్యజీవన విషాదాన్ని ‘బహుళ’ గెర్నికా అనే బృహత్తరమైన పెయింటింగ్ వేసి, కానుకగా యిచ్చినవాడు అప్పల్నాయుడు.

కొన్ని ఫ్లాష్ బ్యాక్ లతో చెప్పిన నాన్ లీనియర్ టెక్నిక్ ‘బహుళ’ కథకి ఒక ఊపునీ, కొత్త శక్తినీ యిచ్చాయి. కొన్ని చోట్లయినా గాబ్రియేల్ గార్షియా మార్క్వేజ్ పాఠకుడి స్మృతిపథంలో మెదులుతాడు. అనేకానేక పాత్రలూ, మనస్తత్వాలూ, కొన్ని డజన్ల కుటుంబాలు, విభేదాలు, ఘర్షణలూ, హత్యలూ, కుట్రలూ, భేషజాలూ, వేదనా, కన్నీళ్లూ నదిలా కలిసి ప్రవహించే యీ narrative లోని విస్తృతీ, గాఢతా, వైవిధ్యం ఒక సంపూర్ణ జీవితానుభవంగా మనలోకి ఇంకుతున్నపుడు టాల్ స్టాయ్ గుర్తుకి రాకమానడు. ‘war and peace’ కళ్ళముందు కదలాడుతుంది.

అప్పల్నాయుడి నవలకి రాసిన ముందుమాటలో కవి కె.శివారెడ్డి, epic novel ‘బహుళ’ మార్క్వెజ్ one hundred years of solitude ని గుర్తుచేస్తుంది అన్నారు. “కళింగయుద్ధ క్షతగాత్రుడని నేను ఇష్టంగా గుండెకు హత్తుకునే రచయిత అప్పల్నాయుడు. ‘బహుళ’ని రూపంలో లో టాల్ స్టాయ్ ‘యుద్ధమూ శాంతి’ నవలతో పోల్చవచ్చు” అని మరో ముందుమాటలో ప్రసిద్ధ విమర్శకులు ఎ కె ప్రభాకర్ అన్నారు. “నవలా రచయిత అంటే, సొంత ఇంటిని కూల్చుకుని ఆ ఇటుకలతో తన నవల అనే సౌధాన్ని పునర్నిర్మించేవాడు” అన్న మిలన్ కుందేరా మాటల్ని కోట్ చేస్తూ, ఈ మాటకి ‘బహుళ’ నవల సరైన ఉదాహరణ అని రచయిత గంట్యాడ గౌరునాయుడు అన్నారు.

నవలలో తొలితరం పెద నారాయుడు, మనవడు నారాయుడు, అతని కొడుకు రాధేయ, బలరాం, సంధ్య, జానేష్, సత్యకాలం, బంగారమ్మ, అన్నపూర్ణ, కనకం నాయుడు, జగన్నాథ దాసు… ఇలా ప్రతిఒక్కరూ చీమూ నెత్తురూ వున్న సజీవమైన పాత్రలు. ఉద్యమంలో ఉండి, పోరాడి, చివరికి వెనక్కితగ్గిన ప్రధానపాత్ర రాధేయ, రచయిత అట్టాడ అప్పలనాయుడే అని తెలుసుకోవడం ఎంతో బావుంటుంది. నవలలోని అనేక సంఘటనలు వాస్తవంగా జరిగినవే. చాలమంది అప్పల్నాయుడికి తెలిసిన వాళ్లే. సహచరులే! కనక యీ బృహన్నవల యీ రచయిత జ్ఞాపకాల జలపాతం!

అప్పల్నాయుడు నిజాయితీగా, నిక్కచ్చిగా, నిష్కర్షగా గతకాలపు గాయాలనీ, తిరుగుబాటునీ, ఉద్యమ వైఫల్యాన్నీ, రాజకీయ కపటత్వాన్నీ, వంచననీ, జనశ్రేణుల నిస్సహాయతనీ ఒక క్రమంలో కళాత్మకంగా, వివరణాత్మకంగా చెప్పిన తీరు వల్ల ఈ నవల ఒక historic document గా రూపుదిద్దుకుంది.

అనేకానేకులు చాన్నాళ్లుగా నా లోలోపల గూడుకట్టుకుని మాగురిండి రాయవేట్రా? అని గుణిసేవారు. నడుముకి నాగులగావంచా, భుజాన నాగలీ, పతాకలా ఎగిరే తలపాగాతో నల్లగా, బలిష్టంగా, జబరగా తాత ముత్తాతలూ, యెడమ పయ్యాడ గోరంచు కోకతో, కాళ్ళ కడియాలతో, చేతుల మట్టిగాజులతో, కొనకమ్ములూ, ముక్కుపుడకల మొహాలతో, వారమెట్టలతో, పొట్టీ, పొడుగూ అమ్మమ్మ, అమ్మమ్మల అమ్మలూ నవలలోకి చొరబడసాగేరు. రాస్తుంటే… అనేకానేకాంశాలు మనసులో కదులుతుంటే, కళ్ళ ముందు మెదులుతుంటే… తీవ్ర జ్వరపీడనగా వుండీది… అన్నాడు అప్పలనాయుడు.

It can be a web series!   ఒక పెద్ద సినిమా తీయడానికి సరిపడినన్ని ఉద్విగ్న సన్నివేశాలూ, నెత్తురు మరిగించే సంఘటనలూ, ఉత్కంఠ రేపే flash back లూ, నాటకీయమైన మలుపులూ ‘బహుళ’లో దండిగా వున్నాయి. సగం కథ మారుమూల గ్రామాల్లో, కొండల్లో, గిరిజన సంతల్లో… మరో సగం నగరాల్లో ఏసీ గదుల్లో modern life style తో.  అప్పల్నాయుడి gripping narrative పాఠకుణ్ణి లాక్కుపోతుంది. ఒక దాడినో, హత్యనో, అర్ధరాత్రి కిడ్నాప్ నో అచ్చూ స్క్రీన్ ప్లే లాగే రాశారు. అతీ, అతిశయోక్తి, over dramatization లేకుండా సహజసుందరంగా అప్పల్నాయుడు రాసిన తీరు సినిమాకి బాగా నప్పుతుంది.

వందేళ్ల చరిత్ర, 430 పేజీల నవల గనక వెబ్ సిరీస్ కి అయితే మరీ బాగుండొచ్చు. విజువల్ గా చూస్తే శ్రీకాకుళం పర్వత సానువుల్లో, నాగావళి, వంశధార నదీ తీరప్రాంతాల్లో మబ్బుల్ని తాకే పచ్చని వృక్షాల నీడల్లో వ్యవసాయం… కూలీలు… రైతన్నలు! ఎడ్లూ, గేదెలూ, గొర్రెలూ, మేకలూ… పాతకాలం గ్రామాలూ, జానపద బాణీలూ, కొండల వెనుక ఉద్యమం, సాయుధ పోరాటం… కొందరు ఉద్యమకారులు నగరాలకు వెళిపోయి కుటుంబాలతో సాధారణ జీవితం గడపడం… ఆవిరైపోతున్న ఆదర్శం, చెదిరిపోయిన కల తిరిగి వస్తాయనే చిగురుటాశ… ఇంకేం కావాలి?

సినిమావాళ్ళకి కావల్సిన కమర్షియల్, మాస్ మసాలా అంతా ‘బహుళ’ లో ఎంతో సహజంగా అమిరి ఉన్నాయి. శ్రద్ధతో, చిత్తశుద్ధితో గనక ఈ నవలని తెరకెక్కించగలిగితే It can be a sensational blockbuster. బండి నారాయణస్వామి రాయలసీమ చారిత్రక నవల ‘శప్తభూమి’నీ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ నవలనీ సినిమాలు తీసే ప్రయత్నం జరుగుతోంది. అప్పల్నాయుడి ‘బహుళ’కీ ఆ potential వుంది. “బహుళ “కావాలంటే 9440031961కి గూగుల్ గాని ఫోన్ పే ద్వారా గానీ 300 రూపాయలు పంపితే ..మీ చిరునామా మెస్సేజ్ పెడితే రిజిస్టర్ద్ బుక్పోస్టు లో నవలను రచయిత మీకు పంపుతారు.

Read it also ………………………….. ఇలాంటి నవలపై నిర్మాతల కన్నుపడదే ? (1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!