Will the Muslim vote be split? ………………..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ నాయకుడు, భరత్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ‘జనతా ఉన్నయన్ పార్టీ’ (Janata Unnayan Party – JUP)ని స్థాపించారు. ఈ పార్టీని డిసెంబర్ 22, 2025న అధికారికంగా ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ఆయన ఈ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.
ఈ పార్టీ ప్రధానంగా వెనుకబడిన ముస్లిం వర్గాల సంక్షేమం, సామాన్య ప్రజల సమస్యలపై దృష్టి సారించింది.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 135 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో హుమాయున్ కబీర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లో కూడా పనిచేశారు. హుమాయున్ కబీర్ తన కొత్త పార్టీ ద్వారా ముస్లిం ఓట్లను చీల్చుతారని మమతా బెనర్జీ కలవరపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింలు 30 శాతానికి పైగా ఉన్నారు.. సుమారు 120-126 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేస్తారు. ఈ ఓట్లు సాంప్రదాయకంగా TMCకి బలమైన మద్దతుగా ఉన్నాయి. హుమాయున్ కబీర్ తన కొత్త పార్టీ JUP అభ్యర్థులను ముస్లిం ప్రాబల్యం ఉన్న 135 స్థానాల్లో పోటీ చేయిస్తానని ప్రకటించడంతో TMC ఓటు బ్యాంకుకు గండి పడే ప్రమాదం ఏర్పడింది.
కబీర్ ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహా మసీదు నిర్మిస్తానని ప్రకటించి, దానికి పునాది రాయి వేయడం ద్వారా ముస్లిం వర్గాలలో మతపరమైన సెంటిమెంట్‌ను రెచ్చగొట్టారు. ఇది మమతా బెనర్జీ “హిందూ బుజ్జగింపు” రాజకీయాలకు వ్యతిరేకంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు.
కబీర్‌కు వామపక్షాలు, ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయని, ఇది TMCకి మరింత నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.ముస్లిం ఓట్లు చీలిపోతే, అది పరోక్షంగా బీజేపీకి లాభిస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు.కబీర్ బీజేపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని, మైనారిటీ ఓట్లను విభజించడానికి బీజేపీ ఆయనను ఉపయోగిస్తోందని ఆమె బహిరంగంగా విమర్శించారు.
పశ్చిమ బెంగాల్‌లోని ముస్లిం ఓటర్లు బీజేపీని ఓడించగల బలమైన పార్టీకే మద్దతు ఇస్తారు. దశాబ్దాలుగా వారి ఓటింగ్ సరళి మతపరమైన ఆకర్షణ కంటే రాజకీయ భద్రత వైపే ఉంది. ప్రస్తుతం, ముస్లిం ఓట్లపై TMCకి తిరుగులేని పట్టు ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా TMC బలమైన రక్షణ గోడగా నిలబడిందనే భావన వారిలో ఉంది.
కబీర్ 70-80 శాతం మంది ముస్లింలు తనతో ఉన్నారని చెబుతున్నారు. గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, ఎన్నికల సమయంలో ముస్లిం ఓటర్లు తమ ఓటును వృథా చేసుకోవడానికి ఇష్టపడకుండా, బీజేపీని ఓడించగల అభ్యర్థి వైపే మొగ్గు చూపేవారు. ఈ సారి కూడా అలాగే జరుగుతుందా ?లేక గంప గుత్త గా కబీర్ కొత్త పార్టీ కి వేస్తారా ?అనేది ఇపుడే చెప్పలేం..అక్కడ అభ్యర్థి ..పార్టీని బట్టి ఎన్నికల రోజునే తెలుస్తుంది.
ముఖ్యంగా కబీర్ ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా మమతా బెనర్జీ ఆధిక్యానికి గండి కొట్టాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ముస్లిం ఓట్లను ఏకం చేయడానికి అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM,అబ్బాస్ సిద్ధిఖీకి చెందిన ISF పార్టీలతో పొత్తు కోసం కబీర్ ప్రయత్నిస్తున్నారు.
ముస్లిం ఓట్లు చీలిపోతే అది అంతిమంగా బిజెపి (BJP)కి లాభిస్తుందనే భయం ఓటర్లలో ఉండవచ్చు. ఇది కబీర్ పార్టీకి పెద్ద ప్రతిబంధకం కావచ్చు.టిఎంసి కూడా ఫిర్హాద్ హకీమ్ వంటి బలమైన ముస్లిం నేతలను రంగంలోకి దింపి ఈ ప్రభావం తగ్గించేందుకు వ్యూహాలు రచిస్తోంది.
మొత్తానికి, ఈ పార్టీ సొంతంగా ఎన్ని స్థానాలు గెలుస్తుందనేది పక్కన పెడితే, టిఎంసి ఓట్లను చీల్చడం ద్వారా రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చే “కింగ్ మేకర్” పాత్ర పోషించాలని హుమాయున్ కబీర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

