సినీ సంగీత ప్రపంచంలో బప్పీలహరి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. భారీ ఆకారం .. ఒళ్ళంతా బంగారం ..చేతికి ఉంగరాలు.. నల్ల కళ్ళజోడు.. ఇలాంటి గెటప్ లో మరే సంగీత దర్శకుడు కనిపించడు. ఆ గెటప్ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది.
చెరగని చిరునవ్వు ..బంగారం అంటే బప్పీకి చాలా ఇష్టం. గోల్డ్ ఈజ్ మై గాడ్` అంటారాయన ఎప్పుడూ. . ఆయన మెడలో ఎప్పుడూ బంగారు ఆభరణాలు మెరుస్తుంటాయి. ఈ బంగారం కథ ఏమిటి ? అని ఒక ఇంటర్వ్యూలో అడిగినపుడు ఒక హాలీవుడ్ పాప్ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ మరింత పెరిగిందని ఆయన వివరించారు.
‘నా మొదటి సాంగ్ రికార్డింగ్ సమయంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ని మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. పెళ్లయ్యాక కూడా నా భార్య ఓ గణపతి లాకెట్ కూడిన బంగారు గొలుసును ఇచ్చింది.
నా మొదటి సినిమా జఖ్మీ సక్సెస్ అయినప్పుడు, మా అమ్మ నాకు మరో గొలుసు ఇచ్చింది. అప్పటినుంచి బంగారంపై ప్రేమపెరిగింది. ప్రముఖ అమెరికన్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ అంటే చాలా ఇష్టం.అతని కంటూసొంత గుర్తింపు ఉంది. ఆయన పద్ధతి చూసి ఆకర్షితుడిని అయ్యాను.
ఇక నా కెరీర్ వృద్ధి చెందే కొద్దీ బంగారం కూడా పెరిగింది.” అని ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అదలాఉంటే బప్పీ వద్ద 754 గ్రాముల బంగారం .. 4.62 కిలోల వెండి ఉంది. 2014లో ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్‌లో ఆమేరకు ఆయన పేర్కొన్నారు.