Subramanyam Dogiparthi ……………………….. A combination of top actors
భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది .చంద్రగుప్తుడు ,అశోకుడు పాత్రలంటే ఎన్టీఆర్ కి చాలా మక్కువ అని అప్పట్లో చెబుతుండేవారు. రెండు పాత్రల్లో ఆయన నటించారు, సొంతంగా సినిమాలు తీశారు.
చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు. నందులు ఆయన్ని అవమానించి ఉండకపోతే , చంద్రగుప్తుడు రంగంలోకి వచ్చేవాడే కాదేమో ! అలా చాణక్యుడే ముఖ్యుడు. అప్పట్లో ఈ పాత్ర గుమ్మడి లేదా ముక్కామల వేయవచ్చని అనుకుంటూ ఉండేవారు.
కూడికలు , తీసివేతల తర్వాత ఆ పాత్ర అక్కినేనిని వరించింది. 1977 లో విడుదలైన ఈ చాణక్య చంద్రగుప్త సినిమాలో మరో ప్రధాన పాత్ర అలెగ్జాండర్. ఆ పాత్రకు శివాజీ గణేశన్ ఎంపిక అప్పట్లో సెన్సేషన్. ముగ్గురు ఉధ్ధండులు నటించిన సినిమా ఇది. ఆ స్థాయిలో విజయం సాధించలేదు.
చంద్రగుప్తుని చరిత్ర 340 BCE నాటిది. చాలా కధలు ప్రచారంలో ఉన్నాయి . ఈ సినిమా రిలీజ్ సమయంలో అలెగ్జాండర్ చంద్రగుప్తుని కాలం వాడు కాదని, వారిద్దరు అసలు తారసపడలేదని, యుద్ధం జరగలేదని చర్చోపచర్చలు జరిగాయి . అయితే చాణక్యుని అవమానం , ముర , రాక్షస మంత్రి , చంద్రగుప్తుడిని చాణక్యుడు మగధ సింహాసనం మీద కూర్చోపెట్టడం వరకు భిన్నమైన చరిత్రలు లేవు.
ముగ్గురు అగ్ర నటుల స్థాయిలో రికార్డులు బ్రేక్ కాలేదు. గొప్ప హిస్టారికల్ సినిమా . పింగళి కాకుండా ఏ మోదుకురి జాన్సన్ వంటి వాడయితే బాగుండేదేమో ! పెండ్యాల సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి. పాటలను అన్నీ సి నారాయణరెడ్డే వ్రాసారు. కన్నప్ప కొన్ని దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించారు.
చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో , ఎవరో ఆ చంద్రుడెవరో ఆ వీర చంద్రుడు ఎవరో , ఇదే తొలిరేయి పాటలు శ్రావ్యంగా ఉంటాయి. చాణక్యుని స్థాయిలోనే ఆలోచించగల సమర్ధుడు రాక్షసమంత్రి నందుల కొలువులో ఉంటాడు.ఈ పాత్రను సత్యనారాయణ చక్కగా పోషించారు. రాక్షస మంత్రి తన సొంతకూతురు ఆశానే విషకన్యగా మారుస్తాడు.
ఆ ఆశానే చంద్రగుప్తుని చంపడానికి ప్రయోగిస్తాడు. ఇది తెలుసుకుని చాణక్యుడు తన శిష్యుడైన చంద్రగుప్తుడిని రక్షిస్తాడు. నిజంగానే చంద్రగుప్తుని ప్రేమించిన ఆశా ప్రాణాలు కోల్పోతుంది. విష కన్య పాత్రను జయప్రద చేసి మెప్పించింది. చాణక్య పండితుడిని నందులు అవమానించే సన్నివేశం .. ఆ సందర్భం గా అక్కినేని సుదీర్ఘ డైలాగులు చెప్పిన తీరు అద్భుతంగా తెరకెక్కాయి.
ఇతర పాత్రలలో రావు గోపాలరావు , ప్రభాకరరెడ్డి , ముక్కామల , రాజనాల , రాజబాబు , పద్మనాభం , మంజుల , యస్ వరలక్ష్మి , జయమాలిని , హలం ప్రభృతులు నటించారు. మా గుంటూరులో నాజ్ థియేటర్లో చూసా . సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు చూడవచ్చు.
ఈ సందర్భంగా మిత్రులకు ఓ చిన్న సమాచారం . సామ్రాట్ అశోక్ అనే ఓ సీరియల్ ప్రతి ఆదివారం సాయంత్రం ఈ టివిలో వస్తుంది . చాలా బాగుంటుంది . చాణక్యుడు ఎలా అయితే చంద్రగుప్తుడిని సింహాసనం ఎక్కిస్తాడో , అలాగే అశోకుడిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టే ప్రయత్నం ఉంటుంది ఈ సీరియల్లో . చూస్తుండకపోతే వచ్చే ఆదివారం మొదలుపెట్టండి . సాయంత్రం అయిదు గంటలకు వస్తుంది .
——————–
తర్జని ……………….
@ఈ సినిమాలో నటించినందుకు అక్కినేని ఎలాంటి పారితోషకం తీసుకోలేదు. బదులుగా ఎన్టీఆర్ ను తమ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నటించమని అక్కినేని అడిగారు. అందుకు ఎన్టీఆర్ ఒకే అన్నారు. అయితే అది అన్నపూర్ణ బ్యానర్ పై వర్కవుట్ కాలేదు.
@ తర్వాత అక్కినేని జగపతి ఆర్ట్ పిక్చర్స్ తో కలసి ‘రామకృష్ణులు’ చిత్రం నిర్మించారు. అందులో అక్కినేని, ఎన్టీఆర్ కలసి నటించారు. వి బీ రాజేంద్రప్రసాద్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడింది. జయసుధ, జయప్రదలు హీరోయిన్లుగా నటించారు.
@1963లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత ఎన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించింది చాణక్య చంద్రగుప్త లోనే. ఇరువురి అభిమానులు అప్పట్లో సంతోషపడ్డారు. ఈ చిత్రం టైటిల్స్ లో చాణక్యునిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు పేరు ముందుగా తెరపై కనిపిస్తుంది. తరువాత నడిగర్ తిలకం శివాజీగణేశన్ పేరు .. ఆ తర్వాత ‘చాణక్య-చంద్రగుప్త’ టైటిల్, ఆ పైన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్టీఆర్… టైటిల్స్ చివరలో నిర్మాతగా ఎన్టీఆర్ పేరు వేశారు కానీ నటునిగా ఎన్టీఆర్ పేరు వేయలేదు.
@ సినిమా బిగినింగ్ సన్నివేశంలో చాణక్య పాత్రలో అక్కినేని కనిపిస్తారు. .. రెండో సన్నివేశంలో శివాజీ గణేశన్ కనిపిస్తారు. మూడో సన్నివేశంలో ఎన్టీఆర్ కనిపిస్తారు. ఎక్కడా కూడా ఎన్టీఆర్ డామినేషన్ కనపడదు. ఎన్టీఆర్ చేయగలిగి కూడా చాణక్య పాత్రను ఏఎన్నార్ కు ఇవ్వడం పట్ల ఇరువురి అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ చాణక్య పాత్రను సినిమాలో హైలైట్ చేసారు. అక్కినేని నట జీవితంలో ఇదొక మంచిపాత్ర. ఆ పాత్రకు ఆయన న్యాయం చేశారు.
@రాక్షస మంత్రి , విషకన్య తరహా పాత్రలు హీరో కృష్ణ తీసిన సింహాసనంలో కూడా కనిపిస్తాయి.