Sheik Sadiq Ali…………………………….. Exploring life till the end of life…
వినోద్ ఖన్నా …..ఒకనాటి బాలివుడ్ సూపర్ స్టార్,రాజకీయ నాయకుడు మాత్రమే అయితే ,ఈ పోస్ట్ రాయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆధ్యాత్మిక అన్వేషణలో బెంజ్ కారు అమ్ముకొని సన్యాసిగా మారిన వినోద్ భారతి గురించిన కొన్ని విశేషాలను పంచుకోవటం కోసమే ఇది రాయాల్సి వచ్చింది.
70 వ దశకం చివరిలో,80 వ దశకం మొదట్లో యావత్ భారతావనిని ఉర్రూత లూగించిన నటుడు వినోద్ ఖన్నా. అమితాబ్ బచన్ సూపర్ స్టార్ గా అవతరించటం లో కీలక భూమిక పోషించిన వాడు. తన పొజిషన్ ను కాపాడుకోవటానికి అమితాబ్ నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిన వాడు. ఆరడుగుల పైన ,అందమైన రూపమున్న వాడు. ఎందరో అమ్మాయిలకు అప్పట్లో అతనంటే ఏంతో క్రేజ్. విలాసవంతమైన బంగాళా.బెంజ్ కారు. కోట్లాది రూపాయల ఆస్థులు.వడ్డించిన విస్తరి అతని జీవితం.
అవేవీ అతనికి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. రంగుల ప్రపంచంలో తారగా వెలుగుతూ కూడా నిరంతరం అన్వేషణలో ఉండేవాడు. జీవితానికి అర్ధం,పరమార్ధం ఏమిటి? భౌతిక సుఖాలేనా జీవితమంటే? అని తనను తాను ప్రశ్నించుకునే వాడు. ఒకరోజు హటాత్తుగా మాయమైపోయాడు. సినిమాలు వదిలేశాడు.బెంజ్ కారు అమ్మేశాడు. అమెరికాలో ఉన్న తన ఆధ్యాత్మిక గురువు రజనీష్ దగ్గరికి చేరుకున్నాడు.ఓషో ఆశ్రమంలో చేరి,వినోద్ భారతిగా మారి సన్యాసి జీవితం ప్రారంభించాడు.
సాధన చేస్తూనే ,అక్కడి బాత్రూం లు,లెట్రిన్ లు కడగటం,గిన్నెలు తోమటం,బట్టలు ఉతకటం వంటివి చేసేవాడు.సూపర్ స్టార్ గా సర్వ సుఖాలు అనుభవించిన వాడు ఒక పని వాడిగా మారిపోయాడు. కొన్నేళ్ళపాటు అక్కడే అన్వేషణలో గడిపాడు. అక్కడా తనకు సమాధానం దొరకలేదు. తిరిగి ఇండియాకు వచ్చాడు.పూనే లోని ఆశ్రమ బాధ్యతలు చూసుకోమని రజనీష్ కోరినా సున్నితంగా తిరస్కరించి మళ్ళీ బాలీవుడ్ కు వచ్చాడు.
మళ్ళీ సినిమాల్లో నటించాడు.ప్రేక్షకులు అభిమానంతో అక్కున చేర్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడా విజయం సాధించాడు.నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. అయినా, సాదాసీదా సన్యాసి జీవితాన్నే గడిపాడు. జీవిత చరమాంకం వరకు జీవితాన్ని అన్వేషిస్తూనే గడిపాడు. జీవితంలో అన్నీ సాధించాక కూడా , అసంతృప్తితో గడుపుతున్న వారెందరో ఉన్నారు.నిరంతరం అన్వేషణలో గడుపుతున్నారు. అలాంటి వారికి వినోద్ ఖన్నా జీవితం ఒక ఉదాహరణగా చూపించ వచ్చు. 2017 లో వినోద్ ఖన్నా కన్నుమూసారు.