శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ?
శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ జిలెన్ స్కి చర్చలలో పాల్గొంటారని వార్తలొచ్చాయి. ఇరువురూ యుద్ధ విరమణ ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ పుతిన్ సైలెంట్ అయిపోయాడు. జెలెన్ స్కి మాత్రం పుతిన్ యుద్ధ నేరస్తుడని ఐరాస మీటింగ్ లో వాదించారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఆ మాట చాలాకాలంగా అంటున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న పుతిన్ ఏమి మాట్లాడకపోవడంతో ఆయన మరో వ్యూహంలో ఉన్నారా అన్న సందేహాలు ప్రచారం లో ఉన్నాయి.శాంతి చర్చలు ఎపుడు జరుగుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది.
ఉక్రెయిన్ ఆగ్నేయ ప్రాంతాలపై దాడులకు రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ సైనిక వర్గాలు పదేపదే చెబుతున్నాయి. ఆ మేరకు బలగాల మోహరింపు, సైనిక పరమైన సమీకరణలు రూపొందుతున్నాయని అంటున్నాయి. పారిశ్రామికంగా కీలకమైన డాన్‌బాస్‌పై పట్టు సాధించడానికి అక్కడ పెద్దసంఖ్యలో సైనికుల్ని రష్యా పంపుతోంది.
లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాల్లోని కొన్ని నగరాలను స్వాధీనం చేసుకోవడంపై పుతిన్ సేనలు వ్యూహరచన చేస్తున్నాయనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే పుతిన్ ప్లాన్ బీ అని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. నెలరోజులకు పైగా యుద్ధం చేసిన రష్యా సైనికులు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
పుతిన్ చర్చల్లో పాల్గొనకపోయినా యుద్ధం ముగిసిందని ప్రకటించలేదు. దీంతో కొంత టైం తీసుకుని పుతిన్ మరో వ్యూహం అమలు చేయడానికి సిద్ధమవుతున్నారా అని ఉక్రెయిన్ సందేహపడుతోంది. మొత్తానికి పుతిన్ ఏమి మాట్లాడకుండా అందరిని ఉత్కంఠలో పెట్టారు.
ఇపుడు తిన్న దెబ్బలతో సరిపెట్టుకుంటారా ? మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతారా అనేది సస్పెన్స్ గా మారింది.అసలు రష్యా హిండర్ ఎజండా ఏమిటి అనేది ఎవరికి తెలీదు. ఎప్పటికి ఏది తోస్తే దాన్ని అమలు జేయడమే పుతిన్ ఎజండా అని ఆయన విమర్శకులు అంటారు. చూస్తుంటే పుతిన్ మానసికంగా కొంత మేరకు నలిగి నట్టున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగా లేదని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాలి. ఎవ్వరూ ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు చేయవద్దని యుద్ధ సమయంలో అమెరికా పదేపదే ఊదరగొట్టింది. కానీ అదే అమెరికా మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూనే వుంది. ఇలా చమురు కొనుగోలు చేస్తూ.. తమ ఆర్థిక వ్యవస్థను అమెరికా పరిపుష్టం చేస్తోందని రష్యా తాజాగా ప్రకటించింది.
రష్యా రక్షణ పరిషత్ ఉప కార్యదర్శి మైఖేల్ పోపోవ్ ఈ విషయాన్నిప్రకటించారు. గత వారం రోజుల్లోనే ఏకంగా పెద్ద ఎత్తున అగ్రరాజ్యం అమెరికా తమ నుంచి చమురు కొనుగోలు చేసిందని ఆయన బాంబు పేల్చారు. ప్రతి రోజూ అమెరికా రష్యా నుంచి లక్ష బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేస్తోందని పోపోవ్ అంటున్నారు.
కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా ఖనిజాలు, ఎరువులు కూడా కొనుగోలు చేయడానికి అమెరికా తమ కంపెనీలకు అనుమతినిచ్చిందని పోపోవ్ చెబుతున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తేలాల్సి ఉంది. సైనిక శక్తిలో ఎంత బలం ఉన్నప్పటికీ రష్యా లక్ష్యాలు నెరవేరకపోవడం అన్నది క్షేత్రస్థాయి సమస్యలకు ఒక సంకేతం అయింది.
రష్యా దాడుల కారణంగా సైనిక నష్టంతో పాటుగా.. రష్యా ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అఫ్గానిస్థాన్‌పై దాడి చేసిన చేదు ఫలితాన్నే రష్యా ఇక్కడా చవి చూడవచ్చు. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం నుంచి కోలుకోవడానికి ఆ దేశానికి ఏళ్లు పట్టవచ్చు.ఇవన్నీ గమనించే పుతిన్ సైలెంట్ అయ్యాడనే ప్రచారం కూడా ఉంది.