Bharadwaja Rangavajhala …………………………………………
సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తొలి ఉగాదికి రవీంద్రభారతిలో పంచాంగశ్రవణం జరుగుతోంది. శాస్త్రి గారు పంచాంగ శ్రవణం పూర్తి చేశారు. వేద పారాయణ జరిగింది. చివరలో … స్వస్తి వచనం చెప్పారు ..అయితే అక్కడ నిజానికి స్వస్తి వచనం ఇలా చెప్పాలి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాః …… న్యాయేనమార్గేణ మహీం మహీశాః….. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం……. లోకా సమస్తా సుఖినోభవంతు అని … కానీ శాస్త్రి గారు మొదటి రెండు లైన్లూ చెప్పి … గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనే లైన్ ఎగరగొట్టారు.
కారణం ఏమిటీ? అంటే …ముందు రోజు సాయంత్రం సమాచారశాఖ కమిషనర్ గారు శాస్త్రిగారిని పిల్చి … అయ్యా మీరు పండితులూ … మరి అక్కడేమో ప్రభుత్వం … స్వస్తి వచనంలో మీరు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అంటారూ .. అదేమో ఓ కులానికి సంబంధించిన మాటా … మరి ఇదేమో ప్రజాస్వామ్యమూ … ఇతర కులాల ప్రస్తావన అందులో లేదు కనుక ఆ లేన్ పీకేసి చదవండీ అన్నారు …శాస్త్రి గారు ఏమంటారూ అవతల ప్రభుత్వం … సరే అన్నారు.
మర్నాడు వారు సభలో కమిషనర్ గారు చెప్పినట్టుగానే గోవుల్నీ బ్రాహ్మల్నీ వదిలేసి చదివారు. అయితే … అది వింటున్న రామారావు గారు … లేచి మైకందుకుని … శాస్త్రిగారూ మీరు స్వస్తివచనంలో ఎందుకు ‘గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం’ అనే పాదం వదిలేశారు? అని ప్రశ్నించారు. ఆయన ఏం చెప్తాడూ … కమీషనర్ గారు పీకమన్నారూ అని చెప్పలేడాయె . దీంతో రామారావు గారు కొంచెం రెచ్చిపోయి … ఏం పర్వాలేదూ … చదవవచ్చూ అన్నారు. అనడమే కాకుండా అందులో ఏముందీ?
గోవులూ బ్రాహ్మణులూ శుభంగా ఉండాలే అన్నారు. అంతే కదా … అందులో తప్పేముందీ? అయితే ఇక్కడ బ్రాహ్మణులంటే ఎవరూ? అని ప్రశ్నించారు .. దానికి వారే సమాధానం చెప్పేశారు. బ్రహ్మజ్ఞానం ఉన్నవారెవరైనా బ్రాహ్మణులే అని క్లారిటీ ఇచ్చారు.బ్రాహ్మణుడు అంటే కులం కాదు … బ్రహ్మజ్ఞానమున్న శూద్రుడైనా బ్రాహ్మణుడే అన్నారు. సభికులు అవాక్కై వింటున్నారు. ఇది నేను చెప్పడం కాదు … ఆదిశంకరాచార్యులే చెప్పారన్నారు.
‘చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషామనీషామఘ’ ఆత్మజ్ఞాని ఛండాలుడైనా సరే, నాకు గురువే – అని సాక్షాత్తూ శంకరాచార్యులే ఉద్ఘాటించారు. కదా అన్నారు రామారావుగారు … ఇలా బ్రహ్మజ్ఞానము కలవారే బ్రాహ్మలు అనడం వెనుక ఆయనలో … త్రిపురనేని రామస్వామి గారు కనిపిస్తారు .ఈ ఎన్టీఆరూ ఉగాది ఎదురుదాడి అనే కథను చెప్పిన కుర్తాళం పీఠాధిపతి గారు ఈ విషయం మాత్రం చెప్పలేదు.
బ్రహ్మజ్ఞానమున్న వారెల్లరూ బ్రాహ్మణులే అని క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే అని దానవీరశూరకర్ణలో దుర్యోధనుడి లెవెల్లో ఆయన అన్నమాట … ఎంత గొప్పగా ఉన్నది? ఇలా గంటన్నర సేపు ఎన్టీఆర్ చేసిన ప్రసంగంలో … అనేక అంశాలు దొర్లాయని కూడా స్వాముల వారు చెప్పారు.అయితే రామారావు గారి ఉపన్యాసం ఖచ్చితంగా బ్రాహ్మణ వ్యతిరేక ఉపన్యాసమే అనే విషయం నాకు అర్ధం అయ్యింది. స్వామీజీ మాత్రం పాజిటివ్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది.
కులనిర్మూలన నినాదం ప్రధానంగా అగ్రకుల కమ్యునిస్టులది … ఈ వాదనతో వారు కులవృత్తుల మీద దాడి చేశారూ చేస్తున్నారూ …అలా కుల నిర్మూలన అనేదేదైతే ఉందో అది వారికి ఉపయోగపడింది తప్ప కింది కులాలకు ఒరిగింది ఏమీ లేదు.నాకెందుకో కుల నిర్మూలన అనే మాటకన్నా కులాల మధ్య ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి అనే మాటే బెటరనిపిస్తూంటుంది.
కమ్యునిజమో మరోటో ఎవరికి అవసరమో వారు తప్ప మిగిలిన వారందరూ ఆ నదిలో మునకేసి ఎర్రచొక్కాలు తొడుక్కున్నారు… అందువల్లనే ఇలాంటి నినాదాలు బయల్దేరి ఉండొచ్చు కూడా .. అని నాకు చాలా రోజులుగా అనుమానం … అసలు ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వాడిగా విప్లవంతో నాకేటి సంబంధం ?నేనెందుకు కమ్యునిస్ట్ ఉద్యమంలోకి పోయాను? నాకుగానీ నా కులానికిగానీ … ప్రస్తుత సమాజంతో వచ్చిన మౌలికమైన ఇబ్బంది ఏమీ లేదు కదా … ఎవరికి అవసరమో వారు వచ్చి చేయాల్సిన పని కదా అది.
నిన్ననే ఓ గదిలో కూకోని నిక్కరేస్కుంటా ఉంటే … ఓ కింది కులాలాయన … ఏమయ్యా మీకేం పనయ్యా విప్లవం కాడా … మాక్కదా అవసరం అన్నాడు … నాతో ..నాకు బుర్ర గిర్రున తిరిగింది …నిజమే కదా అనిపించింది … అదండీ సంగతి .. మరో సారి బుర్ర గిర్రున తిరిగినప్పుడు మళ్లీ కలుద్దాం …అంత వరకు సెలవు.