Paresh Turlapati……………
సరైన సమయంలో పరుగు ఆపడం ఓ కళ అన్నారు శోభన్ బాబు .. అన్నట్టుగానే ఆంధ్రుల అందాల నటుడిగా ప్రేక్షకుల మనస్సుల్లోని భావనలు చెదరక ముందే సినిమా రంగానికి రిటైర్మెంట్ ప్రకటించి చెన్నైలో సెటిల్ అయిపోయారు..
ఆనాటి శోభన్ బాబు నిర్ణయంతో ఈనాటికీ ఆయన అందాల నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. నిజం ..శోభన్ బాబు ది మంచి పాలసీ హాయిగా చేసినన్నాళ్లు సినిమాలు చేశాడు.. వయసు మీద పడి వెండి తెర మీద తండ్రి పాత్రలు చేసే స్థాయికి పడిపోకముందే ఎటువంటి వివాదాలు లేకుండా హీరోగా నిష్క్రమించాడు.
కమలహాసన్…. చాలా మంచి నటుడు.. చాలా సినిమాల్లో అతడి నటనకు నేను ఫిదా.. కొన్ని పాత్రలు అయితే కమల్ హాసన్ మాత్రమే చేయగలడు..విచిత్ర సోదరులు.. అమావాస్య చంద్రుడు… అల్టిమేట్ అంతే. ఇంకెవరూ చేయలేరు .. సాగర సంగమం.. స్వాతి ముత్యం అయితే చెప్పే పనే లేదు. నటనలో శిఖరాన్ని తాకాడు.
చిన్నప్పటినుంచి చూస్తునే ఉన్నా..చాలా సినిమాలు చేశాడు. కమల్ హాసన్ ఎప్పుడూ తమిళియన్ అన్న ఫీలింగే నాకు రాలేదు … టాలెంట్ కు భాషతో పనేంటి అనుకునే వాడిని..అలా నాలా చాలామంది తెలుగు వాళ్ళు కమల్ హాసన్ ను అప్పట్లోనే ఓన్ చేసుకున్నారు..
భాషాభిమానం చూపించి కమల్ హాసన్ ను దూరం పెట్టుంటే తెలుగులో అతడి సినిమాలు ఒక్కటి కూడా ఆడేవి కావు.. కళకు భాషా భేదాలు అడ్డు రావు..రాకూడదు అనుకునే అమాయకత్వంతోనే ఆయన సినిమాలను తెలుగు నాట ఆదరించాం.
అలాంటి చక్కటి నటుడు కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టి ఇన్నాళ్ళు సినిమాల్లో సంపాదించుకున్న పేరును బురదలో కలిపేస్తున్నాడని అప్పుడే అనుకున్నా .. ఇప్పుడు చెన్నైలో thug of life సినిమా ఫంక్షన్లో అర్ధ జ్ఞానంతో చేసిన వాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతుంది..
“నా హృదయం..ప్రాణం.. తమిళంతో ముడి పడి ఉంది” అంటూ ఫంక్షన్లో చిన్నసైజు కవితతో ఉపన్యాసం మొదలెట్టాడు కమల్ హాసన్.. అంతవరకు బానే ఉంది.. ఫంక్షన్ కు వచ్చిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ ” కన్నడం కూడా తమిళంలోనుంచే వచ్చింది.. అక్కడ ఉండే మీరు ఇక్కడికి రావడం కూడా అలాంటిదే” అని అర్థం కాని పోలిక ఒకటి చెప్పాడు.
ఫంక్షన్లోనే ఉన్న శివరాజ్ కుమార్ కమల్ హాసన్ కు ఓ దణ్ణం పెట్టి ఊరుకున్నాడు… కానీ కన్నడిగులు ఊరుకోలేదు… కన్నడ నాట thug of life బాయ్ కాట్ కు పిలుపు ఇచ్చారు.. సీఎం సిద్ధరామయ్య సైతం కమల్ హాసన్ ది ఆఫ్ నాలెడ్జ్ అని విమర్శించాడు. వివాదం చిలికి చిలికి గాలి వానై కర్ణాటకలో పెద్ద ఇష్యూ అయ్యింది.
అసలు తమిళం ఎక్కడ్నుంచి పుట్టింది ? కన్నడం ఎక్కడ్నుంచి పుట్టింది ?అని పురావస్తు తవ్వకాలు జరపడం మొదలెట్టారు అటు అరవం వాళ్ళు.. ఇటు కన్నడం వాళ్ళు …ఎవడు చెప్తాడు?ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం పుట్టిన భాషల గురించి ఇప్పుడు ఎవడు చెప్తాడు?
ఏతావాతా కొంతమంది చరిత్ర కారులు తెలుగు. తమిళం.. కన్నడం.. మలయాళం ఇత్యాది భాషలన్నిటికీ ప్రాచీన ద్రావిడ భాష మూలం అనిన్నూ .. తమిళం.. కన్నడం శబ్దంలోనూ..వ్యాకరణంలోనూ ఒకలాగే ఉన్ననూ ఒకటి కాదనీ వేరు వేరు భాషలే అనిన్నూ తేల్చారు !
సరే అసలు నిజాలు ఎలా ఉన్నా ఇంతటి వివాదానికి కారణం నోటి దూల… కావున నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అని తమిళంలో చదువుకుని తెలుసుకోవాలి మిస్టర్ స్వాతిముత్యం కమల్ హాసన్.. చేసిన సినిమాలు చాలు కానీ పాత సినిమా క్యాసెట్లు చూసుకుంటూ హాయిగా రెస్ట్ తీసుకోక ఈ వయసులో రచ్చలు నీకెందుకు తంబీ.. నీకో వణక్కం.