జీవిత భాగస్వామి లేనోళ్లందరూ సింగిల్ పేరెంట్స్ కారు. జీవిత భాగస్వామి లేకుండా, ఇంకో పెళ్లి చేసుకోకుండా పిల్లల పెంపకం బాధ్యత చూసుకొంటున్నవారు సింగిల్ పేరెంట్స్. ఈ విషయం కూడా తెలీనోళ్లు చాలా మంది ఉన్నారు, అందుకే రాశాను. ప్రతి సింగిల్ పేరెంట్ భాగస్వామిని వదిలేసి వచ్చేసినోళ్లు కాదు. కొందరి విషయంలో చిన్న/నడి వయసులోనే భాగస్వామిని పోగొట్టుకుని పిల్లల పెంపకం బాధ్యత చూస్తునోళ్లు ఉంటారు. సైన్యంలో/స్పెషల్ పోలీస్ ఫోర్స్ లో తూటాలకు బలై భర్తను పోగొట్టుకున్నోళ్లు ఉన్నారు. జీవిత భాగస్వామిని, పిల్లలను వాళ్ళ కర్మకు వదిలేసి ఇంకోరితో వెళ్ళిపోయినోళ్ళ వల్ల సింగిల్ పేరెంట్స్ గా మిగిలినోళ్ళూ ఉన్నారు. భర్త/భార్య క్రిమినల్స్ అయినప్పుడు వారికి దూరంగా జరిగి పిల్లలను బాధ్యతగా పెంచుతున్న వారూ సింగల్ పేరెంట్స్ లో ఉన్నారు. ఇవేవీ కాకుండా భాగస్వామితో గృహ హింస భరించలేక పిల్లలతో బయటకు వచ్చేసి సింగిల్ పేరెంట్ గా బ్రతుకుతున్నవారూ ఉన్నారు. (బయట సుఖం కోసం వెళ్ళేవాళ్ళు పిల్లల బాధ్యత నెత్తికెత్తుకోరు, వాళ్ళు సింగల్, సింగల్ పేరెంట్ కాదు) సింగిల్ పేరెంట్స్ లో అడవాళ్లే కాదు, దాదాపు అంతే మంది మగవాళ్ళు కూడా ఉన్నారు.
సింగిల్ కి, సింగిల్ పేరెంట్స్ కు ఉన్న తేడా పిల్లల బాధ్యత తీసుకోవడం! అందుకే సింగల్ పేరెంట్స్ అంటే నాకు ఓ ప్రత్యేకమైన గౌరవం.
సింగల్ పేరెంట్స్ కు కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయి
1)పని భారం, వత్తిడి. సింగల్ పేరెంట్ పిల్లల బాధ్యత తీసుకున్నప్పుడు తల్లి, తండ్రి రోల్ పోషించాల్సి ఉంటుంది. ఇంటి పనులు, బయటి పనులు, పిల్లల పనులు, స్కూలు పనులు, షాపింగ్ పనులు ఇలా చాలా వత్తిడితో రోజులు గడుస్తాయి.
2)సింగల్ పేరెంట్స్ కు ఏ పెళ్లికి, ఫంక్షన్ కు వెళ్లడం అంత సులభం కాదు. ఆమె ఆడది అయితే ఫంక్షన్ లో ఆడవాళ్లు తమ భర్తకు ఎక్కడ వల విసురుతుందో అని భయపడి పోతుంటారు. మగవాడు అయితే మిగిలిన మగవాళ్లు తమ భార్యపిల్లల్ని పరిచయం చెయ్యడానికి ఇష్టపడరు. ఇవన్నీ వాళ్ళ కళ్ళలో కనబడుతున్నా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి. అది కష్టం.
3)రోడ్లో దాదాపు అందరు మగాళ్ల కళ్ళకు సింగల్ పేరెంట్ గా ఉన్న ఆమె మెడలో “అవైలబుల్” బోర్డు కనబడుతుంది. వాళ్ళ చూపులు హ్యాండిల్ చేయడం అదనపు సమస్య.
4) సింగల్ పేరెంట్ గా ఉన్న ఆడది పనిచేసే ఆఫీసులో చాలా మంది మగాళ్లు ఆమెను పెర్ఫెక్ట్ చిన్నఇళ్లుగా ఉంచుకోవడానికి తెగ ప్రయత్నించడం చూసాను. మగవాళ్లయితే వాన్నొక దద్దమ్మలా చూస్తారు.
5) స్కూల్లో పిల్లలు సరిగ్గా చదవకపోయినా, కాస్త అల్లరి చేసినా, ముభావంగా ఉన్నా, క్లాసులో ఎక్కువ ప్రశ్నలు అడిగినా…టీచర్లు సింగల్ పేరెంట్ స్టేటస్ కు కనెక్ట్ చేసి మాట్లాడేస్తుంటారు. వాళ్ళ కళ్ళకు అన్నింటికీ అదే ప్రధాన కారణంగా కనబడుతుంటుంది.
6) సింగల్ పేరెంట్స్ దాదాపుగా ఇంకో పెళ్లికి అనర్హులుగా మిగిలిపోతారు. భర్త లేని స్త్రీని, భార్య లేని పురుషుణ్ణి పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతారు కానీ పిల్లల బాధ్యత ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకోడానికి దాదాపుగా ఎవ్వరూ ఇష్టపడరు. అలా చేసుకున్నా, కొన్నాళ్ళకే ఆ పిల్లల్ని వేరుగా హాస్టళ్లలో ఉంచమని పోరు మొదలవుతుంది.
ఇలాంటి బాధలు ఇంకా చాలా ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు దృష్ట్యా సింగల్ పేరెంట్స్ మళ్లీ పెళ్లి చేసుకోడానికి ధైర్యం చెయ్యరు. అలా ఒప్పుకున్నా ఇంట్లో పెద్దలు వారికి ఇంకో ఫ్రెష్ సంబంధం చూస్తారు. అది ఇంకో డిజాస్టర్లో ముగుస్తుంది. సింగల్ పేరెంట్స్ ఓసారి తమ పిల్లలను స్థిరపరిచి వాళ్లకు పెళ్లిళ్లు చేసేసాక అసలైన సమస్య మొదలవుతుంది. కూతురు అయితే ఆమె దగ్గర ఉండడానికి అల్లుడు/అతని తలిదండ్రులు ఒప్పుకోరు. కొడుకు అయితే కోడలు ఒప్పుకోదు. ఇన్నాళ్లూ పిల్లలే ప్రపంచంగా బ్రతికిన సింగల్ పేరెంట్ ఒంటరిది/వాడు అయిపోతారు. కనీసం మాట్లాడడానికి కూడా ఎవ్వరూ ఉండరు ఎందుకంటే వీళ్ళ సోషల్ కంటాక్ట్స్ దాదాపుగా కట్ అయిపోయి ఉంటుంది. సంబంధీకులు వీళ్ళను అవాయిడ్ చేస్తారు. అప్పటికి వీరి వయసు ఓ 50 ఉంటుంది. ఆ తర్వాత ఇంకో 25 ఏళ్ళు ఇలాంటి దుర్భరమైన ఒంటరి బ్రతుకు బ్రతకాలి!
యవ్వనంలో తోడు అవసరం అని లోకం అనుకొంటుంది కానీ మనిషికి వయసైన కాలంలోనే తోడు అవసరం. సంసారిక జీవితం అంటే పడక సుఖం మాత్రమే అనుకునే పక్షిమెదళ్లకు ఈ విషయం అర్థమవదు.
సమస్యకు కొన్ని పరిష్కారాలు ఉన్నాయి 1)ఒక సింగల్ పేరెంట్ ఇంకో సింగల్ పేరెంట్ ను పెళ్లి చేసుకోవడం. అది అంత సులువు కాదు, ఇద్దరి పిల్లలు కలవరు. వాళ్ళను కలపడానికి చాలా ఓపిక, నేర్పు, శ్రమ అవసరమౌతుంది. 2)పిల్లల పెళ్లిళ్ల బాధ్యత తీరిన వెంటనే తాము పెళ్లి చేసుకోవడం. ఈ సిచువేషన్లో పిల్లలు ఒప్పుకోరు. తమ గౌరవమర్యాదలు తగ్గిపోతాయని వాళ్ళు అభ్యంతరం తెలుపుతారు. 3) అన్నింటికంటే మేలైనది పిల్లలే పెళ్లి కుదర్చడం. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో ఇది జరుగుతోంది. పిల్లలే తమ సింగల్ పేరెంట్ కు సరైన జోడి వెతికి పెళ్లి చేస్తున్నారు. కానీ వందలో ఒకటో రెండో ఇలా సుఖాంతం అవుతుంది.
ఒక్క విషయం మనిషన్నోడు గుర్తించాలి సింగల్ పేరెంట్ అనే పరిస్థితి ఎవ్వరూ కోరి తెచ్చుకునేది కాదు. అది వదులుకోలేని బాధ్యత మోయడం. ప్రతి సింగల్ పేరెంట్లో చాలా ఆత్మాభిమానం ఉంటుంది. దాన్ని గౌరవించలేనోడు మనిషి కాలేడు. సింగల్ పేరెంట్స్ కు ఉన్న కష్టాలు అనుభవించినోడికి మాత్రమే అర్థమౌతుంది.
నేను వీళ్ళను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను.
సింగిల్ పేరెంట్ అంటే అంత చులకన ఎందుకో ?
సుదర్శన్ టి ..………….
సింగిల్ పేరెంట్ కష్టాలు తెలీకుండానే కొంతమంది విమర్శలు చేసేస్తుంటారు. చూస్తే అవన్నీ పబ్లిసిటీ కోసమే చేసే విమర్శలే అనిపిస్తుంది. అసలు ఒక సింగిల్ పేరెంట్ సమాజంలో బతకాలంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో ప్రాక్టికల్ గా ఎదుర్కొన్నవాళ్లకే తెలుస్తుంది. అయినా ఒక సింగిల్ పేరెంట్ పెళ్ళిచేసుకుంటే తప్పేంటి ? చేసుకోకూడదా ? మన సమాజంలో అలాంటి కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయా ? ఏమి లేవు.వాళ్ళు పడే కష్టాలను చూసి మనమేమైనా సహాయపడుతున్నామా? లేదే . అలాంటపుడు ఈ వయసులో పెళ్లిళ్లు అవసరమా అంటూ కనిపించని సామాజిక విలువల కోసం కన్నీళ్లు కార్చడం ఏమిటి ? చిత్రం కాకబోతే ?