Taadi Prakash ……………………………………………………………
The treasure of Telangana’s ethnic art………. అడివి గాచిన వెన్నెల్ని నువ్వు రెండు చేతుల్తో పట్టుకుని తెచ్చి నాకు ఇవ్వగలవా? అరణ్యాల్లో అపరాత్రి కురిసిన వాన చినుకుల రహస్య సంగీతాన్ని తెచ్చి నా చెవులకి వినిపించగలవా? కొండగుహల్లో దాక్కొని ఉన్న అంతుచిక్కని కుడ్య చిత్ర సౌందర్యాన్ని నా కళ్ళముందు ఆవిష్కరించగలవా ? ఒక పురాతన పద్యంలా ప్రతిధ్వనిస్తున్న ఆదివాసుల ‘ఆద్యకళ’ తాళ పత్రాలను నాకు కానుకగా ఇవ్వగలవా?… అసాధ్యం కాదది, కష్ట సాధ్యమే అని చెప్పగల వాడొకడు ప్రతీ తరంలోనూ వుంటాడు … వాడు కొన్ని దశాబ్దాల కాలాన్ని ధారబోస్తాడు.
కాలం తెలియని పాత బొమ్మల కోసం జీవితాన్ని పణం పెడతాడు. అడవులు పట్టి పోతాడు. కొండలెక్కుతాడు. కళ ఎక్కడ కనిపించినా కళ్ళకి అద్దుకుంటాడు. ఇప్పుడు, ఇక్కడ, మన కళ్ళఎదుట వున్న అలాంటి పిచ్చివాడి పేరు జయధీర్ తిరుమలరావు. ఆయన ఆశ నెరవేరాలని కోరుకుంటున్న మరో వెర్రి తల్లి గూడూరు మనోజ.
హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకమైన మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గేలరీ లో ‘ఆద్యకళ’ ప్రదర్శన జరిగింది. అది Telangana ethnic arts exhibition. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు 40 ఏళ్లు శ్రమించి, సేకరించి, భద్రపరిచిన అమూల్య వారసత్వ సంపద. కళా, సాంస్కృతిక అధ్యయనంలో అపార అనుభవం ఉన్న ప్రొఫెసర్ మనోజ కృషి, తపన, అభిరుచి ఈ ప్రదర్శనకి కొత్త అందాన్ని తెచ్చాయి .. కొయ్యతో, లోహంతో చేసిన కళాకృతులు, తాళపత్ర గ్రంథాలూ, వాద్య పరికరాలు, వస్త్రాలపై వేసిన రంగుల బొమ్మలను నాలుగు కేటగిరీలు చేశారు.
అవి : ఆది అక్షరం, ఆదిధ్వని, ఆది చిత్రం,…. గిరిజన లోహ కళాకృతులు (డోక్రా)ఇవి అలనాటి అపురూప జానపదకళలు. గిరిజనుల చేతుల్లో రూపుదిద్దుకున్న అందాల బొమ్మలు … దళిత బహుజనుల కళాభినివేశానికి చారిత్రక ఆనవాళ్లు. ఇది దక్కన్ పీఠభూమి పలవరింత. మన మూలవాసుల మురిపెం..తెలంగాణ ఆదివాసీల ఆత్మ!
విశాలమైన ఆర్ట్ గేలరీలో మూడు అంతస్తుల్లో వందల బొమ్మలూ, శిల్పాలూ, పురాతన సంగీత వాద్యాలూ, తాళపత్ర గ్రంథాలు, వెలకట్టలేని రాత ప్రతులను పేర్లతో, వివరాలతో, వ్యాఖ్యానంతో ఆకట్టుకునేలా డిస్ ప్లే చేశారు. రాతి శాసనాలు, నాటి లిపి, పొడవాటి తాటాకుల మీద అద్భుతమైన గొలుసుకట్టు తెలుగు రాత, దస్తావేజులు, కైఫీయతులు, మహిళల కాళ్ల కడియాలు, సున్నితమైన, నాజూకైన డిజైన్లలోని కళాచాతుర్యం వుట్టిపడే చిత్రాలు మనల్ని కట్టిపడేస్తాయి.
తోలు, తాటాకు, కాగితం మీద రాతలు, రాగిరేకులు, ఎద్దు ఎముకల మీద అక్షరాలు, రుంజ, తంబుర, బూర, కొమ్ముబూర, విల్లంబులు, బాణాలు… గిరిజన సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యాలుగా వుంటాయి. ఇవన్నీ చూస్తే, చూసి ఆనందించగలిగే అంతరంగం అంటూ వుంటే… మనం ఎవరమో మనకి తెలుస్తుంది. మనకి పట్టని మన చరిత్ర, మన పూర్వీకుల జీవన విధానం, వాళ్ళ సౌందర్య దృష్టి, కళాసృష్టి కోసం పడిన తపన – అంతరించిపోయిన జాతుల ఆత్మసంగీతమై మనల్ని వెంటాడుతుంది. మనల్ని వుత్తేజితుల్ని చేసి, మన హృదయాల్ని వెలిగించి తిరోగమనమే పురోగమనం అనే స్పృహ కలిగించే ఈ జాతిసంపదని కాపాడుకోవాల్సిన సమయం ఇది.
ఇంత సజీవమైన, అరుదైన చిత్రకళా ప్రదర్శనకి టికెట్ లేదు. ఉచితంగానే చూడొచ్చు. అయినా ఆర్ట్ గేలరీలో రష్ లేదు. కొద్దిమంది మాత్రం చూసి వెళుతున్నారు.మనకి సినిమాలు ముఖ్యం… చిల్లర రాజకీయాలు ఇంకా ముఖ్యం … మాపటి కొస్తావా? మరి రేపటికొస్తావా? అనే పవిత్ర జాతీయ గీతాలంటే మరీ ముఖ్యం! ప్రభాసో, పవన్ కల్యాణో కావాలి మనకి…..అనుష్కో, పూజా హెగ్డేనో వుంటే అయిదు వందలు విసిరేసి సినిమా టికెట్ కొంటాం. లేదంటే బ్లాక్ లో వెయ్యి రూపాయలకి టికెట్ కొని మొదటిరోజే చూశాం అని మీసం మెలేస్తాం. కల్తీ లేని ఎంటర్టైన్మెంట్ కావాలి. డాన్సులతో వూగిపోవాలి. శృంగార కళాసౌందర్య తత్వజ్ఞానాన్నంతా మనం వెండితెర మీదే వెతుక్కుంటాం. అదోరకంగా బతుకుతుంటాం.
ఏళ్ల తరబడి హైదరాబాద్ లోనే వుంటూ సాలార్జంగ్ మ్యూజియం, చౌమొహల్లా పాలెస్, పబ్లిక్ గార్డెన్స్ లోని మ్యూజియం చూడనివాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. చరిత్ర మీద గౌరవమూ లేదు, సృజనాత్మక కళ మీద ప్రేమా లేదు. మన ఉజ్వల సంస్కృతి మీద మమకారమూ లేదు. బహుశా, మనం శాపగ్రస్తులం! దయనీయమైన దురదృష్టవంతులం….కేవలం సుఖలాలసత్వానికి బానిసలం కూడానేమో!
జయధీర్ తిరుమలరావు ఒక్కచేత్తో చేసిన యీ పని అసాధారణమైంది. అవిశ్రాంత పరిశోధన, నిరంతర శ్రమ. తెలంగాణా జాతిసంపద ముందు తరాల కోసం సేకరించి, భద్రపరిచి వుంచడం కోసం ఒక జీవితకాలాన్ని ఎవరు వెచ్చించగలరు? ఎవరికి పట్టింది?? ఖర్చు, శ్రమ, యాతన, నిద్రలేని రాత్రులు తప్ప.. ‘శభాష్.. జయధీర్, గొప్ప పని చేస్తున్నావ్’.. అని భుజం తట్టేవాడు ఒక్కడంటే ఒక్కడూ వుండడే! Being creative is not a hobby, it’s a way of life అంటున్న తిరుమల రావు మాటలు అరణ్యరోదనేగా!
pl. read it also …………………………….. ఈ అద్భుత ఆద్యకళ ను కాపాడేదెవరు ? (2)