ఈ అద్భుత ఆద్యకళ ను కాపాడేదెవరు ? (2)

Sharing is Caring...

Taadi Prakash …………………………….

The treasure of Telangana’s ethnic art………………………………ఒక్క ఎమ్మెల్యేని ఎన్నుకునే చిన్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక మనకెందుకింత అబ్సెషన్ గా మారిపోయింది? వార్తా పత్రికలు, రాజకీయ నాయకులు, ప్రచార సాధనాలు ఎందుకింత హడావిడి చేస్తున్నాయి? భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నట్టు ఈటల రాజేందర్ పోజు! బ్రిటిష్ వాళ్లని దేశం నుంచి వెళ్ళగొడుతున్నట్టు కేసీయార్ మిడిసిపాటు! తగుదునమ్మా అంటూ మధ్యలో దూరి మనం కళలనీ, సాంస్కృతిక వారసత్వమనీ ఉపన్యాసాలు దంచితే, పడీపడీ నవ్వుకుంటారేమో!

ఈ అపూర్వమైన కళాప్రదర్శన చూసి ఆశ్చర్యచకితులైన కొందరు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలూ జయధీర్ తిరుమలరావు గారికి ఒక ఆఫర్ యిచ్చాయి. ‘ఎంత డబ్బయినా యిస్తాం, ఇవన్నీ మాకు యిచ్చేయండి. బ్లాంక్ చెక్ యివ్వమంటారా?’ అంటున్నాయి. అయితే మొత్తం ఈ తెలంగాణా ఆదివాసీల కళా సాంస్కృతిక వారసత్వ సంపదని విశాఖకో, గుంటూరుకో, ముంబాయికో తరలించుకుపోతాం అంటున్నారు.. బోల్డంత డబ్బు వస్తుందికదా అని తిరుమలరావు ఎగిరిగంతేయడం లేదు. నా ప్రజలు, నా రాష్ట్ర సంపద ఎవరో ఎగరేసుకుపోవడం ఏమిటి? అని విచారంలో వున్నారాయన.

దశాబ్దాలు చెమటోడ్చి సేకరించిన యీ కళ, శిల్పాలూ, సంగీత పరికరాలు, బొమ్మలూ, ఆభరణాలూ, లక్ష పేజీల తాళపత్రాలూ, పుస్తకాలూ, చిత్రకళా స్క్రోల్స్ అన్నీ మన రాజధానీ నగరం హైదరాబాద్ లోనే ఉండాలని జయధీర్ తిరుమలరావు ఆకాంక్ష. ఈ నిధిని ఎట్టిపరిస్థితుల్లోనూ సంరక్షించి తీరాలనీ, యిక్కడే భద్రపరచాలనీ ప్రొఫెసర్ మనోజ పట్టుదల … ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ కళాకృతులను ప్రాణాధికంగా ప్రేమించిన, వాటికోసం బతుకుల్ని అంకితం చేసిన బ్రిలియంట్ ప్రొఫెసర్లు జయధీర్, మనోజ వీటిని కోట్ల రూపాయలకు అమ్మడానికి సుతరామూ ఒప్పుకోవడం లేదు.

వీటన్నిటినీ యిక్కడే వుంచి, పరిశోధన కొనసాగించి, ముందుతరాల కోసం పరిరక్షించాలని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నారు. “అప్పడుపు కూడు భుజించుట కంటె…” అన్నట్టు యీ కళాభారతిని వ్యాపారులకు అమ్మడానికి అంగీకరించలేకపోతున్నారు, లేదా అసహ్యించుకుంటున్నారు. ఇన్ని మాటలెందుకు!

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గనక తలుచుకుంటే యిది ఒక్కరోజులో పరిష్కారం కాగల అతిచిన్న సమస్య. వీటన్నిటితో ఒక శాశ్వత మ్యూజియం అంటారో, ఒక యూనివర్సిటీ పెట్టొచ్చు అంటారో… అది తర్వాత సమస్య. రెండు మూడు రోజుల్లో ముగిసి పోయే ఈ ఎగ్జిబిషన్ తర్వాత, ఈ పురాతన సంపదనంతటినీ పదిలపరచాలి. అది తక్షణం చేయాల్సిన పని. జయధీర్ తిరుమలరావు ఇంట్లోనో, మరోచోటో వీటిని వుంచడం అసాధ్యం.

రాష్ట్ర ప్రభుత్వం గనక చొరవ తీసుకుంటే సమస్య దూదిపింజలా తేలిపోతుంది. సంకుచిత రాజకీయాల్నీ, యిష్టాయిష్టాల్నీ పక్కనపెట్టి, తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా భావించాల్సిన సమయం.ఇది భేషజానికీ, భావజాలానికీ సంబంధించినది కానేకాదు. మనకి గర్వకారణమైన కళని మనం కాపాడుకోగలమా? లేదా? అనేదే ప్రశ్న!

ఆర్టిస్ట్ మోహన్ నాకోసారి చెప్పాడు. పికాసో భార్య ఆదిలాబాద్ వెళ్లి, గోండులు చేసిన అనేక కళాకృతులను చూసి ఆశ్చర్యపోతూ, “అయ్యో. ఇక్కడ చాలామంది పికాసోలు వున్నారుగా” అనిందట. అవునుకదా. మనకెవరైనా చెప్పాలి. విదేశీయులైతే మరీ బావుంటుంది. జయధీర్ తిరుమలరావు చెబితే చప్పగా వుంటుంది. ఇందులో ఏదో కుట్ర ఉందనీ అన్పిస్తుంది!

జయధీర్ తిరుమలరావు అనే ఆద్యకళా ప్రేమికుడు తను చేయాల్సిన పనేదో సృజనాత్మకంగా చేశాడు. జీవితసాఫల్యం అనేదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడి వున్నాడు. మనం ఆయనకి బాకీపడి వున్నాం. జయధీర్ ని గౌరవించుకోవడం మనందరి బాధ్యత…..రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం వుంది. సాహిత్యం, కళల పట్ల గొప్ప అవగాహన వున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దీనిని పరిష్కరించగలరు. దీని విలువ పూర్తిగా తెలిసిన ఆయన.. ఒక వేదిక! ఒ ఒక మ్యూజియం! లేదా, ఒక విద్యాలయం!… ఏదన్నా చేయొచ్చు.

ఒక రామప్ప దేవాలయం, ఒక వేయిస్తంభాల గుడి లాగే.. జయధీర్ సేకరించిన అపురూప వారసత్వ సంపద కూడా అంతే అమూల్యమైనది. ఇందులో చర్చకీ, మరో అభిప్రాయానికీ తావేలేదు. అయినా… అయినా ఎవరిక్కావాలి తిరుమలరావు … నువ్వు జుట్టు పీక్కుని, గుండె బాదుకుని, గొంతు చించుకుని అరిస్తే మాత్రం ఎవరిక్కావాలి? ఎవరికి కావాలి నేస్తం..నీ నిధి…. నీ ఆశ…నీ నిరాశ….నీ వొంటరితనం!..శ్రీశ్రీ అన్నట్టు… సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగుతోంది.

ఎవరి పనులలో వాళ్లు…… ఎవరి తొందరలో వాళ్లు…… ఎవరికి కావాలి నేస్తం!..ఏమయిపోతేనేం నువ్వు! ఎక్కడికిపోతేనేం నీ నిధి!నీ చేతిలోని అమృతకలశాన్నిచూసీచూడనట్టు నటించగల అంధులం మేము. నీకది నిధీ… నిక్షేపం.. మాకు కేవలం కాలక్షేపం! మాది పరిపూర్ణమైన కల్చరల్ ఇల్లిటరసి .. కళాత్మలోకంలో దివాలా! మన్నించు ఆచార్యా… పోనీ… శపించు జయధీర్!
For further information, please contact:
Jayadhir Thirumal Rao
Jayadhirtr@gmail.com
9951942241
Prof. Guduru Manoja
Gmanoja61@gmail.com. 9704643240

Pl…Read it also …………………………………. ఈ అద్భుత ఆద్యకళ ను కాపాడేదెవరు ? (1).

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!