The mystery of the murders ……………………
అవి1968,1969 సంవత్సరారాల నాటి రోజులు.అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం అయితే జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడేవారు. వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జన సంచారం ఉండేది కాదు. కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో వరుసగా హత్యలు జరిగేయి.
ఈ సీరియల్ హత్యల విషయాలు వార్తా పత్రికలు,ఇతర మాధ్యమాల ద్వారా తెలుసుకుని జనాలు భయపడేవారు.ఈ హత్యలను జోడియాక్ కిల్లర్ అనే వ్యక్తి చేసాడు. జోడియాక్ అనేది అతని అసలు పేరు కాదు. అది ఆ సీరియల్ కిల్లర్ తనకు తానుగా పెట్టుకున్న నిక్ నేమ్. జోడియాక్ గానే ఈ సీరియల్ కిల్లర్ పాపులర్ అయ్యాడు.
ఈ నరహంతకుడు కొందరిని తుపాకీతో కాల్చి,మరికొందరిని కత్తితో పొడిచి చంపేవాడు. తమాషా ఏమిటంటే ఈ జోడియాక్ కిల్లర్ తాను హత్య చేసిన తర్వాత వార్తాపత్రికలకు ఈ విషయమై లేఖలు రాసి పంపేవాడు. జోడియాక్ రాసే ఉత్తరాలు నాలుగు రకాల కోడ్ లేదా సంకేత భాష రూపంలో ఉండేవి.
వీటిని చదవడం చాలా కష్టంగా ఉండేది. జోడియాక్ తాను రాసే లేఖలలో పోలీసులను దుర్భాషలాడేవాడు. తాను రాసిన లేఖలను ప్రచురించక పోతే మరింత మందిని చంపేస్తానని కిల్లర్ బెదిరించేవాడు.ఈ సీరియల్ కిల్లర్ యువ జంటలనే లక్ష్యంగా చేసుకునే మారణకాండ సాగించాడు.
ఈ జోడియాక్ కిల్లర్ చేతిలో మొత్తం 37 మంది హతులయ్యారు. అలాగే ఒంటరిగా ఎవరైనా దొరికితే వారిపై దాడి చేసి చంపేసేవాడు. జోడియాక్ కిల్లర్ వార్తాపత్రికలకు రాసిన లేఖల్లో తన పేరు జోడియాక్ అని తెలియజేశాడు. ఆపేరు ఎందుకు పెటుకున్నాడో కారణం ఎవరికి తెలీదు. పోలీసులు క్రైమ్ రికార్డులలో జోడియాక్ పేరు మీదనే కేసులు నమోదు చేశారు.
కాలిఫోర్నియా పోలీసులతో సహా అమెరికాలోని అన్ని ఏజెన్సీలు, డిటెక్టివ్‌లు ఎవరికి వారుగా జోడియాక్ కిల్లర్ కోసం వెదికారు. పోలీసులు గతంలో ఇదే తరహాలో హత్యలకు పాల్పడిన క్రిమినల్స్ చరిత్రను పరిశీలించారు. వారు ఎక్కడున్నారు ? ఏమి చేస్తున్నారు ? ఈ హత్యలతో వారికి సంబంధం ఉందా లేదా అన్న కోణంలో కూడా విచారించారు.
హత్యలు జరిగిన ప్రదేశాలలో దొరికిన వస్తువులను, ఆధారాలను, మృతుల బాడీలపై వేలి ముద్రలు, వెంట్రుకలు, ఇతర ఆధారాలను సేకరించి విశ్లేషణ చేశారు. ఇంటిగ్రేటెడ్ ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్,క్రిప్టానాలసిస్ విధానాలను ఉపయోగించారు.అయితే జోడియాక్ జాడ తెలియలేదు.
దర్యాప్తు ప్రారంభంలోనే పోలీసులు ఒక అనుమానితుడిని గుర్తించారు.అతని పేరు ఆర్థర్ లీ అలెన్, కానీ అతనిపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు దొరకలేదు.అలెన్ 1992 లో గుండెపోటుతో మరణించాడు. శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ 2004లో ఈ కేసును క్లోజ్ చేసింది.
మీడియాలో విమర్శలు రావడంతో 2007కి ముందు కేసును తిరిగి తెరిచింది. ఈ కేసు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది. హంతకుడిని గుర్తించడానికి తగిన ఆధారాలు లభిస్తాయనే ఆశతో కేసు ఇంకా తెరిచి ఉంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ సీరియల్ హత్యలపై ‘జోడియాక్ కిల్లర్’ పేరిట పుస్తకాలు కూడా వెలువడ్డాయి