సుదర్శన్.టి…………..
ఫోటోలో కనిపించే వ్యక్తి ‘వైట్ డెత్’ అనే మారుపేరుతో ప్రఖ్యాతి గాంచారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫిన్లాండు తరపున వింటర్ వార్ లో సోవియట్ సైనికులతో పోరాడాడు. ఖచ్చితంగా ఇతని తూటాలకే బలైన శత్రుసైనికుల సంఖ్య 505. వీళ్ళంతా ఇతను గురిచూసి కాల్చి చంపిన వారు.
ఇక ఇతని సబ్ మెషీన్ గన్ తూటాలకు బలైనవారు ఇంకో 200 పైచిలుకు ఉంటారు.ఇంతమందిని కేవలం 3 నెలల్లోపే చంపాడు. అంటే రోజుకు దాదాపు 8 మందిని అంతమొందించాడు. ఇతని అసలు పేరు సిమో హయా..(సిమో హేహా అనికూడా పిలుస్తారు)
ఫిన్లాండ్‌లోని వీపురి ప్రావిన్స్‌లోని రౌట్జార్వి మునిసిపాలిటీలోని కిస్కినెన్ కుగ్రామంలో జన్మించాడు.అతని తండ్రి, జుహో హేహా.. చిన్న పాటి రైతు. సిమో సైన్యంలో చేరక ముందు వ్యవసాయ పనులు చేసేవాడు. వేటకు వెళ్ళేవాడు. సిమో 17 సంవత్సరాల వయసులో ఫిన్నిష్ స్వచ్ఛంద మిలీషియా ప్రాజెక్టు లో సివిల్ గార్డ్ గా చేరాడు. రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నాడు.
ఇక ఇతని గురించి అందరూ చెప్పుకునే ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. సిమో సైన్యం లో చేరాక మెళకువలను నేర్చుకున్నాడు. తన చుట్టూ మంచు దిబ్బలను అమర్చుకునేవాడు.తెల్లటి రగ్గు కప్పుకుని దూరం నుంచి ఎవరూ చూసినా కనపడకుండా దాక్కునే వాడు.తన రైఫిల్ కూడా బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకునే వాడు.అతను గురి చూసి కాల్చాడంటే .. ఎదుటి వాని ప్రాణాలు పోయినట్టే లెక్క.సోవియట్ సైనికుల పాలిట మంచు మృత్యువుగా మారాడు.
అందుకే అతగాడికి ‘వైట్ డెత్’ అనేపేరు వచ్చింది. Sniper యూనిట్లో పనిచేసినా, ఏరోజూ లెన్సులు అమర్చిన తుపాకి వాడలేదని అంటారు . కేవలం బోల్ట్-ఏక్షన్ రైఫైల్ తోనే ఇంత మారణహోమం సృష్టించాడు. ఇతన్ని చంపడానికి USSR పంపిన అన్ని sniper యూనిట్లను మట్టుపెట్టాడు.
ఎన్నోసార్లు తనమీద జరిగిన పూర్తిస్థాయి ఆర్టిల్లరీ దాడి నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ఓసారి సరిగ్గా ముఖం మీద గ్రనేడ్ పేలడంతో ముఖం చిన్నాభిన్నమైంది. అయినా బ్రతికిపోయాడు. సూటిగా తలలోకి దింపిన బుల్లెట్టుతో సృహ తప్పిన ఇతను సరిగ్గా USSR ఫిన్లాండ్ మధ్య యుద్ధవిరమణ జరిగిన రోజు సృహలో కొచ్చాడు. కాల యమునికి ప్రతిరూపంగా సృష్టించబడిన ఇతను ఏప్రిల్ 1, 2002 లో తన 96వ ఏట ప్రశాంతంగా కన్నుమూసాడు.