ఎవరీ ఉషశ్రీ ? ఏమాయన కథ ?

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే ప్రవచన కర్త పేరు పురాణ పండ సూర్య ప్రకాశ దీక్షితులు. ఆ పేరుతో పాత తరం వారు కూడా ఆయనను గుర్తించలేరు. ఆయన ఉషశ్రీ కదండీ. పేరు తప్పుగా రాసారంటారు. అంతగా ఆయన ఉషశ్రీ పేరుతో పాపులర్ అయ్యారు. ఇక ఈ తరం వారిలో చాలామందికి కూడా ఈయన గురించి అంతగా తెలియదు.

ఉషశ్రీ ప్రఖ్యాత రేడియో వ్యాఖ్యాత, పురాణ ప్రవచకులు,రచయిత. ఆయనది విలక్షణమైన కంఠ స్వరం. సలక్షణ మైన భాష. ఆ రెండూ ఆయనను అద్భుతమైన వ్యాఖ్యాత గా .. ప్రవచన కర్తగా మార్చాయి. ఆకాశవాణి లో ఆయన మాట్లాడుతుంటే శ్రోతలు మంత్రముగ్దులై పోయేవారు. అలా రేడియోకి అతుక్కుపోయేవారు. అలాంటి అద్భుతమైన స్వరం ఆయనది.

70 దశకంలో ఆయన రేడియోలో ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పురాణ శ్రవణం వచ్చేది. తనదైన విలక్షణ శైలిలో పండితులకు, పామరులకు అర్ధమయ్యేలా శ్రోతలు పరవశులై పోయేవారు. గంగాజల ప్రవాహం లా సాగిపోయే ఆయన ప్రవచనాలు ఆలిండియా రేడియో ను అందరికి దగ్గర చేశాయి.

12 అవుతున్నదంటే చాలు..  అన్ని పనులు కట్టిబెట్టి రేడియో దగ్గర పిల్లలు ,పెద్దలు చెప్పేవారు. ఆయన ప్రవచనాలు విని కొన్నివేలమంది శ్రోతలు  ఉషశ్రీ అభిమానులుగా మారారంటే అతిశయోక్తి కాదు. అలాగే ఆయన నిర్వహించిన ధర్మ సందేహాల కార్యక్రమం కూడా సూపర్ హిట్ ప్రోగ్రాం. శ్రోతల సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చేవారు.

ఇందులో కూడా పండితులు, సామాన్యులు పాల్గొనే వారు. ఎక్కడా ఎవరిని నొప్పించకుండా .. ఆసక్తికరంగా ఉషశ్రీ జవాబులు చెప్పే వారు. కొందరు కొంటె ప్రశ్నలు వేసేవారు. అయినప్పటికీ లౌక్యంగా  సమాధానాలు ఇచ్చేవారు.అరగంట ప్రోగ్రామ్ అపుడే అయిపోయిందా అనిపించేది. అంత గొప్ప గా ఆయన ఆ కార్యక్రమాన్ని నడిపేవారు. ఆరోజుల్లో అంత గొప్ప ఫాలోయింగ్ మరొకరికి లేదు.

పురాణాలపై  గొప్ప పట్టున్న పండితుడు ఆయన. ఉషశ్రీ  ఖంగుమనే గొంతును అప్పట్లో చాలామంది సరదాగా ఇమిటేట్ చేసేవారు. అంతగా అయన పాపులర్ అయ్యారు. రేడియోలో పని చేస్తూనే  ఉషశ్రీ పలుచోట్ల జరిగే  ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పిలిస్తే వెళ్లేవారు. అలా ఆంధ్రప్రదేశ్ లో ఆయన తిరగని ఊరు లేదు. ఆయన స్వరం వినని జిల్లా లేదు.

ఉషశ్రీ పశ్చిమగోదావరి జిల్లా కాకర పర్రు అగ్రహారంలో పుట్టారు. చిన్నతనం నుంచే అన్ని పురాణ గ్రంధాలను చదివి పుక్కిట పట్టారు. భీమవరం కళాశాలలో బీఏ తెలుగు చదువుకున్న ఉషశ్రీ కొన్నాళ్ళు జర్నలిస్టుగా పనిచేశారు. 1965 లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో నెలకు 200 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరారు.

బాలాంత్రపు రజనీ కాంతారావు ప్రోత్సాహంతో అనతి కాలంలోనే  ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 1979 లో టీటీడీ ఉషశ్రీ చే వచన భాగవతాన్ని రాయించింది. భద్రాచలంలో సీతారామ కల్యాణానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసే జమ్ములమడక మాధవరామశర్మ దగ్గర మెలకువలు నేర్చుకున్నారు. కళాశాల రోజుల్లోనే ఉషశ్రీ పద్యాలు రాసేవారు.  గంభీర సమాసాలతో అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు.

అవన్నీ ఆయనకు రేడియో లో చేరాక  ప్లస్ అయ్యాయి. ఎప్పుడైతే రామాయణ భారతాలని ప్రజలకి దగ్గరగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారో అప్పుడే ఉషశ్రీ భాషలో మార్పు వచ్చింది. భాష మీద మోహం తగ్గింది. సమాసాలతో గ్రాంథికంగా సాగే భాష సరళమైన వ్యావహారికంగా మారింది. పెద్దపెద్ద వాక్యాల స్థానంలో చిన్న చిన్న వాక్యాలు చోటుచేసుకున్నాయి.

ఆశైలి.. ఆ వరవడి గోదావరి,కృష్ణమ్మ ప్రవాహంలా దూసుకు పోయేది. పురాణాలను , అందులో కీలక పాత్రలను తెలుగువారికి దగ్గరగా తెచ్చిన ఉషశ్రీ 1990 లో కన్ను మూసారు. ఇప్పటికి ముప్పయి రెండేళ్లు అయినా తెలుగు వారు ఆయనను గుర్తుంచుకోవడం విశేషం. 

(1987లో ఒంగోలు  జరిగిన ఒక సన్మాన సభ కు ఉషశ్రీ వచ్చారు. ప్రోగ్రామ్ ముగిసిన పిదప ఈ వ్యాస రచయిత ఆయనను కలసి పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేసారు.ప్రఖ్యాత నాట్యావధాని ధారా రామనాథశాస్త్రి  ఉషశ్రీ మంచి స్నేహితులు. శాస్రి గారే ఉషశ్రీని పరిచయం చేశారు. ) 

—————–K.N.MURTHY
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!