Bharadwaja Rangavajhala ………………………………………
సుందర్ లాల్ నహతా పేరు వినగానే చాలా మందికి బందిపోటు, రక్తసంబంధం, గుడిగంటలు, శాంతినివాసం, గూఢచారి 116 లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. అసలు ఎవరీ నహతా? కలకత్తా యూనివర్సిటీలో బికామ్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం కోసం తిన్నగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత చమ్రియా ను కలిసారు ఆయన.
నహతా ఆయనకు నచ్చారు. నువ్వు మద్రాసులో మా చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ మేనేజరుగా పనిచేయాలన్నారు. ఆలోచించుకుని చెబుతానన్నారు నహతా. అలా 1941 సంవత్సరంలో నహతా మద్రాసు బయల్దేరారు. చమ్రియాలో నహతాతో పాటు తర్వాత రోజులనాటి రాజశ్రీ పిక్చర్స్ అధినేత తారాచంద్ బర్జాత్యా కూడా పనిచేసేవారు.
ఇద్దరికీ స్నేహం కుదిరింది. సినిమా పరిశ్రమకు సంబంధించి అనేక విషయాలు ఆయన నహతాకు చెబుతూ ఉండేవారు. మద్రాసు శాఖ నిర్వహణలో నహతా అసమాన ప్రతిభ చూపించడంతో చమ్రియా సంస్ధలో భాగస్వామ్యం ఆఫర్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో చమ్రియా సంస్ధను కలకత్తా నుంచి విజయవాడకు మార్చారు.
దీంతో నహతా కూడా విజయవాడ వచ్చేశారు. అలా తెలుగు సినిమాలతో ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది నహతాకు.1950వ సంవత్సరంలో సుందర్ లాల్ నహతా మిత్రుడు తారాచంద్ బర్జాత్యా, బెజవాడ ఎగ్జిబిటర్ అశ్వర్థ నారాయణ లతో కలసి శ్రీ ప్రొడక్షన్స్ అనే సంస్ధ ఏర్పాటు చేసి చిత్ర నిర్మాతగా మారారు. అక్కినేని హీరోగా “శాంతినివాసం” తీశారు.
సినిమా వినోదాత్మకంగా ఉండడమే కాదు ప్రయోగాత్మకంగానూ ఉండాలనేది నహతా ఉద్దేశ్యం. ‘శాంతి నివాసం’ చిత్రంతర్వాత తారాచంద్ విడిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి సినిమా హాలు మారుతీటాకీసు యజమాని పోతిన శ్రీనివాసరావుతో కలసి చిత్ర నిర్మాణం కొనసాగించారు సుందర్ లాల్ నహతా. అప్పుడు వారి కంపెనీ పేరు రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ గా మారింది.
శ్రీనివాసరావు కుమారుడు డూండీ చిత్ర నిర్మాణ వ్యవహారాలు చూసుకునేవారు.వ్యాపారం తదితరాలు నహతా చూసేవారు. మినిమమ్ గ్యారంటీ ఉండాలంటే రీమేకులే బెటరనే థీయరీ డూండీది. అందుకే తమిళ సినిమాలను తెలుగులోకి తెచ్చేవారు.మాస్ ప్రేక్షకులకు పట్టే సినిమాలే ఎక్కువగా తీశారు.
రక్తసంబంధం, గుడిగంటలు, బందిపోటు, వీరాభిమన్యు, కర్పూరహారతి తదితర చిత్రాలు వీరి సారధ్యంలో రూపుదిద్దుకున్నాయి. తెలుగు తెర తొలి బాండ్ చిత్రం “గూఢచారి 116” కూడా డూండీ, నహతాల నిర్మాణ సారధ్యంలో వచ్చినదే. డెబ్బై దశకంలో నహతా కుమారుడు శ్రీకాంత్ నహతా శ్రీకాంత్ పిక్చర్స్ అంటూ కొత్త నిర్మాణ సంస్ధను ప్రారంభించారు. అదే సమయంలో డూండీ త్రిమూర్తీ ప్రొడక్షన్స్ తో కొనసాగారు.
ఇద్దరూ కృష్ణతోనే తీసేవారు. ఇద్దరి దర్శకుడూ కె.ఎస్.ఆర్ దాసే. ఏజంట్ గోపీ, రహస్య గూఢచారి, అందడు ఆగడు , గిరిజా కళ్యాణం తదితర చిత్రాలు శ్రీకాంత్ మూవీస్ బ్యానర్ లో రూపొందాయి. ఈ చిత్రాలన్నిటిలోనూ జయప్రదే హీరోయిన్. తదనంతరం జయప్రద వివాహం చేసుకున్నదీ శ్రీకాంత్ నహతానే.
శ్రీకాంత్ నహతా పేరు మీద శ్రీకాంత్ పిక్చర్స్ అనే ఓ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా నడిపారు. బెజవాడ హనుమంతరాయ గ్రంధాలయం వెనకాల వీళ్ల ఆఫీసుండేది.విచిత్రం గా సింగీతం శ్రీనివాసరావు డైరక్షన్ లో “అందమే ఆనందం” అనే సినిమా నహతా తీయడం. డూండీ సినిమాలకు నహతా సినిమాలకు సత్యం గారే సంగీతం అందించేవారు.’అందమే ఆనందం’ సినిమా లో ‘ఇదే ఇదే నేను కోరుకుంది’ పాట చాలామందికి ఇష్టమైన పాట.
ఇది కూడా చదవండి >>>>> ఎన్టీఆర్ చేత “యమగోల” చేయించింది ఈయనే !
అక్క మహాదేవి గుహలు, నహత గురించి విపజలంగా వివరించారు సంతోషం కంగ్రాట్స్