ఎవరీ సుందర్ లాల్ బహుగుణ ?

Sharing is Caring...

 Life is all about struggles………………………………………..

సుందర్ లాల్ బహుగుణ …. మన దేశపు తొలితరం పర్యావరణ వేత్తల్లో ఒకరు.జీవితమంతా ఉద్యమాలతో గడిపారు. చిన్నవయసులోనే ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 17 ఏళ్ళ ప్రాయంలో జైలుకెళ్లారు. గాంధేయ వాదిగా జీవితం కొనసాగించారు. అంటరానితనం … కుల వ్యవస్థపై కొన్నాళ్ళు పోరాడారు.

తర్వాత వలస రాజ్య పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1949 లో సామాజిక ఉద్యమకారులు మీరాబెన్,థక్కర్ బాపాలను కలసిన దరిమిలా ఆయన సామాజిక ఉద్యమకారుడిగా మారారు. 1960 ప్రాంతంలో ఆచార్య వినోబా భావే పిలుపు మేరకు ఏడు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. ఈ పాద యాత్రలోనే బహుగుణ పర్యావరణ సమస్యల గురించి తెలుసుకున్నారు.

చెట్ల నరికివేత ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణకు పూనుకున్నారు. అందులో భాగంగానే చిప్ కో ఉద్యమాన్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేశారు.చిప్కో అంటే కౌగిలింత. చెట్ల నరికివేతను ఆపడానికి చెట్లను కౌగలించుకుని మహిళలు అప్పట్లో అడ్డం పడేవారు. 70 వ దశకంలో ఇష్టానుసారంగా చెట్లను నరికే వారు.

అలకనంద నది సమీపంలో 2500 చెట్లను ప్రభుత్వమే వేలం వేసి కాంట్రాక్టర్లకు ఇచ్చేసింది. వాళ్ళు చెట్లు నరకడానికి రాగానే సమీప గ్రామాల ప్రజలు వచ్చి చెట్లను కౌగించుకునే వారు. కొట్టినా .. తిట్టినా చెట్లను వదిలేవారు కాదు. దీంతో కూలీలు ఏమి చేయలేక వెనక్కి వెళ్లే వారు ఇలా రోజుల తరబడి ఉద్యమం సాగింది. గౌరీ దేవి,సుధేష్ దేవి, బచ్నిదేవి అనే ముగ్గురు మహిళలు ఈ ఉద్యమాన్ని నడిపారు.

బహుగుణ గ్రామాల్లో తిరిగి చెట్ల నరికి వేత వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేవారు. వాస్తవానికి చిప్కో ఉద్యమ రూపకర్త బహుగుణ కాదు. అంతకు ముందే బిష్ణోయ్ గిరిజన తెగల వారు ఆ ఉద్యమాన్ని నడిపారు. బహుగుణ ఇక్కడ ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ఈ ఉద్యమానికి ప్రచారం కల్పించారు.

ఒక దశలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ని కలసి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవసరం గురించి వివరించారు. దాంతో ఇందిర హిమాలయ ప్రాంతంలో 15 ఏళ్లపాటు చెట్ల నరికివేతను నిషేధించారు.  ప్రజలకు పర్యావరణ ప్రాధాన్యతను వివరిస్తూ 1973 లో 120 రోజులపాటు 1400 కిమీ పాదయాత్ర చేశారు. మళ్ళీ 1975 లో 2800 కిమీ మేర నడిచారు.

1981 -83 మధ్య కాశ్మీర్ నుంచి కోహిమా వరకు 3870 కిమీ పాదయాత్ర చేశారు. ప్రతి పాదయాత్ర లక్ష్యం పర్యావరణ పరిరక్షణే . అలా బహుగుణ చిప్కో ఉద్యమ మార్గదర్శిగా చరిత్రకెక్కారు. మనదేశం లో సాగిన ఈ ఉద్యమం 108 దేశాల్లో పర్యావరణ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది. అదో గొప్పవిషయం.

అలాగే తెహ్రి డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 84 రోజులు నిరాహార దీక్ష చేశారు. తెహ్రీ ప్రాజెక్టు కారణంగా వందలమంది నిర్వాసితులయ్యారు. అందులో బహుగుణ కుటుంబం కూడా ఉంది. తెహ్రీ రాజకుటుంబానికి వ్యతిరేకంగా దీక్షలు చేయడంతో బహుగుణను అరెస్ట్ చేసి కొన్నాళ్ళు జైల్లో పెట్టారు.

హిమాలయాల్లో లగ్జరి టూరిజాన్ని బహుగుణ గట్టిగా వ్యతిరేకించారు. అక్కడ హోటళ్లు నిర్మిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ప్రభుత్వంతో పోరాడారు.1995 లో 45 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టారు. పర్యావరణంపై డ్యామ్ ప్రభావం చూపుతుందో లేదో తెలుసుకునేందుకు కమిటీ వేస్తామని అప్పటి ప్రధాని పీవీ హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు.

కానీ డ్యామ్ నిర్మాణం తర్వాత రోజుల్లో మొదలయింది. దీన్ని అడ్డుకోవడం కోసం  ఢిల్లీ లో కూడా 74 రోజుల దీక్ష చేశారు. 2001 లో డ్యామ్ పనులు మళ్ళీ పనులు ప్రారంభమైనాయి. బహుగుణ ఎంత ప్రయత్నించినా డ్యామ్ నిర్మాణం ఆగలేదు.

పర్యావరణ పరిరక్షణకోసం ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం 1981 లో పద్మశ్రీ ,, 2009 లో పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించింది. వీటితో పాటు మరెన్నో పురస్కారాలు ఆయనకు లభించాయి. పద్మశ్రీ అవార్డు ను స్వీకరించేందుకు బహుగుణ తిరస్కరించారు. 94 ఏళ్ళ వయసులో బహుగుణ కరోనా కారణంగా 2021 మే 21 న  కన్నుమూశారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!