Taadi Prakash ……………………………………….
Chaduvu… అరచేతిలో సరస్వతి
…………………………………………
చలం నుంచి చేతన్ భగత్ దాకా… కన్యాశుల్కం నుంచి కొండపొలం దాకా…
మైదానం నుంచి మనోధర్మపరాగం వరకూ… ఎంత బాగా అన్నారో కదా!
కేచీగా వున్న ఈ లిటరరీ స్లోగన్‌తో తొలి తెలుగు E book Platform వస్తోంది. CHADUVU అని క్లిక్ చేస్తే చాలు, మీ కంప్యూటర్, సెల్‌ఫోన్ తెర మీద పుస్తకాల కవర్ పేజీలు మిలమిలా మెరుస్తాయి. ఆ తెరవెనక కనిపించకుండా వుండే చొరవ పేరే వెంకట్ శిద్దారెడ్డి.
ఈ బుక్ రీడింగ్ యాప్ మొదట వంద పుస్తకాలతో మన ముందుకు వస్తోంది. మరో నాలుగొందల పుస్తకాలను సిద్ధం చేస్తోంది. ఇది తెలుగు పుస్తకాలకు తొలి డిజిటల్ విప్లవం. ఒక కథనో, నవలనో పోస్ట్ చేయగానే అది క్షణాల్లో కొన్ని లక్షలమందికి చేరిపోతుంది.
హైదరాబాద్‌లో ‘ఆన్వీక్షికి’ అనే పుస్తక ప్రచురణ సంస్థని ముందుండి నడిపిస్తున్న వాడు శిద్దారెడ్డి. ఇప్పటికే వంద పుస్తకాలు తెచ్చిన వుత్సాహంతో వున్నాడు.శిద్దారెడ్డి ప్రపంచ సాహిత్యాన్ని గట్టిగా చదువుకున్నవాడు.పగలనక రాత్రనక ప్రపంచసినిమాని చూసినవాడు. అధ్యయనం చేసినవాడు.
2018-19 లో పబ్లిష్ అయిన ‘సినిమాకథలు’, ‘సినిమా ఒక అల్కెమీ’ పుస్తకాలు శిద్ధారెడ్డికి పేరు తెచ్చాయి. కథాసంపుటి ‘సోల్ సర్కస్’ చదివి, ‘ఏం రాశాడు గురూ’ అని సాహిత్య ప్రియులు మెచ్చుకున్నారు.
అసలెవరీ శిద్దారెడ్డి? హైదరాబాద్ ఎందుకొచ్చాడు? అనేదొక ఇంటరెస్టింగ్ స్టోరీ! ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఓ కుగ్రామం గుడిపాడు అతని స్వగ్రామం. కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువు. హైద్రాబాద్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్. లండన్‌లో ఏడేళ్ళు సాఫ్ట్‌వేర్ వుద్యోగం. సుఖప్రదమైన బతుకు. అయినా సరే సినిమా తియ్యాలి. కుంభస్ఠలాన్ని కొట్టి మనమేంటో చూపించాలి… అనుకుంటూ రెండు జేబుల్ల్లో కలల్ని పెట్టుకుని హైద్రాబాద్‌లో బస్సు దిగే వందలమందిలాగే అతనూ వచ్చాడు.
మనందరిలాగే మహా దర్శకుడు సత్యజిత్ రాయ్‌ని ప్రేమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సత్యజిత్ రాయ్ ‘Our films, Their films’ పుస్తకాన్ని అనువాదం చేయించాడు. దానిపేరు ‘సినిమాలు – మనవీ, వాళ్ళవీ’… పబ్లిష్ చేశాడు. కట్ చేస్తే, ఇంట్లో రెండువేల పుస్తకాలు పడున్నాయి. కవర్‌పేజీ మీద సత్యజిత్ రాయ్ దిగులుగా చూస్తున్నాడు. వీటిని అమ్మడం ఎలా? ‘విశాలాంధ్ర’ వాళ్ళకి ఫోన్ చేసి నేనో ఘనకార్యం చేశానని చెప్పాడు శిద్దారెడ్డి.
“ఏడిశావ్‌లే, పాతిక పుస్తకాలు పంపించు” అన్నారు విశాలాంధ్ర వ్యాపార నిపుణులు! గుండె చెరువయింది.
సత్యజిత్ రే పేరు కూడా తెలీని అమ్మకందార్లందరికీ తలో వంద పుస్తకాలు యిచ్చాడు. ఆనందంగా అమ్ముకున్నారు. ఎవ్వరూ డబ్బులు తిరిగి యిచ్చిన పాపాన పోలేదు. ఇది 2011 నాటి తొలి అట్టర్ ఫ్లాఫ్ స్టోరీ!
………
‘నవతరంగం’ వెబ్‌సైట్ నడిపిస్తూ, నమస్తే తెలంగాణా దినపత్రికకి వారం వారం సినీ వ్యాసాలు రాసుకున్నాడు. వాటి పేరు ‘సినిమా ఒక ఆల్కెమీ’. ఏడాదిన్నర రాసిన వ్యాసాలన్నీ కలిపి పుస్తకం వేసుకున్నాడు శిద్దారెడ్డి. స్టార్ హోటల్ మారియట్‌లో సభ. సినీ హీరో రాణా వచ్చాడు. సభ సూపర్ హిట్టయింది. వారం రోజుల్లో వెయ్యి పుస్తకాలూ అమ్ముడైపోయాయి. అది 2014లో.
తర్వాతెప్పుడో 2018లో కారు డ్రైవ్ చేస్తూ, తోచక సిగిరెట్ వెలిగిస్తే… ఒక ఐడియా పలకరించింది. వందన బండారు, సత్యదేవ్ అనే దంపతులని కలసి “నాకో 25 లక్షలు యిస్తే 25 మంచి పుస్తకాలు తేగలను” అన్నాడు శిద్దారెడ్డి. “అదేమంత భాగ్యం, పని మొదలుపెట్టు” అన్నారా పుణ్యదంపతులు.
ఎవ్వరికీ నోరు తిరగని, అర్థం కాని ‘ఆన్వీక్షికి’ అనే పేరు పెట్టి ఇది మా పబ్లిషింగ్ హౌజ్ అన్నాడు శిద్దారెడ్డి. మరికొంచెం డబ్బు పెట్టే బాలరెడ్డినీ, రచయితా ఆర్టిస్టూ మహీ బెజవాడనీ, సంజయ్‌నీ వెంట బెట్టుకున్నాడు. తంటాలు పడి కోవిడ్ కష్టాలు గట్టెక్కాడు. మూడేళ్ళలోపులోనే ఏకంగా వంద పుస్తకాలు అచ్చువేశాడు…అందంగా, అర్థవంతంగా, పాఠకుల్ని ఇట్టే ఆకట్టుకునేలా…
………
కాలం సూపర్ సానిక్ స్పీడుతో పరిగెడుతోంది. టెక్నలాజికల్ రివల్యూషన్ లోకాన్ని తలకిందులు చేస్తోంది. సృజనాత్మకంగా వుండాలి. డిజిటలాత్మకంగా పాఠకుల్ని చేరాలి. పుస్తక పఠనం అనేది అరచేతిలో వికసించే ఒక అనుభవంగా మారాలి అనుకున్నాడు శిద్దారెడ్డి.
ఇది కొత్త ఆలోచన. దీన్ని పదిమందికీ తెలియజెప్పాలి. పబ్లిసిటీ అనే ఆయుధ ప్రయోగం జరగాలి.
దానికో మార్గం కనిపెట్టాడు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు సుకుమార్ని కలిశాడు. నేను పుష్ప-2 లో నిండా మునిగి వున్నప్పటికీ పద, నీతోనూ వుంటానన్నాడు సహృదయ సుకుమార్.
ఇప్పుడు ‘చదువు’ బ్రాండ్ అంబాసిడర్ సుకుమార్. ఇకనుంచి సుకుమార్, శిద్దారెడ్డి పార్ట్‌నర్. తొలి విడతగా వంద డిజిటల్ పుస్తకాలతో వస్తున్నారు వీళ్ళిద్దరూ. ఇంకా అనూఫాంట్‌నే, పేజ్‌మేకర్నే పట్టుకు వేలాడుతూ తుప్పుపట్టిన పాత టెక్నాలజీతోనే వుండడం దరిద్రం అంటూ, డిజిటల్ పుస్తకాలతో సిద్ధం అవుతూ రీడింగ్ మేడీజీ చేస్తున్నాడు శిద్దారెడ్డి.
సెల్‌ఫోన్‌లో పుస్తకం చదువుతున్నప్పుడు, కావాలంటే ఫాంట్ పెద్దవి చేసుకోవచ్చు. రాత్రి వేళ క్లియర్‌గా చదువుకోడానికో సౌకర్యం. ఆడియోబుక్స్ కూడా తయారవుతున్నాయి. ఒక కథో, నవలో వింటూ లాంగ్‌డ్రైవ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఓ గొప్ప రచయితతో కలసి మార్నింగ్ వాక్ చేయొచ్చు.
కమర్షియల్ సక్సెస్ కోసం యుద్ధనపూడి సులోచనరాణీ, యండమూరి వీరేంద్రనాధ్ రాసిన పాతకాలం హిట్ పుస్తకాలని కూడా డిజిటలైజ్ చేస్తున్నాడు. వాళ్ళకి న్యాయమైన మొత్తంలో డబ్బు యిస్తున్నాడు.
‘చదువు’ కి ఎంత పే చెయ్యాలి? నెలకి 99 రూపాయిలు కట్టాలి. లేదా ఏడాదికి 299 రూపాయిలు పే చేసినా చాలు. ఎన్ని పుస్తకాలయినా చదువుకోవచ్చు. “ఇది పెద్ద వ్యాపారం ఏమీ కాదు. డబ్బులొచ్చి పడిపోవు. అసలిందులో డబ్బులే లేవు”.
మేం దీన్నొక సోషల్ ఎక్స్‌పెరిమెంట్ అనుకుంటున్నాం. ఇదేదో పెద్ద సాహిత్య సేవనీ మేం అనుకోవడం లేదు. ఆమాటకొస్తే ఎవరూ సాహిత్య సేవ చేయరు. లాభాలే చూసుకుంటారు. సముద్రంలో ఉచ్చపోసి నీటిమట్టం ఎంత పెరిగిందో చూసుకునే వెర్రివెంగళప్పలం అయితే మేం కాదు” అంటున్నాడు వెంకట్ శిద్దారెడ్డి.
“శ్రీరంగం రాజేశ్వరరావు ‘ఎర్రచీర’ కథలు మరుగున పడి వున్నాయి. ‘ఊబిలో దున్న’ ప్రింట్‌లో లేదు. ‘అసమర్థుని జీవ యాత్ర’ వాస్తవానికి Dark Comedy. బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం – పారిస్ పాప, ‘ఎదురు చూసిన ముహూర్తం’ కథలు ఎవరికీ గుర్తు లేవు. ఇవన్నీ డిజిటల్లో తెస్తున్నాం.” అని చెబుతున్నాడు. ఫిజికల్‌బుక్‌కీ, డిజిటల్ పుస్తకానికీ పోటీ లేదు. దేని మార్కెట్ దానిదే.
నిజానికి చదివే వాళ్ళు పెరుగుతున్నారు.పాత సెకండ్ హాండ్ ఫుట్‌పాత్ పుస్తకాల అబిడ్స్, నాంపల్లి మరుగున పడిపోతున్నాయి. బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చీబౌలిల్లో కొత్త, పెద్ద మోడర్న్ బుక్ షాపులు రాబోతున్నాయి.
“ప్రపంచమంతా పుస్తకానికి ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. Ease and reach పెరుగుతోంది. మార్కెట్ విస్తరిస్తోంది. మా పదేళ్ళ పోరాటం ఫలించిందనే అనుకుంటున్నా“ ఇది శిద్దారెడ్డి నమ్మకం.
I have always imagined that Paradise will be a kind of Library అన్న ఒక తత్వవేత్త మాటని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాడు. ‘పెంగ్విన్’ ప్రచురించిన భరద్వాజ రంగన్ సంభాషణ: ‘CONVERSATIONS WITH MANIRATNAM’ అనువాదం చేస్తున్నాడు. అరిపిరాల సత్యప్రసాద్ రాసిన ‘ప్రపంచ సినిమా చరిత్ర’ అనే 750 పేజీల గ్రంథాన్ని ఆన్వీక్షికి వందో ప్రచురణగా జనవరిలో తెస్తున్నాడు.
శివసాగర్ కవిత్వం, అజంతా స్వప్నలిపి, అంటరానివనంతం, కాశీభట్ల నవలల్ని అందంగా ముద్రించాడు. సాహిత్య అకాడెమీ అవార్డ్ గెలిచిన మధురాంతకం నరేంద్ర మనోధర్మపరాగం శిద్దారెడ్డి వేసిందే!
రెండు షాకింగ్ కథలు:
ఒక పెద్ద కొండ బరువెంత వుంటుందో తెలుసుకోవాలనుకుంటాడు ఒకడు. అది అతను మోస్తున్న సైకలాజికల్ బర్డెన్! 2018లో వెంకట్ శిద్ధారెడ్డి రాసిన ఈ కథ పేరు ‘ఒజామా హిమాషు’. గుండెల మీద ఆ మోయలేని భారం ఏమిటో తెలియాలంటే ఆ కథ చదవాలి. మరోకథ ‘రిసరెక్షన్’ ఉగాది కథల పోటీలో 50వేల రూపాయిల బహుమతి పొందింది. వివక్ష ఎక్కడుంది? అంటూనే వుంటాం. పాటిస్తూనే వుంటాం. ఈ కథ చదివితే గుండె లోపలిపొరల్లో రోహిత్ వేముల మెదుల్తాడు.
ఇలా… గుర్తుండి పోయే కథలు రాశాడు శిద్దారెడ్డి. ప్రపంచ సినిమాని మనకోసం కథలు కథలుగా రాసి వుంచాడు. చాలవన్నట్టు పుస్తక ప్రచురణ అనే కార్యభారాన్ని తలకెత్తుకున్నాడు. ఐనా ఒక UNREST ఏదో అతన్ని కుదురుగా వుండనివ్వడం లేదు. అలనాటి పాత ప్రియురాలు వెండితెర వెనక నించి పిలుస్తున్న పిలుపేదో శిద్దారెడ్డి హృదయాన్ని రంజనీ రాగంలా చుట్టుకుంటోంది.
ఇప్పుడొక సినిమా తీసే వూపులో వున్నాడు. కలవరపెట్టే ఒక వెబ్‌సిరీస్ చేసే కైపుతో వూగుతున్నాడు.
మార్మిక కలల కథకుడు మహీ బెజవాడ నాతో వున్నాడనే నమ్మకంతో కొండని భుజానికెత్తుకునే సాహసం చేస్తున్నాడు.