ఎవరీ రిచర్డ్ అటెన్‌బరో ?

Sharing is Caring...

Famous director……………………

రిచర్డ్ అటెన్‌బరో అత్యంత ప్రతిభావంతులైన బ్రిటిష్ దర్శకుల్లో ఒకరు. తొలుత ఆయన నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో జన్మించిన రిచర్డ్ … ఫ్రెడరిక్ అటెన్‌బరో పెద్ద కుమారుడు.

కేంబ్రిడ్జ్‌లోని ఇమ్మాన్యుయేల్ కాలేజీ లో చదువుకున్నారు. రిచర్డ్ కి చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి ఉండేది.  రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (RADA) లో థియేటర్ స్టడీస్ కోర్సు అభ్యసించాడు.

అటెన్‌బరో తన కెరీర్ ప్రారంభంలో నాటకాల్లో ఎక్కువగా నటించాడు. లండన్ వెస్ట్ ఎండ్ ప్రొడక్షన్‌ అగాథ క్రిస్టీ మర్డర్ మిస్టరీ నాటకం ‘ది మౌస్‌ట్రాప్‌’ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 1942 లో సినిమారంగంలోకి ప్రవేశించాడు. 

మొదటిసారి ‘ఇన్ విచ్ వియ్ సర్వ్’ చిత్రం లో నటించాడు. ఆ చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉండదు. ఆ తర్వాత లండన్ బిలాంగ్స్ టు మీ, మార్నింగ్ డిపార్చర్, బ్రైటన్ రాక్ తదితర చిత్రాల ద్వారా నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

గ్రాహం గ్రీన్ నవల ఆధారంగా తీసిన బ్రైటన్ రాక్ చిత్రంలో పింకీ బ్రౌన్ పాత్ర  రిచర్డ్ కి  మంచి పేరు .. పరిశ్రమలో గుర్తింపు తెచ్చిపెట్టింది.పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఎన్నో ఆఫర్స్ వచ్చేయి. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడ్డాడు. విజయం సాధించాడు.

ఐ యామ్ ఆల్ రైట్ జాక్ (1959) వంటి అనేక హాస్య చిత్రాలలో కూడా నటించాడు. 1963 లో ది గ్రేట్ ఎస్కేప్ అనే సినిమా లో స్క్వాడ్రన్ లీడర్ రోజర్ బార్ట్‌లెట్‌గా చేసాడు.ఇది బ్లాక్ బస్టర్ హిట్.

దర్శక, నిర్మాత బ్రయాన్ ఫోర్బ్స్‌తో కలిసి ఓ నిర్మాణ సంస్థ ఆరంభించి, ‘లీగ్ ఆఫ్ జెంటిల్‌మేన్’, ‘ది యాంగ్రీ సెలైన్స్’, ‘విజిల్ డౌన్ ది విండ్’ తదితర చిత్రాలు నిర్మించారు. నిర్మాతగా విజయవంతంగా కొనసాగుతున్న సమయంలోనే దర్శకునిగా మారారు రిచర్డ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఓ! వాట్ ఎ లవ్లీ వార్’ఘన విజయం సాధించింది.

ఆ తర్వాత దర్శక, నిర్మాతగా బిజీ అవడంతో సినిమాల్లో నటించడం  తగ్గించేశారు. 1982 లోమహాత్మా గాంధీ జీవితాన్ని సెల్యులాయిడ్‌పై అద్భుతంగా చిత్రీకరించారు.ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ సినిమా కోసం ఇరవై ఏళ్ళు కష్ట పడ్డారు. నెహ్రు .. ఇందిరా గాంధీ తదితర ప్రముఖులతో చర్చించారు. కొన్ని అవాంతరాలు ఎదురైనాయి.  

1980 నవంబర్ లో షూటింగ్ మొదలు పెట్టి 1981 మే నాటికి ముగించారు. 82 నవంబర్ లో గాంధీ చిత్రం విడుదల అయింది. రిచర్డ్ ఊహించని స్థాయిలో సినిమా విజయవంతమైంది. ఎనిమిది ఆస్కార్‌లతో పాటు మరెన్నో అవార్డులు .. రివార్డులు సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం తో రిచర్డ్ ను సత్కరించింది.

గాంధీ సినిమా  తర్వాత రిచర్డ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘చాప్లిన్’ ఒకటి. చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా ఆయన ఈ చిత్రం తీశారు. దర్శక, నిర్మాతగా కొనసాగుతూనే  ‘జురాసిక్ పార్క్’లో  జాన్ హమ్మొండ్ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

కాగా రిచర్డ్ నటించిన చివరి చిత్రం ‘పకూన్’ 2002లో విడుదలైంది. దర్శక, నిర్మాతగా ‘క్లోజింగ్ ది రింగ్’ చివరి చిత్రం. 2007లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత అటెన్‌బరో సినిమాలకు దూరంగా ఉన్నారు.2014 లో అనారోగ్యం పాలయ్యారు. ఆగస్టు 29 న ఆయన జన్మదినం.. 90 నిండి 91 లోకి ప్రవేశిస్తారు. అయితే నాలుగు రోజుల ముందే ఆయన కన్నుమూశారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!