Govardhan Gande …………………………………………….
“రామప్ప” గుడి కి హెరిటేజ్ వారసత్వ గుర్తింపు రావడం … అది తమ గొప్పేనని విచిత్రంగా రెండు రాజకీయ పార్టీలు వాదించుకుంటున్నాయి. ఎప్పుడో, 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో శిల్పి రామప్ప 40 ఏళ్ళ పాటు ఎంతో మేధో శ్రమతో, వందలాది మంది సహచర శిల్పుల సహకారంతో,వేలాది మంది కార్మికుల శ్రమతో గుడి ని అద్భుతంగా నిర్మించారు. ఆ గుడి విశిష్టతను యునెస్కో గుర్తించిన తెలిసిందే కదా.
దాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చిన సంగతి కూడా తెలుసును కదా. దాని కా క్రెడిట్ తమదేనని తమ వల్లే వచ్చిందని కేంద్రంలో… రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు పోటీలు పడి చెప్పుకోవడం కడు వింతగా కనిపిస్తున్నది. అంటే ఆ నిర్మాణానికి ఆ అర్హతలు లేవా? అర్హతలు లేని నిర్మాణానికి గుర్తింపు లభించినట్లు భావించాలా? లేక అడ్డదారిలో సిఫారసు ద్వారా గుర్తింపు లభించింది అని అనుకోవాలా? ఏమిటి?
ఇలా అర్హతలు లేని నిర్మాణాలకు యునెస్కో గుర్తింపు నివ్వడం ఎప్పుడు మొదలెట్టింది? యునెస్కో ఇలాంటి సిఫారసు వ్యవహారాలకు లొంగిపోయి ఉండి ఉంటే ఆ గుర్తింపునకు ఏ మాత్రం విలువ ఉండేది? దానికి ఇంత ప్రచారమూ లభించి ఉండేదా? ఈ నిర్మాణ వైశిష్ట్యాన్ని గుర్తించడంలో అలసత్వమూ ఉన్న మాట నిజం.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యమూ ఉన్నదన్నదీ అందరికీ తెలుసు. అందుకే గుర్తింపులో ఆలస్యం జరిగింది. అంత మాత్రాన రామప్ప గుడి విశిష్టత మాయమవుతుందా ఏమిటి? ఇప్పుడు దాని ప్రాశస్త్యం మొత్తం ప్రపంచానికి తెలియజెప్పే ఓ అవకాశం కలిగింది.ప్రపంచ పర్యాటకులకు శిల్పి రామప్ప గొప్పతనం తెలిసే అవకాశం కొత్తగా ఏర్పడింది. ఇదంతా పక్కన బెట్టి ఈ గొప్ప అంతా తమది అంటే కాదు తమదేనని వాదులాడుకోవడం చూస్తుంటే … శిల్పి రామప్ప ఎవరు ? గణపతి దేవుడు ఎవరు? అనే ప్రశ్న తలెత్తుంది కదా. వారు జీవించి ఉంటే ఏమి చేసే వారో ?? ఇంకా నయం ఈ రామప్ప మనోడా ? కాదా అన్న వాదన కు తెర లేపలేదు. గూగుల్ లో శోధన మొదలు కాలేదు.