Sheik Sadiq Ali
జైనంలో మొత్తం 24 మంది తీర్దంకరులు ఉన్నారు. అందులో 23 వ వాడు పార్శ్వనాధుడు. 24 వ తీర్దంకరుడు మహావీరుడు.22 వ తీర్దంకరుడు నేమినాధుడు.తీర్ధంకర పరంపరలో మొదటి 22 మందికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు లేవు. కేవలం జైన గ్రంధాల్లో వారికి సంబంధించిన గాధలు ఉంటాయి.
అవి హిందూ పురాణ గాధలను పోలి వుంటాయి. కానీ, పార్శ్వనాధుడు,మహావీరులకు మాత్రమే సంబంధించిన చారిత్రిక ఆధారాలు శాసనాల రూపంలో లభించాయి. నేమి నాధుడి తర్వాత 84 వేల సంవత్సరాల అనంతరం వచ్చిన తీర్దంకరుడు పార్శ్వనాధుడు అని క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో భద్రబాహు రాసిన సుప్రసిద్ధ జైన గ్రంధం ‘కల్పసూత్రం’ లో వివరించి వుంది. పార్శ్వనాధుడు జైనమతం అభివృద్ధికి కృషి చేశారు .
క్రీస్తుపూర్వం 872 వ సంవత్సరం పుష్యమాసం బహుళ పక్షం దశమి నాడు ఆయన జన్మించాడు. ఇక్ష్వాకు వంశీయుడైన కాశీరాజు అశ్వసేనుడు,వామాదేవి దంపతులు అతని తలిదండ్రులు.30 ఏళ్ళ ప్రాయం వరకు రాజరిక జీవితమే గడిపాడు.30 వ ఏట సన్యాసాన్ని స్వీకరించాడు. కాయత్సర్గ యోగ భంగిమలో 84 రోజులపాటు ధ్యానం చేసి ‘కేవల జ్ఞానం’ సంపాదించాడు.
ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రం గిరిద్ జిల్లా ప్రశాంత్ పర్వత శిఖరంపై ధ్యానం చేస్తూ తన నూరవ ఏట క్రీస్తు పూర్వం 772 వ సంవత్సరంలో మోక్షం పొందాడు. ఆయన స్మృతి చిహ్నంగా ఆ ప్రదేశంలో ‘శిఖర్ జీ జైన్ మందిర్’ ఉంది. అదిప్పుడు జైనులకు అత్యంత ముఖ్యమైన తీర్ధ యాత్రా స్థలం అయింది.
కల్పసూత్రలో చెప్పిన దాని ప్రకారం అప్పట్లో పార్శ్వనాదుడికి లక్షా 64 వేలమంది శ్రావకులు (పురుష అనుచరులు),మూడు లక్షల 27 వేలమంది శ్రావికలు (స్త్రీ అనుచరులు),16 వేలమంది సాధులు (భిక్షులు),38 వేలమంది సాధ్వీలు (సన్యాసినులు) వుండేవారు.ఎనిమిది మంది ముఖ్య భిక్షువులు (శుభదత్త,ఆర్యఘోష,వశిష్ట,బ్రహ్మచారి,సోమ,శ్రీధర,వీరభద్ర,యశస్) వుండేవారు.
పార్శ్వనాదుడి తదనంతరం శుభదత్తుడు, అతని తర్వాత హరిదత్త,ఆర్యసముద్ర,కేసి జైనాన్ని ముందుకు తీసుకు వెళ్ళారు. పార్శ్వనాదుడి శిష్యులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి జైనమతానికి విస్తృత ప్రచారం కల్పించారు.అలా ఒక బృందం దక్షిణాదిలోకి ప్రవేశించింది. ఆ ప్రకారంగా తెలంగాణా లోని కొలనుపాక,జనగాం,వరంగల్ ప్రాంతాలకు చేరిన జైనం వందల ఏళ్ళపాటు ఈ నేల మీద విలసిల్లింది.రాష్ట్రకూటులు,చాళుక్యులు,తొలితరం కాకతీయులు జైనాన్ని ఆదరించి అనుసరించారు.
హనుమకొండలోని అగ్గులయ్య గుట్ట,పద్మాక్షి గుట్ట,సిద్ధుల గుట్ట తో పాటు వరంగల్ కోట,కాజీపేట గుహల్లో కూడా ఈనాటికీ అనేక జైన ఆనవాళ్ళు సజీవంగా ఉన్నాయి. ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే ఈ ప్రాంతాన్ని దేశంలోని ప్రముఖ జైన క్షేత్రాలలో ఒకటిగా అభివృద్ధి చేయొచ్చు. తద్వారా ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి చెయ్యొచ్చు.