Adventurous hero……………………………………….
ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన జపాన్‌కు చెందినవాడు.పేరు కెనెచీ హోరీ . వయసు 83 ఏళ్ళు. ఆ వయసులో కూడా ప్రపంచంలోని సాగరాల్లోనే అత్యంత పెద్దదైన పసిఫిక్ ను ఓ చిన్న పడవలో ఎవరి తోడు లేకుండా ఒంటరిగా దాటేసి..అందరిని అబ్బుర పరిచాడు. ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా చరిత్ర కూడా సృష్టించారు.
మార్చి నెలలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కేవలం ఆరు మీటర్లు పొడవుండే పడవలో బయల్దేరిన హోరీ .. 69 రోజుల పాటు.. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని.. 8,500 కిలోమీటర్లు ప్రయాణించి మూడు రోజుల క్రితమే జపాన్ లో పశ్చిమ తీరంలోని కీ జలసంధికి చేరుకున్నారు.
మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించలేదు. హోరు గాలితో తుపాను వచ్చింది. అయినా చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగాడు. షెడ్యూల్ కంటే ముందుగా ఏప్రిల్ మధ్యలో హవాయికి చేరుకున్నాడు.అక్కడ నుంచి ప్రయాణం బాగానే సాగింది. ఏదైనా సముద్రం మధ్యలో ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంతో ధైర్యం కావాలి.
ఇదే పసిఫిక్ మహా సముద్రాన్ని హోరీ … 1962లో అంటే 23 ఏళ్ల వయసులో దాటడం. అప్పుడు కూడా జపాన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఒంటరి సముద్రయానం చేశారు. ఆ సమయంలో ఆయన దగ్గర అమెరికా పాస్ పోర్ట్ కూడా లేదు. అక్రమంగా అడుగు పెట్టినా.. సూరి సాహసాన్ని తెలుసుకొని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రజలు ఘనంగా సన్మానించారు.
ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత.. అదే యాత్రను వ్యతిరేకదిశలో హోరీ ప్రయాణం చేసి రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో ఒంటరి ప్రయాణం చేసినపుడు చాలా ఆందోళన పడ్డాడట. ఈసారి తన దగ్గర ఉపగ్రహ ఫోన్ ఉంది. ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులతో మాట్లాడేవాడు. మెడికల్ కిట్ తీసుకువెళ్లి సమయానికి మందులు వేసుకునే వాడు.
ఈ జపాన్ సాగర వీరుడికి ఒంటరి యాత్రలు కొత్తేమీ కాదు. 1974లోనైతే సముద్రమార్గంలో ఏకంగా ప్రపంచాన్నే చుట్టి వచ్చారు.ఇలాంటి వాళ్ళే ఈనాటి యువతకు స్ఫూర్తి దాతలు.