Nirmal Akkaraju ……….
స్కిల్ స్కాం కేసులో ఇవాళ ఏపీ సీఐడీ తరపున వాదించిన ముకుల్ రోహిత్గి సుదీర్ఘం అనుభవం ఉన్న సుప్రీం కోర్టు లాయర్. మాజీ సీఎం తరపున సిద్ధార్ధ లూథ్రా ,హరీష్ సాల్వేలు రంగంలోకి దిగగా ముకుల్ రోహత్గి ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపించారు.
ఆయన గురించి తర్జని పాఠకుల కోసం ప్రత్యేకం గా
——————-
ముకుల్ రోహత్గీ పేరు చిత్రంగా ఉంది కదా. రోహత్గీ అనేది ఆయన ఇంటి పేరు. అపుడపుడు మనకు ఫలానా కేసులో రోహత్గీ వాదించారు అంటూ వార్తల్లో ఆయన పేరు కనిపిస్తుంటుంది.ఆయనే ఈ ఫొటోలో ఉన్నాయన. సుప్రీం కోర్టులో ఆయన సీనియర్ న్యాయవాదిగా చేస్తున్నారు. చిన్నా .. చితక కేసులను ముకుల్ టేకప్ చేయరు.
ఒకవిధంగా చెప్పాలంటే సామాన్యులు ఆయన దగ్గరికి పోనే పోరు. ఎందుకంటే ఆయన ఫీజు భారీస్థాయిలో ఉంటుంది కనుక. ఢిల్లీ లోని టాప్ మోస్ట్ 10 మంది లాయర్లలో ఈయన కూడా ఒకరు. ముకుల్ రోహత్గీ వాదించిన కేసులు కూడా పెద్దవే. అన్ని కూడా చారిత్రిక ప్రాధాన్యం .. సంచలనాత్మక కేసులే. ఎక్కువగా అలాంటి కేసులే ఆయనకు వస్తుంటాయి.
ముకుల్ రోహత్గీ వంటి లాయర్ ను పెట్టుకుంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా కొంత ఓపికగా వారి వాదనలు వింటారు. అందుకే ఆయనకు పెద్ద లాయర్ అన్న పేరుంది. ముకుల్ రోహత్గీ వంటి లాయర్లు ఆర్గ్యుమెంట్ చేపడితే ఇతర పెద్ద లాయర్లు కూడా కోర్టుకు హాజరై ఆయన వాదనలు వింటారు.
అయన చేపట్టిన కేసుల్లో లోయా జడ్జి కేసు, గుజరాత్ ఫేక్ ఎన్కౌంటర్, బెస్ట్ బేకరి, లక్ష్మీ విలాస్ బ్యాంక్, శివకుమార్,శశికళ మేనల్లుడు దినకరన్ కేసు, చందా కొచ్చర్ కేసు, జైట్లీ కేసు, ఆధార్ కేసు, మెడికల్ ఎగ్జామ్, భ్రూణ హత్యల కేసు, హైవే లిక్కర్ బ్యాన్ కేసు, బిసిసిఐ మ్యాచ్ హక్కుల కేసు, జల్లి కట్టు కేసు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కీలకమైన అంబానీ సోదరుల మధ్య గ్యాస్ వివాద కేసులోఅనిల్అంబానీ తరపున ఈయనే వాదించారు. 2 జి స్కామ్ విచారణలో పెద్ద సంస్థల తరపున ముకుల్ వాదనలు వినిపించారు.
ఎన్నో కేసులలో తనదైన శైలిలో వాదనలు వినిపించారు. విజయాలు సాధించారు. అఫ్ కోర్సు కొన్ని కేసుల్లో ఓడిపోయారు. ఆ మధ్య సుప్రీం లో ఏపీ ప్రభుత్వం తరపున పంచాయితీ కేసును కూడా ఆయనే వాదించారు. ఆయన కాబట్టి న్యాయమూర్తులు ఆ కాసేపైనా వాదనలు విన్నారు. అలాగే ఏపీ రాజధాని కేసు లో కూడా ప్రభుత్వం తరపున ఈయనే వాదిస్తున్నారు.
ఇక ఆయన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ….. ముకుల్ రోహత్గీ ముంబాయి ప్రభుత్వ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తరువాత, యోగేశ్ కుమార్ సభర్వాల్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ ప్రారంభించారు.ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వంలో ఐదేళ్లు లా ఆఫీసర్‌గా పనిచేసారు.2002 లో జరిగిన అల్లర్లు, నకిలీ ఎన్‌కౌంటర్ కేసులలో సుప్రీంకోర్టులోగుజరాత్ సర్కార్ తరపున వాదించారు.
ప్రధాని వాజపేయి ముకుల్ ను బాగా ప్రోత్సహించారు అంటారు. నరేంద్ర మోడీ అధికారంలో కొచ్చాక భారతదేశానికి 14 వ అటార్నీ జనరల్ గా పనిచేశారు. అంతకుముందు అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు. ముకుల్ తండ్రి జస్టిస్ అవధ్ బిహారీ రోహత్గి కూడా న్యాయవాదిగా , అటార్నీ జనరల్ గా .. హైకోర్టు న్యాయమూర్తి గా పనిచేశారు.
తండ్రి కున్న క్లయింట్ బేస్ ఈయనకు ఉపకరించింది. స్వల్ప కాలం లోనే తండ్రిని మించిన కొడుకుగా గుర్తింపు పొందారు. అన్నట్టు ముకుల్ రోహత్గీ ఏదైనా కేసులో మన తరపున వాదించాలంటే ఒక రోజుకి 5 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటారు. వామ్మో అంత ఫీజా అనకండి. అంతకంటే ఎక్కువ తీసుకునే వారుకూడా ఉన్నారు.