Bharadwaja Rangavajhala……………….
A great dancer………………
AVM సంస్థ వారు ఎన్టీఆర్ ను రావణుడుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రంలో ‘మున్నీట పవళించు నాగశయనా’ అంటూ ఓ నర్తన గీతం ఉంటుంది. దాన్ని షణ్ముఖ ప్రియలో స్వరపరచారు సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం గోవర్ధనం.
ఆ పాటకు నర్తించిన నర్తన తార పేరు ‘కమలా లక్ష్మణ్’. ఆ లక్ష్మణ్ ఎవరో కాదు. కామన్ మ్యాన్ కార్టూనుతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఆర్కే లక్ష్మణే. కమల లక్ష్మణ్ పెళ్లైతే చేసుకున్నారుగానీ ఎక్కువ రోజులు కలసిలేరు. పెళ్లయ్యాక డాన్సు చేయరాదనడంతో విడాకులు తీసుకున్నారు ఆవిడ. మొగుడూ మొగుడూ నాకు నీకంటే డాన్సే ముఖ్యం అని క్లారిఫై చేశారన్నమాట.

తదనంతరం ఆవిడ మరో వివాహము చేసుకుని జీవితాన్ని ముందుకు నడిపించారు. ఆయన పేరు టి.వి.లక్ష్మీనారాయణ. అలా ఆవిడ కమలా నారాయణగా కూడా కొందరికి తెల్సు.ఈ కమలానారాయణ అనే పేరు వల్ల కొందరు ఆవిడ వివాహమాడినది ఆర్కే నారాయణ్నేమో అనుకుని పొరపడేవారు. కొన్ని బ్లాగుల్లో సైతం అదే వ్రాసినారు. అదీ సంగతి ..
కమల తన కెరీర్‌లో దాదాపు 100 తమిళం , హిందీ , తెలుగు, కన్నడ చిత్రాలలో నటించారు.చిన్న వయస్సులోనే కమల బొంబాయిలోని లచ్చు మహారాజ్ వద్ద కథక్ నృత్య శైలిలో పాఠాలు నేర్చుకున్నారు.ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు.
క్వీన్ ఎలిజబెత్‌తో సహా భారతదేశాన్నిసందర్శించిన విదేశీ ప్రముఖుల ముందు కమల నాట్య ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. శాస్త్రీయ నృత్యాలకు ప్రత్యేకించి కమలనే సినిమాల్లో పెట్టుకునే వారు.ఆమెకు 1970లో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ భూషణ్ లభించింది.
ఆమె 1980లలో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లి, న్యూయార్క్‌లో “శ్రీ భరత కమలాలయ” అనే డ్యాన్స్ పాఠశాలను స్థాపించి అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. కమల లక్ష్మణ్ కొద్దీ రోజుల క్రితం కాలిఫోర్నియాలో మరణించారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు..
ఆ మధ్య డాక్టర్ రొంపిచర్ల భార్గవి గారు కలిగించిన జ్ఞానం యేమిటంటే ..ఆర్కే లక్ష్మణ్ రెండో భార్య పేరు కూడా కమలేనట. ఇక ‘మున్నీట పవళించు నాగశయనా’ పాట షణ్ముఖప్రియలోనే ఎందుకు ట్యూనారంటే … రిథమ్ ప్రధానంగా సాగే ఈ రాగం డాన్సులకు భలే ఉంటుందనే… ఈ శివుడికి సంబంధించిన స్త్రోత్రాలూ గట్రా అన్నీ కూడా అందులోనే ఉంటాయని చెప్తూంటారు కదా…
ఈ ‘మున్నీట పవళించు’ పాట ఎమ్మెల్ వసంతకుమారిగారు చాలా గొప్పగా పాడారు. ఈ చిత్రానికి కె.ఎన్. దండాయుధ పాణి పిళ్లై నృత్యదర్శకత్వం వహించారు. మన ‘సాగర సంగమం’లో కమల్ హసన్ నూతి డాన్సు గీతం ఉంటుంది కదా . ‘తకిత తథిమి తందాన’ అంటూ … అది కూడా షణ్ముఖప్రియలోనే ట్యూనినట్టు సమాచారం.
ఇవన్నీ కాదుగానీయండీ … ఈవిడ లైఫు సినిమా తీయొచ్చు కదా … ఎవురేనా? బయోపిక్కు లెక్కన…
మున్నీట పవళించు నాగశయనా పాట ఈ వీడియో లో చూడండి
https://www.youtube.com/watch?v=aoPVLmiQVpw
post up dated on dec 1 ..2025

