ఎవరీ విధ్వంసక సైనికాధిపతి ?

Sharing is Caring...

ఉక్రెయిన్ లోని మరియుపోల్ ఓడ రేవు పట్టణం లో రష్యా సైన్యం విధ్వంసం సృష్టించింది. నగరం దాదాపు పూర్తిగా నేలమట్టమైపోయింది.. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, శిథిల భవనాలు కనిపిస్తున్నాయి.

‘మరియు పోల్’ ను విధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్. పుతిన్ కి సన్నిహితుడు. నమ్మిన బంటు అంటారు. అతగాడు ఇపుడు చరిత్రలో మరియుపోల్ విధ్వంసకుడి’ గా నిలిచిపోయారు. ఇంతకూ ఎవరీ జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్ ?

59 ఏళ్ల కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్ రష్యన్ నేషనల్ సెంటర్ ఫర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సైన్యంలో అది చాలా పెద్ద హోదా. రష్యా సైనిక కార్యకలాపాలకు మార్గదర్శకత్వం చేయడానికి ఈ సంస్థను 2014లో ఏర్పాటు చేశారు. ఇది రష్యా సైనిక కార్యకలాపాలను ఈ సంస్థ కార్యాలయంలో ప్లాన్ చేస్తారు.

అక్కడ నుంచి ఆదేశాలు జారీ చేస్తుంటారు. 1962లో పుట్టిన మిఖాయిల్.. కీప్ లోని హైయ్యర్ కంబైన్డ్ ఆర్ట్స్ కమాండ్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత తూర్పు జర్మనీలో సోవియట్ నిఘా ప్లాటూన్ కమాండర్ గా పనిచేశాడు. సోవియట్ పతనం తర్వాత మోటరైజ్డ్ రైఫిల్ బెటాలియన్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 1990 తర్వాత మాస్కోకు బదిలీ అయ్యాడు.

ఆ తర్వాత సైన్యంలో తన సత్తా చాటుకుని పదోన్నతులు పొందాడు. 2003 నాటికి ఆపరేషన్స్ డైరెక్టరేట్ కి చీఫ్ గా నియమితులయ్యాడు.నేషనల్ సెంటర్ ఫర్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ అధిపతి హోదాలో మిఖాయిల్ 2015 సిరియా అంతర్యుద్ధంలో రష్యా సైన్యాన్ని సమన్వయపర్చాడు. 2015-16లో రష్యా వైమానిక దళం సిరియాలో భీకరమైన వైమానిక దాడులు జరిపింది. ఈ మారణ కాండలో  దాదాపు 1700 మంది పౌరులు మరణించారు.

సిరియా రాజధాని అలెప్పో నగరం శిథిలమై శ్మశానంలా మారిపోయింది. సిరియా యుద్ధంలోనే అవి అత్యంత భయంకరమైన రోజులని మానవహక్కుల సంస్థలు ఇప్పటికి చెబుతుంటాయి. ఇక సిరియా అనుభవంతో మిఖాయిల్ మరియు పోల్ పై దృష్టిపెట్టాడు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం రష్యాకు చాలా కీలకం. ఉక్రెయిన్‌కు అజోవ్ సముద్రంతో సంబంధాలు తెంచి వేస్తే.. క్రిమియా-డాన్ బాస్-రష్యా మధ్య భూకారిడార్ ఏర్పాటు చేయవచ్చు.

ఈ లక్ష్యంతోనే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలు, ఆసుపత్రులు, థియేటర్లు.. ఇలా ప్రతి ఒక్కదాన్ని రష్యా సైన్యం ధ్వంసం చేస్తున్నది. ఈ ప్రాంతమంతా శతఘ్నుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఇక్కడ ఆరు ఆసుపత్రుల్లో ఐదు ధ్వంసమైపోయాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక చమురు, విద్యుత్తు, ఆహార కొరతతో లక్షల సంఖ్యలో ప్రజలు వలసపోతున్నారు.

కనీసం 2,000 మంది మరియు పోల్ వాసులు మృతి చెందారు. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ విధ్వంసకాండ మొత్తం మిఖాయిల్ పర్యవేక్షణలోనే జరిగింది… జరుగుతోంది. గతంలో ఇక్కడ రష్యా అనుకూల వర్గాల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం .. కీలక ఓడరేవు ను దక్కించుకోవడం కోసం పుతిన్ అత్యంత కర్కశుడైన మిఖాయిల్ ను రంగంలోకి దించారు. మిఖాయిల్ కన్ను పడిందంటే ఆనగరం పూర్తిగా నేలమట్టం కావాల్సిందే. గతంలో మిఖాయిల్ చేసిన ప్రతి యుద్ధంలోనూ శత్రువుల వెన్నులో వణుకు పుట్టించాడు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!