ఎవరీ బీదర్ బొమ్మాళీ ??

Sharing is Caring...

అసుర సంధ్య వేళ. ఆకోటలో అడుగు పెట్టాం. కోటను చూడాలని నేను మిత్రులు సాదిక్,వేణు అక్కడికి వెళ్ళాం.అది బీదర్ కోట.విశాల ప్రదేశంలో కోట రెండు భాగాలుగా నిర్మించారు.ముందు వైపు కొత్త కోట.దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు.కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల భవనాలు. మొండిగోడలు ,కూలిన భవనపు శకలాలు…. చెల్లా చెదురుగా పడిఉన్నాయి.

కోట మొత్తం కలియ తిరిగాము.తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు మొదలవడంతో చెరసాల పై గట్టు దగ్గర కూర్చున్నాం. సాదిక్ కోట తాలూకు విశేషాలు వివరిస్తూ “ఇక్కడ దెయ్యాలు కూడా ఉన్నాయట” అన్నాడు.“నిజంగా? ” అన్నాడు వేణు ఆశ్చర్యబోతూ. నేనేమి మాట్లాడలేదు.“మనం కూర్చున్న చెరసాల గట్టు పై ఒట్టు ” అన్నాడు సాదిక్. “చెప్పు ..చెప్పు” అన్నాడు వేణు ఆసక్తిగా.

“రాజులు చెరబట్టిన ఎందరో స్త్రీలు ఇక్కడే ఉరేసుకుని చనిపోయారట.పాపం వారికి అంతిమ సంస్కారాలు కూడా సవ్యంగా జరగలేదట”నిట్టూరుస్తూ సాదిక్ చెబుతున్నాడు.సరిగ్గా అదే సమయంలో నా భుజంపై ఎవరో చేయి వేసి తాకిన అనుభూతి కలిగింది.వెనుదిరిగి చూస్తే ఎవరూ లేరు. చల్లగా గాలి వీస్తోంది…ఆ గాలి తెమ్మెర నా మొహానికి సోకింది.హాయిగా అనిపించింది. చుట్టూ చీకటి …టైం చూస్తే తొమ్మిది అవుతోంది.“వేణూ బయలు దేరుదామా ?”అన్నాను. అందరం లేచాం.

“అదిగో ఆ మూల కనిపించే కోట గోడ దాకా వెళదాం..అక్కడో విశేషం ఉంది” అంటూ ఆ వైపు అడుగు వేసాడు సాదిక్.
వేణు నేను సాదిక్ పక్క పక్కనే నడుస్తున్నాం.మమ్మల్ని ఎవరో అనుసరిస్తున్న భావన,కొన్ని అదృశ్య శక్తులు వెనుకే నడుస్తున్న శబ్దం.వెనక్కి తిరిగిచూస్తే ఎవరూ లేరు. ఆకాశంలో దశమి చంద్రుడి వెన్నెల మేఘాలు అడ్డుపడటంతో మాయమైంది.చిమ్మచీకటి అలుముకుంది. ఒక్కసారిగా నీరవ నిశ్శబ్దం ఆవరించింది. అంతలోనే ఆ నిశబ్దాన్ని చేదిస్తూ నా సెల్ ఫోన్ మోగింది. నేను ఆగి ఫోన్ మాట్లాడ సాగేను .ఈ లోగా వాళ్ళిద్దరూ ముందుకు వెళ్లి పోయారు. ఫోన్లో మాట్లాడం అయ్యాక…సిగరెట్ తాగుదామనిపించింది.

ప్యాంటు జేబులో చెయ్యి పెట్ట బోయాను. ఎవరో మణికట్టు ను గట్టిగా పట్టుకున్నట్టు చేయి ఆగిపోయింది. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు.అసలే ఇక్కడ దెయ్యాలున్నాయని సాదిక్ భయపెడుతున్నాడు.కొంపదీసి ..ఆ పట్టుకుంది దెయ్యం కాదుకదా. అనుకునే లోగానే ….చెయ్యి మొత్తం చల్లబడి పోయింది.

డీప్ ఫ్రిజ్ లోని ఐస్ గడ్డలు తెచ్చి చేతికి కట్టిన ఫీలింగ్. జిల్ జిల్లు మంటోంది చేయి….అంతలోనే …మూర్తీ ….మూర్తీ…….అంటూ పక్కనే ఎవరో నిలబడి పిలిచినట్టు అనిపించింది.ఆ గొంతు చాలా తీయగా ఉంది. అది అమ్మాయి గొంతు. అవును ..ఇక్కడ ఎవరూ లేరు కదా. ఆ పిలుపు ఎవరిది ?ఎక్కడిది? అమ్మో సాదిక్ చెప్పినట్టు . గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది.

“ఎందుకు అంత భయ పడుతున్నావు ?” మళ్ళీ అదే గొంతు.సందేహం లేదు ….ఇది ఖచ్చితంగా …దెయ్యమే. అంత చలిలోనూ చెమటలు పట్టాయి.వెనక్కి చూద్దామంటే ధైర్యం చాలలేదు. అంతలో నా కళ్ళముందు ఒక మెరుపు మెరిసినట్టు లీలగా ఒక రూపం ప్రత్యక్షమైంది.

ఇంకేముంది ….గుండె జారి పోయింది. అది దెయ్యమే.ఒంటిపై వెంట్రుకలు నిక్క బోడుచుకున్నాయి.భయంతో కళ్ళు మూతలు పడ్డాయి.ఇందాకటివరకు చేయి ఒకటే చల్ల బడింది..ఇపుడు ఒళ్లంతా చల్లబడి వణకడం మొదలైంది.

“మూర్తీ ..ఎందు కంత భయపడుతున్నావ్?”ఆ దెయ్యం అడిగింది.దెయ్యాలు కనబడితే భయపడక నవ్వుతారా…తల్లీ అనుకుని “ను ….ను …వ్వెవరు?” కొంచెం ధైర్యం తెచ్చుకుని,తిన్నగా కళ్ళు తెరిచి అడిగాను. “నేను రజియా ను” …అంది ఎదురుగా ఉన్న ఆ అస్పష్ట రూపం. “నువ్వెవరో నాకు తెలీదు” టక్కుమని అనేసాను భయపడుతూనే .

“నిజమే …నేను నీకు తెలీదు కదా…కానీ నువ్ నాకు బాగా తెలుసు.”అంది జవాబుగా. ‘నేనెలా తెలుసు ?’ “నువ్ …జర్నలిస్ట్ గా పనిచేస్తున్నావ్.. మీది ఒంగోలు …అవునా! కాదా?? “ఓ యమ్మో ఇది మాములూ దెయ్యం కాదురా బాబోయ్.అన్ని చెప్పేస్తుంది. “నాకు అన్నీ తెలుసు…గత జన్మ లో మనం ఒకర్ని ఒకరం ఇష్ట పడ్డాం” ఓర్నాయనో …ఇదేంటి ఏదేదో చెబుతోంది. కాదంటే ఏమంటుందో ఏమో అనుకుని “అలాగా “అన్నాను. 

“అపుడు నిన్ను మిస్ అయ్యాను…ఇపుడు దొరికావ్?”బాబోయ్ దొరికావుగా అంటోంది దోరగా వేయించుకు తింటుందేమో ??
“ఒక్క సారి కళ్ళు పూర్తిగా తెరచి నన్ను చూడు….నేనెవరో నీకు తెలుస్తుంది ” అందా రజియా. మాటలు కలిసాక కొంచెం దైర్యం వచ్చింది. కళ్ళు పూర్తిగా విప్పార్చి సూటిగా రజియా కేసి చూసాను.ఒక మెరుపు మెరిసింది.

ఆ వెలుగులో ఆమె కనబడింది.ఆమె కళ్ళలో నుంచి యేవో కిరణాలు నాకళ్ళలోకి ప్రసరించాయి. కళ్ళు చెదిరిపోయే అందం.బీ సరోజ,సావిత్రి,జమున,శ్రీదేవి,సౌందర్య,ఇలియానాల అందాలన్నీ కలబొసిన మెరుపు తీగలా ఉంది. ఆ అద్భుత సౌందర్య రాశి ని చూడగానే నన్ను మర్చిపోయాను. నన్నేదో మోహపరవశం కమ్మేసింది.

“మూర్తీ “..పిలిచింది రజియా….ఆమె గొంతులో ఏదో మత్తు. “ఊ” అన్నాను ఆ పరవశంలోనే. “ఐ లవ్ యు” అంది .. దెయ్యాలకు ఇంగ్లిష్ కూడా వచ్చా?అనే సందేహం రాలేదు ఆక్షణాన. ఏదో మత్తులో ..గమ్మత్తులో పడిపోయాను. “జన్మ .. జన్మల నుంచి నీకోసం వేచి చూస్తున్నా.ఇన్నాళ్ళకు కనబడ్డావ్”..అంది రజియా.

“నిజంగానా?” “అవును .”. “అన్నట్టు ఇక్కడేమి చేస్తున్నావ్ ?” అడిగాను “పక్కనే ఉన్న లోయలో గుప్త నిధి ఉంది …దాన్ని నీకు అప్పగించాలని ఎదురు చూస్తున్నా.” “గుప్త నిధులా??ఎక్కడ? “ఆశగా అడిగాను . “అవి మనకే సొంతం …అయితే ఒక షరతు..” “ఏంటది ”  “నువ్ నన్ను పెళ్లి చేసుకుంటేనే అది మనకు దక్కుతుంది.”

“పెళ్ళా ?”అన్నా ఆశ్చర్యంగా . “ఏం చేసుకోవా ? ” రజియా గొంతులో కోపం ధ్వనించింది. దాంతో బెదిరి పోయి” అదేమీ లేదు ….కానీ..” అంటూ నసిగాను. “నీ సందేహం అర్ధమైంది..పెళ్లి ఎలా,ఎపుడు చేసుకోవాలో తర్వాత చెబుతాను.”అంది రజియా.
“సరే.” అన్నాను.   “అయితే పద ”  “ఎక్కడికి ?”  “లోయలోకి “

“ఇప్పుడెందుకు ?”  “నిధులు తెచ్చుకుందాం” అంది నా చేయి గట్టిగా పట్టుకుని గుంజి నట్టు అనిపించింది. “ఈ చీకట్లోనా?”  “అవును …ఇదే సరైన సమయం.చాలామంది ఆ నిధుల కోసం గాలిస్తున్నారు.ఎలాగైనా మనమే దక్కించుకోవాలి” అంది రజియా. “సుమారుగా ఎన్ని కోట్లు ఉంటాయి అక్కడ” “కొన్ని లక్షల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉంటాయి…అందుకే మనం తొందర పడాలి.”

“అయితే ఒకే. “అన్నాను హుషారుగా … “నేను ముందు నడుస్తా ..నా వెనుకనే వచ్చేయి.” “అలాగే.”  ….   రజియా ముందు నడుస్తోంది. … “రా రా ..” అంటోంది అదో రకమైన తన్మయత్వంలో. ఆ నిశబ్ద నీరవ నిశీధిలో పిచ్చోడిలా ఆమె వెనుకనే అడుగులు వేస్తున్నా.  లోయ చివరి దాకా వచ్చేసాం.

“రా రా “అంటోంది రజియా……   ఇక మిగిలింది .ఒకే అడుగు.
ఇంతలోనా రెండు చేతులు పట్టుకొని వెనక్కి బలంగా లాగారెవరో.విసురుగా వెనక్కి వచ్చి పడ్డాను.
కళ్ళు తెరిస్తే ఎదురుగా సాదిక్ …వేణుగోపాల్..అటు చూస్తే…పెద్ద లోయ….  ఒక్క అడుగులో ప్రమాదం తప్పింది.

————-  KNMURTHY

ఇది కూడా చదవండి >>>>>>>   బీదర్ కోట లో ఆ రాత్రి ….

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!