ఎవరీ శిల్పి అరుణ్ యోగి రాజ్ ?

Sharing is Caring...

A wonderful sculptor……..

అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని ఆకట్టుకునే రీతిలో రూపొందించిన శిల్పి అరుణ్ యోగి రాజ్ కర్ణాటక లోని మైసూరు అగ్రహారానికి చెందినవాడు. అరుణ్ రాజ్ పూర్వీకులు కూడా పేరున్న శిల్పులే. ఆయనకు ఈ శిల్పకళా విద్య వారసత్వం గా వచ్చింది.

అరుణ్ గతంలో సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నోశిల్పాలను సృష్టించారు. 41 ఏళ్ల అరుణ్ ఐదు తరాల శిల్పుల కుటుంబానికి చెందినవాడు. అతని తాత బసవన్న ప్రఖ్యాత శిల్పిగా గుర్తింపు పొందారు. ఆయన తండ్రి కూడా శిల్పకళా విద్యలో నిష్ణాతులు . తండ్రి, తాతలు మైసూర్ మహారాజావారి  సంస్థానంలో పనిచేసేవారు.

కుటుంబ వారసత్వం ఉన్నప్పటికీ, అరుణ్ మొదట్లో శిల్పకళను పూర్తి స్థాయి వృత్తిగా తీసుకోలేదు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన తరువాత ఒక ప్రైవేట్ కంపెనీలో కొంత కాలం అరుణ్ పనిచేశారు. 2008లో తన ఉద్యోగాన్ని వదిలేసి .. పూర్తి సమయం శిల్పకళపై కేంద్రీకరించారు. తండ్రి వద్ద మెళకువలను అభ్యసించారు.స్వల్ప కాలంలోనే మంచి పేరు సంపాదించారు.

ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి వెనుక 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చెక్కింది ఈ అరుణే. బోస్ విగ్రహ ప్రతిష్ఠాపన కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. అరుణ్ కృషిని గుర్తించి అభినందించారు.

ఆవిధంగా ఆయన బిజెపి ప్రభుత్వ దృష్టిలో పడ్డారు. బోస్ శిల్ప ప్రతిష్టాపన సమయంలో, అరుణ్ ప్రధానమంత్రికి రెండు అడుగుల ఎత్తున్న బోస్ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. 2021లో కేదార్‌నాథ్‌లో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం కూడా అరుణ్ రూపొందించిందే.

అలాగే మైసూర్‌లోని KR నగర్‌లో హనుమంతుని 21 అడుగుల ఏకశిలా రాతి విగ్రహం కూడా అరుణ్ తయారు చేశారు. ఇంకా పంచముఖి గణపతి, మహావిష్ణువు, బుద్ధుడు, నంది, స్వామి శివబాల యోగి, స్వామి శివకుమార, బనశంకరి వంటి విగ్రహాలను ఆయన చెక్కారు. వివిధ దేవాలయాలలో వీటిని ప్రతిష్టించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, శ్రీ రామకృష్ణ పరమహంస,మైసూర్ మహారాజా జయచామరాజేంద్ర వడయార్ వంటి ప్రముఖుల విగ్రహాలను కూడా అరుణ్ రాజ్ రూపొందించారు.

బాల రాముడి విగ్రహనికి ప్రాణ ప్రతిష్ట జరిగిన నేపథ్యంలో అరుణ్ ఎంతో సంతోష పడ్డారు. తాను అత్యంత అదృష్టవంతుడిని అని ఫీలయ్యారు. శిల్పి అరుణ్‌కు విజేతతో వివాహం జరిగింది. ప్రస్తుతం దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న శిల్పులలో అరుణ్ ఒకరు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!