Are they just rumors? …………………..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్,జెలెన్ స్కీ ల వ్యక్తిగత వ్యవహారాలన్ని వెలుగు చూస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో ఇలాంటి కథనాలు బోలెడు చక్కర్లు కొడుతున్నాయి. పుతిన్ స్నేహితురాలు ‘అలీనా కబేవా’ గురించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో కొచ్చింది.
‘అలీనా కబేవా’ గురించి చెప్పుకోవాలంటే ఆమె రష్యన్ రాజకీయవేత్త, మీడియా డైరెక్టర్, రిథమిక్ జిమ్నాస్ట్. అలీనా రెండు ఒలింపిక్ పతకాలు, ఏథెన్స్‌లో స్వర్ణ పతకం, సిడ్నీలో కాంస్యం, మరెన్నో పతకాలు,అవార్డులు, రివార్డులు సాధించారు. 1983 లో జన్మించిన కబేవా అయిదారు ఏళ్ళ వయస్సులోనే జిమ్నాస్టిక్స్ నేర్చుకుంది.
15 సంవత్సరాల వయస్సులో ఆమె పోర్చుగల్‌లో జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. రష్యన్ జట్టులో అతి పిన్న వయస్కురాలు. ఒసాకాలో ప్రపంచ టైటిల్‌ను గెలుచుకోవడానికి ముందు అలీనా 1999లో మరోమారు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచింది.అలీనా కబేవా రిథమిక్ జిమ్నాస్టిక్స్ రంగంలో తన సత్తా చాటుకుని మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది.
అలీనా కబేవా తోటి రష్యన్ రిథమిక్ జిమ్నాస్ట్ ఇరినా చష్చినా ఇద్దరూ 2001లో డోపింగ్‌కు పాల్పడ్డారు, దీంతో పోటీలలో పాల్గొనేందుకు అనర్హులు అయ్యారు. అలీనా 2004లో రిటైర్మెంట్ ప్రకటించింది 2005 నుండి పబ్లిక్ ఛాంబర్ ఆఫ్ రష్యాలో సభ్యురాలిగా ఉన్నారు. 2008 నుండి నేషనల్ మీడియా గ్రూప్ పబ్లిక్ కౌన్సిల్ చైర్మన్‌గా చేస్తున్నారు.
2007 — 2014 మధ్య అలీనా కబేవా యునైటెడ్ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రష్యా పార్లమెంట్ స్టేట్ డూమా సభ్యురాలి గా చేశారు. ఆమె పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న సమయంలో 2012, 2013లో అనేక వివాదాస్పద చట్టాలపై ఓటు వేశారని అంటారు.
ఆ విషయాలు అలా ఉంటే .. పుతిన్‌కు ఈ మాజీ జిమ్నాస్ట్ తో సంబంధాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా లో కొన్ని కథనాలు వచ్చాయి. రష్యా అధ్యక్షుడు ఈ సంబంధాన్ని ఎపుడూ ధృవీకరించలేదు.
మీడియా వాళ్ళు అడిగినప్పుడు అతను అదేమీ లేదు .. అవన్నీ రూమర్స్ అని ఖండించినట్టు వార్తలు వచ్చాయి. చాలా మీడియా సంస్థలు ఈ ఇద్దరికీ ఒక బిడ్డ ఉన్నాడని రాశాయి. అధికారకంగా మాత్రం పుతిన్‌కు కేవలం ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారంటారు.
ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ KGB ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్న సమయంలో 1983లో ‘ల్యూడ్మిలా’ ను వివాహం చేసుకున్నారు. వారిద్దరి వైవాహిక జీవితం అంత సాఫీగా సాగలేదు. 30 సంవత్సరాల తర్వాత 2013 లో వారిద్దరూ విడిపోయారు. రష్యా ప్రథమ మహిళగా ఆమె సాంస్కృతిక, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనేది.
ఈ వివాహ బంధం ద్వారా పుతిన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా వారు తమ తండ్రి పేరును ఎక్కడా ఉపయోగించరు. పెద్ద కుమార్తె మరియా (మాషా) లెనిన్‌గ్రాడ్‌లో (ప్రస్తుతం సెయింట్ పీటర్స్‌బర్గ్) గోర్బచెవ్ పెరెస్ట్రోయికా (1985) సమయంలో జన్మించారు. ఆమె ఎండోక్రినాలజిస్ట్ గా చేస్తున్నారు. గ్యాస్ కంపెనీ గాజ్‌ప్రోమ్‌లో పనిచేసిన డచ్ వ్యాపారవేత్త జోరిట్ ఫాసెన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు.
పుతిన్ కుమార్తెలలో చిన్నఅమ్మాయి పేరు యెకాటెరినా. ఈమె డ్రెస్డెన్‌లో జన్మించారు. మాస్కో విశ్వవిద్యాలయంలో పెట్టుబడి కార్యక్రమాలపై పరిశోధనలు చేస్తుంటారు. యెకాటెరినా బిలియనీర్ అయిన కిరిల్ షమలోవ్‌ను వివాహం చేసుకుంది.
మాస్కో యూనివర్శిటీలోని ఆమె సహచరులు చెప్పడం ద్వారా ఆమె పుతిన్ కుమార్తె అనే సంగతి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అలీనా కబేవా స్విట్జర్లాండ్ కొండల్లో సేద తీరుతున్నట్లు కొన్ని మీడియా సంస్థల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముందుజాగ్రత్త గా పుతిన్ తన కుటుంబాన్ని అణు బంకర్లలో దాచి ఉంచారని ఈ కథనాల సారాంశం.