Ramana Kontikarla ……………….
చరిత్రలోకి చూసే కొద్దీ… తెలియని విషయాలెన్నో తెలుస్తుంటాయి. మనల్ని అబ్బురపరుస్తాయి. కొత్తగా అనిపిస్తుంటాయి. గ్రామోఫోన్ గర్ల్ గా గుర్తింపు పొంది.. లతామంగేష్కర్, రఫీ కంటే ముందే ఒక్కో పాటకు వారిని మించిన రెమ్యునరేషన్ తీసుకున్న గాయకురాలామె. అంతేకాదు, నాటి వైస్రాయ్ నే ధిక్కరిస్తూ గుర్రపుబగ్గీలపై వీధుల్లో తిరిగినా… తన ప్రత్యేక రైల్లో దేశమంతా విహరించినా.. ఆమెకే చెల్లింది. ఎవరామె..?
ఇవాళంటే ఒక్కో రికార్డింగ్ కు, కచేరీలకు లక్షల్లో రెమ్యునరేషన్. కానీ, గతంలో వందల రూపాయల్లో రెమ్యునరేషనే మహాగొప్ప. అవే నేటి లక్షలతో సరిసమానం. అలాంటి కాలంలోనే ఓ గాయని కోటీశ్వరురాలు. రాచరిక సంస్థానాల పాలనాకాలంలోనే ఆమె సూపర్ స్టార్ సింగర్.
ఆమే గౌహార్ జాన్. ఉత్తరప్రదేశ్ ఆజంగర్ కు చెందిన ఆర్మేనియన్ సంతతికి చెందిన వ్యక్తి గౌహార్ జాన్. తొలుత క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన గౌహార్ జాన్ ఆ తర్వాత ముస్లింగా మారింది. గౌహార్ జాన్ అసలు పేరు ఏంజెలీనా యోవార్ట్. తన తండ్రి విలియం యోవార్ట్ ఓ ఇంజనీర్.
తన ఆరేళ్ల వయస్సులోనే ఆయనతో తన తల్లి విక్టోరియాకు విడాకులవ్వడంతో.. తల్లీకూతుళ్లు అష్టకష్టాలనుభవించారు. ఆ తర్వాత విక్టోరియా కొన్నాళ్లకు ఖుర్షీద్ అనే ముసల్మాన్ ను పెళ్లి చేసుకుంది. విక్టోరియా కాస్తా ఇస్లాం మతం స్వీకరించాక మల్కాజాన్ గా మారిపోయింది. అప్పుడే ఇక ఏంజెలీనా పేరును గౌహార్ జాన్ గా మార్చేసింది.
తల్లి మల్కాజాన్ కూడా గొప్ప గాయకురాలు. తర్వాత కాలంలో ఆమె 1883లో కలకత్తాకు వెళ్లిపోయింది. అక్కడ గాయకురాలిగా స్థిరపడింది. కూతురు గౌహార్ కూ సంగీతం నేర్పించింది. గౌహార్ కూడా తల్లిలాగే ఎదిగింది. 1888లో తన మొట్టమొదటి స్టేజ్ షో చేసింది. ఆ తర్వాత దర్భంగా రాజస్థానంలో ఆస్థాన విద్వాంసురాలిగా నియమితురాలైంది.
స్టార్ సింగర్ గా గౌహార్ జాన్
1900 సంవత్సరం తొలినాళ్లల్లో భారతదేశ నిష్ణాతులైన గాయకుల్లో ఒకరిగా ఎదిగింది. కనీసం అరగంట, నలభైఐదు నిమిషాల పాటు ఒక్కో కీర్తన ఆలపించే నాటి రోజుల్లో ఆమె గ్రామఫోన్ రికార్డ్స్ కోసం ఆమె కీర్తనలను కేవలం రెండు, మూడు నిమిషాలకు కుదించి పాడించే వారు.. ఆ కాలంలో అదో సంచలనం.. ఆమె గ్రామఫోన్ రికార్డులతో నాడు బీరువాలన్నీ నిండిపోతున్న రోజులవి.
ఆ సమయంలో గౌహార్ ఒక్కో రికార్డింగ్ కు వెయ్యి రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకూ ఛార్జ్ చేసేది. దశాబ్దాల తర్వాత లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ వంటి గాయకులు 1950ల్లో కూడా ఒక్కో పాటకు కేవలం 500 రూపాయలు ఛార్జ్ చేసేవారంటే.. అంతకుముందే, గౌహార్ జాన్ కు గాయకురాలిగా ఎంత డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో కుటుంబాల వార్షిక ఆదాయం కంటే కూడా ఒక్కో పాటకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ఎక్కువ.
అలా ఏమీ లేని స్థితి నుంచి ఆమె ధనవంతురాలైంది. ఆ కాలంలో గుర్రపుబగ్గీలో సాయంకాలాలు నగరమంతా తిరిగేది. భారతదేశ వైస్రాయ్ మాత్రమే అలా తిరుగుతున్న రోజుల్లో ఆమె కూడా గుర్రపు బగ్గీల్లో తిరగడాన్ని నాటి వైస్రాయ్ జీర్ణించుకోలేకపోయాడు. గౌహార్ జాన్ కు ఏకంగా నాడు వెయ్యి రూపాయల జరిమానా విధించాడు.
జరిమానా చెల్లించిందే తప్ప… తన గుర్రపు బగ్గీ ప్రయాణాన్నిమాత్రం ఆవిడ వదులుకోలేదు. అంతేకాదు, ఆమె పోషకుల్లో ఒకరైన రాజు ఆమె భారతదేశమంతటా తిరిగేందుకు ప్రైవేట్ రైలునే బహుమతిగా ఇచ్చారంటే గౌహార్ జాన్ స్టార్ డమ్ ఏపాటిదో చెప్పనక్కర్లేదు.
1911లో ఢిల్లీ దర్బార్ లో జరిగిన ఐదో కింగ్ జార్జ్ పట్టాభిషేకంలోనూ ఆమె పాట కచేరీ ఉండి తీరాల్సిందేనని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సంస్థానాధీపతులు కాకుండా కోటీశ్వరులైనవారిలో ఒకరిగా కూడా గౌహార్ జాన్ ఖ్యాతికెక్కింది.
గౌహార్ జాన్ చివరిరోజులు
ఆమె అనారోగ్యం పాలయ్యాక, తన చివరి రోజుల్లో మైసూరుకు వెళ్లిపోయారు. అప్పటి పాలకుడు నాల్గవ కృష్ణరాజ వడియార్ ప్యాలెస్ లో ఆస్థాన విద్వాంసురాలిగా నియమితులయ్యారు. చివరకు 1930లో 56 ఏళ్ల వయస్సులోనే గౌహార్ జాన్ తీవ్ర అనారోగ్యంతో మరణించింది. ఆమె సంపదపై ఆశపడ్డ చాలామంది తామే ఆమె వారసులమంటూ ముందుకొచ్చి క్లెయిమ్ చేసుకున్నారు.
కానీ, అప్పటికే ఆమె తానెంత సంపాదించిందో అంతా ఖర్చు చేసి, బతికినన్నాళ్లు విలాసంగా, వినోదంగా జీవించి వెళ్లిపోయారు. గాయకురాలిగా గౌహార్ జాన్ స్ఫూర్తితోనే ఆ తర్వాతి తరం గాయకులైన బేగం అక్తర్, నూర్ జహాన్ వంటివారు గాయణీమణులుగా రాణించారు. మొత్తంగా భారతదేశ గ్రామోఫోన్ గర్ల్ గా గౌహార్ జాన్ పేరు ఆ కాలంలో మారుమ్రోగిపోయింది.