ఏపీ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. వైసీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే బద్వేలు ఉప ఎన్నిక రావడంతో వాతావరణం హాట్ హాట్ గా మారే సూచనలున్నాయి. ఈసారి బరిలోకి జనసేన కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ .. టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా ఇతరుల సంగతి తేలలేదు. ఈ ఉప ఎన్నిక సీఎం జగన్ సొంత జిల్లాలో జరగనున్నది కాబట్టి వైసీపీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.
వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ గెలుపు బాద్యతను పార్టీ నేతలకు జగన్ అప్పగించారు. ఇంచార్జి బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి చేపట్టనున్నారు. 2019 లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు.ఇపుడు ఆ కుటంబాని కే టిక్కెట్ కేటాయించారు. ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు ముందుకు రావాలని వైసీపీ పిలుపు ఇవ్వగా .. టీడీపీ ముందుకు రాలేదు. గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ నే బరిలోకి దింపుతోంది.
గత ఎన్నికలో వైసీపీ ఇక్కడ 44734 ఓట్ల మెజారిటీ తో గెలిచింది. తెలుగుదేశం 50748 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. జనసేన ఈ సీటును బీఎస్పీ కి కేటాయించింది.ఆ పార్టీ తరపున నాగి పోగు ప్రసాద్ పోటీ చేశారు. ఆయనకు 1321 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి జయరాములు కి 735 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 2337 ఓట్లు వచ్చాయి. ఇక్కడ అంత బలం లేకపోయినా జనసేన ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నదో ? పవన్ ఇపుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నాడు బీఎస్పీ కి పడిన మళ్ళీ ఓట్లు పడతాయో లేదో అనుమానమే.
ఇక బీజేపీ బలం కూడా నామమాత్రమే. ఆ రెండు పార్టీలు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో లేవనే చెప్పుకోవాలి. తెలుగు దేశం మాత్రమే కొంత మేరకు పోటీ ఇవ్వొచ్చు. కాగా 2014 ఎన్నికల ఫలితాలను గమనిస్తే …. అప్పటి వైసీపీ అభ్యర్థి జయరాములు కి 78879 ఓట్లు వచ్చాయి .. టీడీపీ అభ్యర్థి విజయజ్యోతికి 68800 ఓట్లు పడ్డాయి. వైసీపీకి 9502 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2014 తో పోలిస్తే 2019 లో వైసీపీ కి మెజారిటీ గణనీయంగా పెరిగింది. టీడీపీ కి ఓట్లు బాగా తగ్గాయి.
2009.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. తర్వాత రోజుల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్యనే పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ కి 40-50వేల ఓట్ల బలం ఉంది. 1985, 1994, 99 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఆ తర్వాత రెండో స్థానానికే పరిమితమయింది.
వైసీపీ తమ పట్టు నిరూపించుకొనేందుకు వ్యూహ రచన చేస్తోంది. 2019 కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని పావులు కదుపుతోంది.
బద్వేల్ లో పలు అభివృద్ధి పనులకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రెండునెలల క్రితం 130 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు జగన్. సాగునీటి పనులకు మరో రూ. 110 కోట్లు కూడా జగన్ కేటాయించారు. కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ పార్టీ గెలుపుకు దోహద పడతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని అది తమ గెలుపుకు దోహద పడుతుందని తెలుగు దేశం భావిస్తోంది.
———–KNM