ఎవరీ తమిళ తంబీలు ?

Sharing is Caring...

One time Jayalalitha’s close friends……………….

పై ఫొటోలో కనిపిస్తున్న మొదటి వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో వినిపిస్తున్న దినకరన్.ఇక రెండోవ్యక్తి అతని సోదరుడు సుధాకరన్. ఈ ఇద్దరూ ఒకప్పుడు జయలలిత సన్నిహితులు. అంతేకాదు.వీరు జయ నెచ్చెలి శశికళ అన్న కుమారులు. అంటే మేనల్లుళ్ళు.జయలలితకు బాగా ఇష్టమైన వారు కూడా. శశికళ ద్వారానే జయకు పరిచయమైనారు.

దినకరన్ అన్నాఎంకే పార్టీ లో చేరాడు. జయతో కలసి  ప్రచారాల్లో, సమావేశాల్లో పాల్గొనే వాడు. కుర్రాడు చురుగ్గా ఉన్నాడని .. హుషారుగా పనిచేస్తున్నాడని భావించి జయలలిత దినకరన్ కి  1999 లో పెరియాకుళం లోకసభ టిక్కెట్ కూడా ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన దినకరన్ రెండో సారి 2004 లో కూడా అక్కడ నుంచే పోటీ చేసాడు. కానీ ఓడిపోయాడు. అపుడు అతగాడిని జయలలిత రాజ్యసభకు పంపింది.

అయితే ఆ విశ్వాసాన్ని దినకరన్ నిలుపుకోలేకపోయాడు. అదే సమయంలో శశికళ పై కూడా జయకు అనుమానాలు కలిగాయి. తనతో ఉన్న చనువును అడ్డం పెట్టుకుని శశికళ,దినకరన్ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని జయకు ఫిర్యాదులు అందాయి.

శశికళ అదేసమయంలో జయపై విషప్రయోగం కూడా చేసిందని ఆరోపణలు వచ్చాయి. అపుడు జయ వీరందరిని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టింది. తిరిగి ఈ ఇంటి మొహం చూడవద్దని ఆదేశించింది. పార్టీ లో సభ్యులైన శశికళ, దినకరన్ లను సస్పెండ్ చేసింది.

కాగా అంతకుముందు ఈ దినకరన్ సోదరుడు సుధాకరన్ ను 1995 లో జయలలిత దత్తత కూడా తీసుకుంది.తర్వాత సుధాకరన్ పెళ్లి ప్రముఖనటుడు శివాజీ గణేశన్ చిన్న కుమార్తెతో అంగరంగ వైభవంగా జరిపించింది.  కొన్ని కోట్ల రూపాయలు ఈ పెళ్ళికి జయలలిత ఖర్చుపెట్టారనే ఆరోపణలు వచ్చాయి.

సీఎం గా రూపాయి జీతం తీసుకుంటున్న జయ కోట్లు ఖర్చుపెట్టి దత్త పుత్రుడి వివాహం ఎలా జరిపించారని విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. దేశంలో జరిగిన అతి ఖరీదైన పెళ్లిళ్లలో సుధాకరన్ పెళ్లి ఒకటి అని ఇప్పటికి చెప్పుకుంటారు. ఇక అప్పట్లో సుధాకరన్ జయ వారసుడిగా రాజకీయాల్లోకి వస్తాడని కూడా ప్రచారం జరిగింది.

సుధాకరన్ జయ ఆర్ధిక వ్యవహారాలు కూడా చూసేవారు. వ్యాపార నిమిత్తం ఎంతో సొమ్ము తీసుకున్నారని కూడా అంటారు.అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు రావడంతో జయ అతగాడిని పక్కన బెట్టారు. దత్తత తీసుకున్న ఏడాది తర్వాత  జయ ఇకపై సుధాకరన్ తన దత్తపుత్రుడు కాదని ప్రకటించింది.

తల్లి కొడుకులుగా వారి బంధం కనీసం ఏడాది కూడా నిలవలేదు. అది పక్కన బెడితే జయ తర్వాత రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెపై కేసులు కూడా బుక్ అయ్యాయి. వీటి అన్నింటి నుంచి తట్టుకుని నిలబడటానికి చాలా టైం పట్టింది.

2012 లో శశికళ జయ కాళ్లపై పడి క్షమాపణలు కోరింది. తన బంధుగణం తో సంబంధాలు లేవని..ఇక ఏ తప్పు చేయనని లిఖితపూర్వకంగా  జయకు రాసి ఇచ్చింది. దీంతో శశిని జయ మళ్ళీ చేరదీసింది. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. జయ చనిపోగానే దినకరన్ మళ్ళీ ఎంటరయ్యాడు.

శశికళ అతగాడిని  పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా నియమించింది. తానే సీఎం అవుదామని శశికళ అనుకుంటుండగా అనూహ్యంగా అరెస్ట్ అయి జైలు కెళ్ళింది. నాడు ఆమెతో పాటు సుధాకరన్ కూడా జైలుకెళ్లారు. ఆ తరుణంలో ఆమె సూచించిన  పళనీ స్వామి సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వమ్ ను నియమించారు. ఈ ఇద్దరు కలసి శశికళను , దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించారు.

ఈ క్రమం లోనే దినకరన్ “అమ్మ మక్కల్ మున్నేట్రా కజగం” పేరిట ఒక కొత్త పార్టీ పెట్టారు. ఈ పార్టీకి దినకరన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ శశికళ ను అధ్యక్షురాలిగా పెట్టుకున్నారు. అంతలోనే 2017 లో జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ కు ఉపఎన్నిక అనివార్యమైంది. జయలలిత మరణమే ఆ ఉపఎన్నికలో ప్రచారాస్త్రంగా మారింది.

డీఎంకే ,అన్నాడీఎంకే కు పెద్ద సవాల్ గా మారింది.ఆ రెండు పార్టీలను డీ కొట్టి దినకరన్ ఇండిపెండెంట్  గా 40707 ఓట్ల మెజారిటీ తో గెలిచి సంచలనం సృష్టించాడు. అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు తమకే కేటాయించాలని దినకరన్‌ వర్గం ఎన్నికల సంఘాన్ని, కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో దినకరన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.అపుడే ఈసీ లో ఒకరికి లంచం  ఇవ్వడానికి ప్రయత్నించి అరెస్ట్ కూడా అయ్యారు.

తర్వాత కాలంలో రాజకీయంగా నిలదొక్కుకోవడానికి దినకరన్ ప్రయత్నించాడు కానీ తన ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. తాజాగా దినకరన్ బీజేపీ తో పొత్తు కుదుర్చుకుని లోకసభలో పోటీ చేయబోతున్నారు.  

————-K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!