ఢిల్లీ ఓటర్ మొగ్గు ఎటు ??

Sharing is Caring...

 All eyes are on the Delhi elections …………………

ఢిల్లీ ఓటర్ ఎవరివైపు ఉన్నారనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.దేశవ్యాప్తంగా అందరి చూపు ఢిల్లీ ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్,బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ సారి కాంగ్రెస్ కూడా బరిలోకి దిగబోతున్నది.

2013, 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ వరుస విజయాలు సాధించింది. (2013 లో పాక్షిక విజయమనే చెప్పుకోవాలి )అయితే ఒకప్పుడు మార్పుకు కారణమైన ఆప్ పార్టీ ఇపుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో నాటి సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయి దాదాపు ఆరు నెలల జైలులో ఉన్నారు.

ఆయనతోపాటు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్‌లతో సహా ఆప్ కీలక నేతలు అరెస్టు అయి జైలు పాలయ్యారు.తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైనవి గా చెప్పుకోవచ్చు.

దేశాన్ని పాలిస్తున్నబీజేపీ.. 27 ఏళ్లుగా దేశ రాజధానిలో మటుకు అధికారానికి దూరంగా ఉంటోంది.బీజేపీ తరపున దివంగత సుష్మా స్వరాజ్ 1998 లో 52 రోజులు సీఎం గా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.షీలా దీక్షిత్ సీఎం అయ్యారు.2013 వరకు వరుసగా అధికారంలో కొచ్చారు.   

ఆప్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను .. 29.49% ఓట్లతో 28 సీట్లు గెలుచుకుంది. 8 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ సీఎం అయ్యారు. 31 సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు తీసుకున్నా ..దీర్ఘకాలం అధికారం లో కొనసాగడం కష్టమని భావించి సైలెంట్ గా ఉండిపోయింది.

కేజ్రీవాల్ 49 రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల తర్వాత 2015లో 54.34% ఓట్‌ షేర్‌తో 67 సీట్లు గెలిచారు. బీజేపీకి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌ ఒక్క చోటా కూడా గెలవలేదు. ఇక 2020 ఎన్నికల్లో దాదాపుగా అవే ఫలితాలు వచ్చాయి.ఆప్ బలం 62 కి పడిపోయింది. 8 సీట్లు బీజేపీకి దక్కాయి.

గత మూడు పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ రాజధాని లోని ఏడు లోకసభ స్థానాలను గెలుచుకోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తుంటే ఢిల్లీ ఓటర్లు లోకసభ ఎన్నికల్లో ఒక విధంగా, అసెంబ్లీ ఎన్నికల్లో మరో విధంగా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు.  

ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడంటూ అభివృద్ధి మంత్రంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రజల ముందు కొచ్చింది. గత 11 ఏళ్లుగా ఢిల్లీలో బలహీన పడిన కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. బీజేపీ,ఆప్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదృష్ట్యా తమను గెలిపించాలని అడుగుతోంది. ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని ప్రచారం చేస్తోంది. 

చిత్రమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్, ఆప్ ‘ఇండియా కూటమి’ భాగస్వాములు.. దేశ రాజధానిలో మాత్రం ప్రత్యర్థులు గా వ్యవహరిస్తున్నాయి. ఈ అంశం బీజేపీ కి కలసి వస్తుందో లేదో ? ఫలితాలు వచ్చాక కానీ తేలదు.

పదేళ్లుగా ఆప్ పాలన..కేంద్రం లోని ఎన్డీయే పాలన ను చూస్తున్న ఢిల్లీ ఓటర్లు ఏ పార్టీ కి అధికారం అప్పగిస్తారో వేచి చూడాల్సిందే.  ఫిబ్రవరి 5వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది.ఫిబ్రవరి 8న ఓట్లు ఫలితాలు వెలువడుతాయి.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!